Telangana Municipal Elections 2026: ఆదిలాబాద్‌లో కత్తితో పోలింగ్ కేంద్రానికి వచ్చిన మహిళ.. పీఎస్‌కు తరలించి కేసు నమోదు
ఆదిలాబాద్ జిల్లాలో ఓ మహిళ కత్తితో పోలింగ్ కేంద్రానికి రావడం కలకలం రేపుతోంది. ఆమెతో పాటు భర్తను కూడా పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసివిచారణ చేపట్టారు.

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని 11వ వార్డు రాంనగర్ పోలింగ్ కేంద్రంలో బుధవారం ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఓటు వేసేందుకు వచ్చిన పర్వీన్ అనే మహిళను పోలీసులు తనిఖీ చేయగా, ఆమె వద్ద కత్తి లభ్యమైంది. వెంటనే స్పందించిన మహిళా పోలీసులు కత్తిని స్వాధీనం చేసుకుని, ఆమెను మావల పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆమెతో పాటు ఆమె భర్తను సైతం అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించి విచారణ చేపట్టారు. ఎన్నికల వేళ ఆయుధంతో రావడంతో తోటి ఓటర్లు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 10 మున్సిపాలిటీలు, 1 కార్పొరేషన్ కు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ మందకొడిగా కొనసాగుతోంది. ఆదిలాబాద్ లో పలు చోట్ల ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బులు పంచుతున్నారన్న సమాచారంతో పోలీసులు పలువురిపై కేసులు నమోదు చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ డబ్బులు పంచుతున్న ఇద్దరిపై ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాటిపెల్లి రాజారెడ్డి నుంచి రూ.3,440, మేకల కృష్ణ కుమార్ నుంచి రూ.2,700 నగదును స్వాధీనం చేసుకున్నట్లు సీఐ సునీల్ కుమార్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల సమీపంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించిన వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నామన్నారు. కేసు దర్యాప్తులో ఉందని వెల్లడించారు.
ఓటర్లకు అరటిపండ్లు పంచుతున్న వ్యక్తిపై కేసు – ఆటో సీజ్
ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ ఓటర్లను ప్రలోభపెట్టే ఉద్దేశంతో అరటిపళ్ళు పంచుతున్న వ్యక్తిపై ఆదిలాబాద్ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు టూ టౌన్ సీఐ కె. నాగరాజు తెలిపారు. ఆదిలాబాద్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహాలక్ష్మివాడలో ఓటు వేయడానికి వెళ్తున్న ఓటర్లకు అరటిపళ్ళు పంచుతూ ప్రలోభపెడుతున్న ఆటో డ్రైవర్ మహమ్మద్ అర్షద్‌ను పోలీసులు గుర్తించారు. ఎన్నికల నియమ నిబంధనలను ఉల్లంఘించినందుకు అతనిపై కేసు నమోదు చేసి, ఉపయోగించిన ఆటోను సీజ్ చేసినట్లు తెలిపారు.
ఎన్నికల సమయంలో ఓటర్లను నగదు, బహుమతులు లేదా ఇతర ప్రలోభాలతో ప్రభావితం చేయడం చట్టవిరుద్ధమని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు. ప్రజలు ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎక్కడైనా ఎన్నికల నియమావళి ఉల్లంఘనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
























