- మీ వాట్సాప్ యూనివర్సిటీలో అసత్య ప్రచారాలు మానండి....
- రైతుల దగ్గరకు వెళ్లి మాయమాటలు చెబుతున్నారు..
- బీజేపీ మోసాన్ని ప్రతి నియోజకవర్గంలో వివరిస్తాం.. ప్రజల ముందు దోషిగా నిలబెడతాం...
- బండి సంజయ్ పై ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ ఫైర్
బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్‌పై ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ ఫైరయ్యారు. పంటలు నష్టపోయిన రైతులందరినీ ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని, కేంద్రం నుంచి నువ్వెంత తెస్తున్నావో చెప్పు అని నిలదీశారు. అసెంబ్లీ ప్రాంగణంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులను ఆదుకునే విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోని బీజేపీ నాయకులు రైతుల వద్దకు వెళ్లి మోసపు మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు.
బండి సంజయ్ మెదడు మోకాళ్లలో ఉందని, అతన్ని పిచ్చి ఆస్పత్రిలో చేర్పించాలని ధ్వజమెత్తారు. జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఉండి ఏం మాట్లాడుతున్నాడో సోయి లేకుండా మాట్లాడుతున్నాడని బండి సంజయ్ వైఖరిపై బాజిరెడ్డి ఘాటుగా స్పందించారు. చెత్త ఆరోపణలు చేస్తున్నాడని, ఉల్టా చోర్ కొత్వాల్‌కు డాంటే అన్నట్టుగా బండి సంజయ్ తీరుందని అన్నారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యత్తు, రైతుబీమా, రైతుబంధు ఇస్తున్నారని, ఇప్పుడు అకాల వర్షాలతో పంట నష్టం జరిగిన ప్రతి రైతుకూ ఎకరాకు పదివేల రూపాయలు ఇస్తున్నాడని అన్నారు. కేంద్రం నుంచి కొట్లాడి రైతుల కోసం నువ్వెంత తెస్తావో అది చెప్పకుండా ... మీ వాట్సాప్ యూనివర్సిటీలో అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. రైతుల వద్దకు వెళ్లి మోసపు మాటలు చెబుతున్నారని, వీటిని రైతులు నమ్మవద్దని కోరారు. కర్ణాటకలో బీజేపీ పని అయిపోయిందని, అక్కడ ఆ పార్టీ గెలవదని స్పష్టం చేశారు. కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేలు కాంట్రాక్టర్ల వద్ద 40 శాతం కమీషన్లు తీసుకున్నారన్నారు. వ్యక్తిగత విమర్శలు మీరు మానకపోతే మేం వంద చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎంపీ అర్వింద్ వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని, అడ్డగోలు మాట్లాడటం తప్ప ప్రజలకు మేలు చేసే పని ఒక్కటి కూడా అర్వింద్ చేయలేదన్నారు బాజిరెడ్డి గోవర్దన్. బీజేపీ చేస్తున్న మోసాన్ని ప్రతి నియోజకవర్గంలో వివరిస్తామని, ప్రజల ముందు దోషిలా నిలబెడతామని అన్నారు.
వరి కోతలు ఆపండి, రైతులకు సీఎం కేసీఆర్ సూచన
రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలకు పెద్ద ఎత్తున పంట నష్టం వాటిల్లింది. ఈ క్రమంలోనే తడిసిన ధాన్యాన్ని చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్ భరోసానిచ్చారు. మామూలు వరి ధాన్యానికి చెల్లించినట్లుగానే తడిసిన ధాన్యానికి కూడా ధర చెల్లిస్తామని వివరించారు. వ్యవసాయాన్ని కాపాడుతూ... కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టం చేశారు. యాసంగి వరి ధాన్యం కొనుగోలు, అకాల వర్షాల నేపథ్యంలో తడిసిన వరి ధాన్యం సేకరణ, భవిష్యత్తులో యాసంగి వరి ముందస్తుగా కోతలకు వచ్చేలా తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. అకాల వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో యాసంగి వరి కోతలు మార్చి నెలలోపే పూర్తయ్యేలా ఎలాంటి విధానాలు అవలంభిచాలో అధ్యయనం చేయాలని ఆదేశించారు. ఈ దిశగా రాష్ట్ర రైతాంగాన్ని కూడా చైతన్యం చేయాలని చెప్పారు.