Padi Kaushik Reddy bomb Comments: తెలంగాణ శాసనసభ వేదికగా అధికార కాంగ్రెస్ , ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం జరిగింది. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సభలో తీవ్ర గందరగోళానికి దారితీశాయి. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీని మరియు ఒక చెక్ డ్యాంను బాంబులు పెట్టి పేల్చేశారంటూ ఆయన చేసిన ఆరోపణలు సభను ఉలిక్కిపడేలా చేశాయి. సభలో చర్చ జరుగుతున్న సమయంలో కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన నిర్మాణాలను ప్రస్తుత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా దెబ్బతీస్తోందని ఆరోపించారు. మేడిగడ్డ తరహాలోనే తన నియోజకవర్గ పరిధిలోని తనుగుల చెక్‌డ్యాంను కూడా బాంబు పెట్టి పేల్చేశారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వానికి చెడ్డపేరు తేవడానికే ఇలా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్రంగా విరుచుకుపడ్డారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఇతర సభ్యులు లేచి నిలబడి అభ్యంతరం తెలిపారు. ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి, బాంబులు పెట్టి పేల్చారు అనే పదజాలాన్ని ఎలా వాడతారని వారు ప్రశ్నించారు. సభలో అశాంతిని ప్రేరేపించే విధంగా ఉన్న కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను వెంటనే అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌ను డిమాండ్ చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్న మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు ఎన్నికల సమయంలో కుంగిపోయాయి. అది నిర్మాణ లోపం కారణంగానే కుంగిపోయిందని నిపుణులు నివేదిక ఇచ్చారు.ఈ అంశం రాజకీయంగా చర్చనీయాంశం కావడంతో పాడి కౌశిక్ రెడ్డి పేల్చేశారన్న ఆరోపణలను తెరపైకి తెచ్చారు. సభలో మర్యాదపూర్వక పదజాలం వాడాలని, నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదని అధికార పక్షం హెచ్చరించింది. ఈ పరిణామాలతో సభలో కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది.