Pawan Kalyan satarday Tour: తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న సన్నిధిలో శనివారం ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ శనివారం ఉదయం కొండగట్టు క్షేత్రాన్ని దర్శించుకోనున్నారు. ఈ పర్యటనలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) మంజూరు చేసిన రూ.35.19 కోట్ల భారీ నిధులతో నిర్మించనున్న భక్తుల వసతి సత్రం, దీక్షా విరమణ మండపం నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేస్తారు. ఉదయం 10:30 గంటల నుండి 11:30 గంటల మధ్య ఈ కార్యక్రమాలు జరగనున్నాయి.
కొండగట్టు అంజన్నను తన ఇలవేల్పుగా పవన్ కళ్యాణ్ భావిస్తారు. ఎన్నికల విజయం అనంతరం స్వామివారిని దర్శించుకున్న సమయంలో భక్తుల అవసరాలను గుర్తించారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు వసతి సౌకర్యాలు లేక, దీక్షా విరమణ సమయంలో పడుతున్న ఇబ్బందులను ఆలయ అధికారులు, అర్చకులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్, కొండగట్టు అభివృద్ధికి టి.టి.డి సహకారం అందించాలని ప్రతిపాదించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించడంతో టి.టి.డి నిధుల విడుదలకు మార్గం సుగమమైంది.
టి.టి.డి ఛైర్మన్ బి.ఆర్.నాయుడు తో పవన్ కళ్యాణ్ జరిపిన చర్చల ఫలితంగా, బోర్డు రూ.35.19 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన 96 గదుల భారీ సత్రం, అలాగే ఒకేసారి 2 వేల మంది భక్తులు దీక్షలు విరమించేలా విశాలమైన మండపాన్ని నిర్మించనున్నారు. ఈ కార్యక్రమంలో టి.టి.డి ఛైర్మన్‌తో పాటు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం , టి.టి.డి బోర్డు సభ్యులు పాల్గొననున్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఆధ్యాత్మిక, సాంస్కృతిక బంధాన్ని ఈ ప్రాజెక్టు మరింత బలోపేతం చేయనుంది.
ఆలయ అభివృద్ధి కార్యక్రమాల అనంతరం పవన్ కళ్యాణ్ గారు రాజకీయ కార్యకలాపాలపై దృష్టి సారించనున్నారు. కొడిమ్యాల సమీపంలోని బృందావనం రిసార్టులో జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు, కార్యకర్తలతో ఆయన ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ముఖ్యంగా, ఇటీవలి తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో జనసేన మద్దతుతో విజయం సాధించిన ప్రతినిధులను ఆయన కలిసి, అభినందనలు తెలియజేయనున్నారు. తెలంగాణలో పార్టీ బలోపేతం, భవిష్యత్తు కార్యాచరణపై ఈ సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు.