Patancheru Mla Mahipal Brother Arrested in Illegal Mining: అక్రమ మైనింగ్ ఆరోపణలతో పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి (Mahipal Reddy) సోదరుడు మధుసూదన్ రెడ్డిని (Madhusudhan Reddy) పోలీసులు అరెస్ట్ చేశారు. మండలంలోని లక్డారం గ్రామంలో సంతోష్ గ్రానైట్ మైనింగ్ పేరుతో ఆయన క్రషర్ కంపెనీలు నిర్వహిస్తున్నారు. పరిమితికి మించి గుట్టల్ని తవ్వేస్తున్నారని.. అనుమతుల గడువు ముగిసినా మైనింగ్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మధుసూదన్ పై అక్రమ మైనింగ్, ఛీటింగ్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి.. క్రషర్లను సీజ్ చేశారు. అయితే, ఆయన్ను తరలిస్తుండగా బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసులను అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. వైద్య పరీక్షల నిమిత్తం ఆయన్ను ఆస్పత్రికి తరలిస్తుండగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన నిర్వహిస్తూ పోలీసులను అడ్డుకున్నారు. వారిని నిలువరించిన పోలీసులు మధుసూదన్ ను సంగారెడ్డి తరలించారు. ఆస్పత్రిలోకి వెళ్లేందుకు పార్టీ కార్యకర్తలు యత్నించగా ప్రధాన ద్వారం మూసేశారు. దీంతో వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.


మరోవైపు, మధుసూదన్ అరెస్ట్ నేపథ్యంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వ తీరును ఖండించారు. దేశం మొత్తంలో ఎన్నో క్వారీలున్నాయని.. పూర్తి అనుమతితోనే తమ క్వారీలు నడిపిస్తున్నామని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపారు. 'ప్రజల మద్దతుతో కింది స్థాయి నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్నాం. ప్రభుత్వ బెదిరింపులకు భయపడేది లేదు. నా సోదరున్ని అక్రమంగా అరెస్ట్ చేశారు. ఈ విషయంపై ప్రజా కోర్టులోనే తేల్చుకుంటాం.' అని స్పష్టం చేశారు.


'కావాలనే టార్గెట్ చేశారు'


కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కంటే ప్రతిపక్షాలను వేధించడంపైనే ఎక్కువ ఫోకస్ పెట్టిందని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే సోదరుడు మధుసూదన్ రెడ్డిని అరెస్ట్ చేయడంపై మండిపడ్డారు. 'కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనను గాలికి వదిలేసింది. మా ఎమ్మెల్యేలపై అక్రమ కేసులు బనాయిస్తూ వారిని తమ పార్టీలో కలుపుకొనే ప్రయత్నం చేస్తోంది. ప్రతిపక్షాలపై బురద జల్లే ప్రయత్నం చేస్తోంది. తెల్లవారుజామున వందల మంది పోలీసులు వెళ్లి మధుసూదన్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది.?. ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వకుండా పోలీసులు అరెస్ట్ చేశారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదనేది పోలీసులు గుర్తు పెట్టుకోవాలి. ప్రతిపక్ష నేతలను ఏదో ఓ విధంగా జైలుకు పంపాలని చూస్తున్నారు. అధికార పార్టీ నేతలకు అక్కడ క్రషర్లు ఉండి.. అనుమతులు లేకున్నా నడుస్తున్నాయి. ఈ వ్యవహారంలో న్యాయ పోరాటం చేస్తాం.' అని హరీష్ రావు స్పష్టం చేశారు.


Also Read: MLC election tension for BRS : ఓటర్ల బలమున్నా ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకోగలరా ? లోక్‌సభ ఎన్నికల కంటే ముందే బీఆర్ఎస్‌కు కొత్త టెన్షన్ !