Jal Sanchay Jan Bhagidari Ranking: భారీ వర్షాల ప్రభావంతో దేశవ్యాప్తంగా వరదలు ఉప్పొంగడం, వేల క్యూసిక్ ల వరద నీరు వృథాగా సముద్రంలోకి చేరడం సర్వసాధారణం. అయితే అదే వర్షపునీటిని ఓడిసి పట్టాలంటే పక్కా ప్లానింగ్  కావాలి. వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలి. అదే ఆచరణలో చేసి చూపించింది తెలంగాణ రాష్ట్రం.. దేశానికి ఆదర్శంగా నిలిచింది.

తాజాగా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రకటించిన "జల సంచాయ్ జన భాగీదారీ 1.0 ర్యాంకుల"లలో దేశవ్యాప్తంగా వర్షపు నీటి సంరక్షణ పనుల్లో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానాన్ని సాధించింది. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ వరుసగా రెండవ, మూడవ స్థానాల్లో నిలిచాయి. 2024-25 సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 5లక్షల 20వేల 362 వర్షపు నీటి సంరక్షణ పనులు చేపట్టిన తెలంగాణ, ఈ రంగంలో దేశంలోనే అత్యధిక పనులు నిర్వహించిన రాష్ట్రంగా నిలిచింది.

వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు అవసరమైన చెక్‌డ్యామ్‌లు, ఇంకుడు గుంతలు, రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ వంటి అనేక పనులను చేపట్టి విజయవంతంగా పూర్తిచేసింది. ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ వంటి పెద్ద రాష్ట్రాలు సైతం చేయలేకపోయిన పనులను ప్రజల భాగస్వామ్యంతో తెలంగాణ రాష్ట్రం చేసి చూయించింది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో, వివిధ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తుల సహకారంతో చేపట్టిన ఈ ఉద్యమానికి ముఖ్యమంత్రి మార్గనిర్దేశనం, మంత్రి సీతక్క ప్రత్యేక పర్యవేక్షణ ప్రధాన బలంగా నిలిచాయి. ప్ర‌జాప్ర‌భుత్వం చేప‌ట్టిన ప‌నుల జాత‌ర‌, ఉపాధి హమీ పనుల్లోనూ నీటి సంరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో జల సంచాయ్ జన భాగీదారీ 1.0" ర్యాంకింగ్స్‌లో తెలంగాణ‌కు అగ్రస్థానం ద‌క్కింది.

జల సంచాయ్ జన భాగీదారీ 1.0 లో దేశవ్యాప్తంగా 67 జిల్లాలు ఎంపిక‌వ్వ‌గా తెలంగాణ రాష్ట్రానికి చెందిన 8 జిల్లాలకు ప్రత్యేక గుర్తింపు లభించింది. రూ. 2కోట్ల క్యాష్ రివార్డు విభాగంలో ఎంపికైన మూడు జిల్లాలు, రూ. కోటి రివార్డులో ఎంపికైన మూడు జిల్లాలు, రూ. 25 ల‌క్షల రివార్డు విభాగంలో ఎంపికైన‌ప 13 జిల్లాల్లో 2 జిల్లాలు తెలంగాణ కు చెందిన‌వే కావ‌డం విశేషం.

ఆదిలాబాద్, నల్గొండ, మంచిర్యాల – ఒక్కో జిల్లాకు రూ. 2 కోట్లు రివార్డ్ దక్కింది. వరంగల్, నిర్మల్, జనగాం – ఒక్కో జిల్లాకు రూ. 1 కోటి రూపాయలు అందగా, భద్రాద్రి, మహబూబ్‌నగర్ – ఒక్కో జిల్లాకు రూ. 25 లక్షలు క్యాష్ రివార్డును కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. వర్షపు నీటి సంరక్షణలో దేశంలోనే తొలి స్థానం సాధించి, దేశానికి ఆద‌ర్శంగా తెలంగాణ నిల‌వ‌డం ప‌ట్ల పంచాయ‌తీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డా. ద‌న‌స‌రి అనసూయ‌ సీతక్క హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ ఘ‌న‌త సాధించడంలో కీల‌క పాత్ర పోషించిన ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్. శ్రీధర్, డైరెక్టర్ జీ. సృజన, జిల్లా క‌లెక్ట‌ర్లు, శాఖ‌ అధికారులను అభినందించారు. భూగర్భ జలాల పెంపుదల, వర్షపు నీటి సమర్థ వినియోగం, ప్రజల భాగస్వామ్యం అనే మూడు ప్రధాన లక్ష్యాలతో సాగిన ఈ ఉద్యమం, దేశానికి తెలంగాణ ఇచ్చిన మరో గొప్ప గౌరవంగా నిలుస్తుంద‌ని మంత్రి సీత‌క్క పేర్కొన్నారు.రాబోయే రోజుల్లో ఇదే స్పూర్తితొో పనిచేస్తూ మరిన్ని ఉత్తమ అవార్డులు సాధించాలని ఆకాంక్షించారు.