Pass Port Online Services: పాస్ పోర్టు తీసుకోవాలాన్నా, మార్పులు, చేర్పులు చేయాలన్నా అంతెందుకు ఏదైనా అనుమానం వస్తే నివృత్తి చేసుకోవాలన్నా  గతంలో అయితే తలకు మించిన భారమే. ప్రతి ఒక్కరూ హైదరాబాద్ లో ఉన్న ప్రాంతీయ పాస్ పోర్టు(Passport) జారీ కేంద్రానికి వచ్చి గంటల తరబడి క్యూలైన్ లో ఉండి సమస్యలు పరిష్కరించుకోవాల్సి వచ్చేది. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారు అయితే ఒకటి, రెండు రోజులు సిటీలోనే ఉండి అన్ని పనులు చక్కబెట్టుకుని పోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. దాంతో పాటే సౌకర్యాలు మెరుగయ్యాయి. మీ ఇంట్లో ఉండి ఒక్క క్లిక్ చేస్తే చాలు, సమస్త సమాచారం మీ ముంగింట ఉంటుంది. అదే విధంగా ప్రాంతీయ పాసుపోర్టు కార్యాలయం సైతం సాంకేతికతను వినియోగించుకుని  కార్యాలయానికి  రాకుండానే చాలా వరకూ సమస్యలను ఆన్లైన్ లోనే పరిష్కరిస్తోంది. ఇప్పుడు అలాంటి మరో అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.. హైదరాబాద్(Hyderabad)లోని ప్రాంతీయ పాసుపోర్టు జారీ కేంద్రం.


ఆన్‌లైన్‌లోనే అన్నీ


పాసుపోర్టులో సమస్యల కోసం కార్యాలయం వరకు రావాల్సిన పనిలేదని హైదరాబాద్(Hyderabad) ప్రాంతీయ పాస్ పోర్టు కార్యాలయం తెలిపింది. అధికారిక ఎక్స్ (X)ఖాతాతో పాటు, ఈమెయిల్(E-Mail), వాట్సాప్(Whatsup) ద్వారా దరఖాస్తుదారుల ఇబ్బందులు తొలగిస్తామంటోంది. అప్లికేషన్‌ రిఫరెన్స్‌ నెంబర్‌ , దరఖాస్తుదారు పేరు, సందేహం.. తదితర వివరాలను పేర్కొన్న ఫార్మాట్‌లో నమోదు చేస్తే చాలు.. 24 నుంచి 48 గంటల్లో సమస్య పరిష్కరించనున్నారు. ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం పరిధిలో 5 పాస్‌పోర్టు సేవాకేంద్రాలు , 14 పోస్టాఫీసు సేవాకేంద్రాలు  ఉన్నాయి. ప్రతిరోజూ 3 వేలకు పైగా సాధారణ పాస్‌పోర్టు దరఖాస్తులు, 48 0కి పైగా తత్కాల్‌ దరఖాస్తులు, 200 పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్‌లు మంజూరవుతుంటాయి. అపాయింట్‌మెంట్‌ లభించిన తర్వాత కొందరు దరఖాస్తుదారులకు వివిధ కారణాలతో పాస్‌పోర్టు జారీకి అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఇలాంటివి 5 శాతం ఉంటున్నాయని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఎక్కువగా పోలీస్‌ వెరిఫికేషన్‌ పూర్తైనా పాస్‌పోర్టు రాకపోవడం, కోర్టు కేసుల చిక్కులు, రీవెరిఫికేషన్‌కు అభ్యర్థించినా పూర్తి కాకపోవడం, విదేశాలకు వెళ్లే వారికి పోలీస్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్లు రాకపోవడం, సాధారణం నుంచి తత్కాల్‌కి అపాయింట్‌మెంట్‌ మార్చుకోవడం,  వివరాల్లో పొరపాట్లు దొర్లడంతో ఇబ్బందులు వంటివి ఎదురవుతున్నాయి. ఇలాంటి సమస్యలను పరిష్కరించాలంటూ పలువురు సికింద్రాబాద్‌(Secandrabad)లోని ప్రధాన కార్యాలయానికి క్యూ కడుతున్నారు. అయితే ఇలాంటి చిన్న చిన్న సమస్యలకు  కార్యాలయం వరకు రావాల్సిన అవసరం లేకుండానే  పరిష్కరించవచ్చని అధికారులు భావించారు. వివరాలు పంపితే, సరిచూసుకుని క్లియర్ చేయవచ్చని భావించారు. దీని కోసం దరఖాస్తుదారుడిని  కార్యాలయం వరకు రప్పించడం వల్ల అతనికి శ్రమ, విలువైన సమయం వృథాకావడమే గాక...పెద్దఎత్తున తరలివస్తున్న వారితో ప్రాంతీయ కార్యాలయంలోనూ  ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో అధికారిక సామాజిక ఖాతాల ద్వారా వివరాలు పంపితే ఆన్‌లైన్‌లోనే సమస్యను పరిష్కరిస్తామని పాసుపోర్టు జారీ అధికారులు తెలిపారు. మెయిల్ ద్వారా వివరాలు పంపాల్సిన వాళ్లు rpo.hyderabad@mea.gov.inలోనూ సంప్రదించవచ్చని అధికారులు వెల్లడించారు.


నేరుగా ఛాటింగ్ 


ఒక్కొక్కరికి ఒకటి కన్నా ఎక్కువ సమస్యలు ఉన్నా...అప్పటికప్పుడు సందేహాలు నివృత్తి చేసుకోవాలనుకున్నా..అన్ని పని దినాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వాట్సాప్ సేలనూ ప్రాంతీయ పాసుపోర్టు కార్యాలయం అందుబాటులోకి తీసుకొచ్చింది.  8121401532 నెంబర్‌ ద్వారా ఆటో జనరేటెడ్‌ సందేశాలకు అనుగుణంగా వివరాలు అందించాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు పూర్తిచేసిన తర్వాత ఇచ్చే ఏఆర్‌ఎన్‌, పేరు, సందేహం ఫార్మాట్‌లో వివరాలు నమోదు చేయాలి. అనంతరం సమస్య ఎందుకొచ్చిందని గుర్తించి, దానికి కావాల్సిన పత్రాల సమర్పణపై సమాచారం అందిస్తారు. అధికారిక ఎక్స్ ఖాతా నుంచీ సమస్యలు పరిష్కరిస్తోంది.