హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు పన్నుల పెంపు ఒక్కటే మార్గం కాదని, పన్నులు పెంచితే ప్రజల నుంచి నిరసనలు ఎదురవుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలపై ఎలాంటి అదనపు పన్ను భారం వేయకుండానే, కేవలం వ్యవస్థలోని లోపాలను సరిదిద్దడం ద్వారా ఆదాయాన్ని గణనీయంగా పెంచవచ్చని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

వ్యవస్థాగత సంస్కరణలే కీలకం ఇంటి పన్ను, జీఎస్టీ, మైనింగ్, ఎక్సైజ్ వంటి రంగాల్లో పన్నులు ఎగ్గొట్టే వారిని గుర్తించి, వారిని పన్నుల పరిధిలోకి తీసుకురావడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఇందుకోసం సీనియర్ అధికారి అరవింద్ సుబ్రమణ్యం నేతృత్వంలో ఒక ప్రత్యేక బృందాన్ని, ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ వంటి అధికారులతో ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సంస్కరణల ఫలితంగా గడిచిన నాలుగు నెలల్లో ఆదాయం క్రమంగా పెరుగుతూ వచ్చిందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ముఖ్యంగా డిసెంబర్ నుండి ప్రతి నెల 500 కోట్ల చొప్పున పెరుగుతూ, ఏప్రిల్ నెలలో ఏకంగా 1000 కోట్ల రూపాయల అదనపు ఆదాయం సమకూరిందని పేర్కొన్నారు. ఈ నెల జీఎస్టీ ఆదాయంలో 35 శాతం వృద్ధి నమోదవ్వడం విశేషమని ఆయన గుర్తుచేశారు

లీకేజీలు అరికట్టడం ద్వారా పెరిగిన ఆదాయం చిన్న చిన్న లీకేజీలను అరికట్టడం, వ్యవస్థలో చిన్నపాటి మార్పులు చేయడం ద్వారా గత నాలుగు నెలల్లో దాదాపు 2000 కోట్ల రూపాయల ఆదాయం పెరిగిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గత ఎనిమిదేళ్లుగా 600 కోట్ల వద్దే స్తంభించిపోయిన మైనింగ్ ఆదాయం, అధికారుల కృషి వల్ల ప్రస్తుతం 1100 కోట్లకు చేరిందని వివరించారు. ఎలాంటి అదనపు పన్నులు విధించకుండానే కేవలం అధికారుల పనితీరును మెరుగుపరచడం ద్వారా ఈ అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయని కొనియాడారు. 

ఏటా రూ. 36 వేల కోట్ల అదనపు ఆదాయమే లక్ష్యం అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వహిస్తే నెలకు 3000 కోట్ల రూపాయల వరకు అదనపు ఆదాయం పొందే అవకాశం ఉందని, తద్వారా ఏడాదికి 36,000 కోట్ల రూపాయల మేర రాష్ట్ర ఖజానాకు సమకూరుతుందని సీఎం రేవంత్ రెడ్డి అంచనా వేశారు. ఈ అదనపు ఆదాయం ద్వారా రాష్ట్రంలోని ఉద్యోగుల సమస్యలతో పాటు అనేక ఇతర సమస్యలను పరిష్కరించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఏడాది తిరిగేలోపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిలో స్థిరత్వం ఏర్పడుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మున్సిపల్ రిఫార్మ్స్ వల్ల కూడా అన్ని మున్సిపాలిటీల్లో ఆదాయం పెరిగిందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.