Adilabad News: చూపు లేకుండా పుట్టిన శిశువు.. తల్లిదండ్రులకు 1 కోటి పరిహారం చెల్లించాలని తీర్పు
పుట్టబోయే బిడ్డకు కళ్లు లేవనే నిజాన్ని స్కానింగ్‌లో గుర్తించకుండా నిర్లక్ష్యం వహించినందుకు, బాధితురాలికి 12 శాతం వడ్డీతో రూ. 1 కోటి పరిహారం చెల్లించాలని ఆదిలాబాద్ వినియోగదారుల కమిషన్ తీర్పునిచ్చింది.

ఆదిలాబాద్: పుట్టబోయే బిడ్డపై తల్లిదండ్రులు ఎంతో మమకారాన్ని పెంచుకుంటారు. అందుకోసం డాక్టర్లు చెప్పినవన్నీ పాటిస్తారు. గర్భస్థ శిశువు ఆరోగ్యం కోసం డాక్టర్లు చెప్పిన టెస్టులన్నీ చేపించుకుంటారు. కానీ తీరా పుట్టిన బిడ్డకు ఏదైనా లోపం ఉంటే ఆ తల్లిదండ్రుల మానసిక క్షోభను మాటల్లో చెప్పలేం. ఓ శిశువు విషయంలో డాక్టర్ల నిర్లక్ష్యం ఉందని నిర్దారిస్తూ ఆదిలాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్ బాధితులకు కోటి రూపాయల పరిహారంతో పాటు కోర్టు ఖర్చులు చెల్లించాలని ఆదేశించింది.
బాధిత కుటుంబానికి భారీ పరిహారం
పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపై తప్పుడు వైద్య నివేదికలు ఇచ్చినందుకు గాను, బాధితురాలికి రూ. 1 కోటి నష్టపరిహారం చెల్లించాలని ఆదిలాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్ చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన భాగ్యశ్రీ గర్భం దాల్చిన తర్వాత స్థానిక ఆసుపత్రిలో క్రమ తప్పకుండా పరీక్షలు చేయించుకున్నారు. గర్భస్థ శిశువు ఎదుగుదల, ఆరోగ్య స్థితిని తెలుసుకోవడానికి చేసే 'టీఫా' (TIFFA) స్కానింగ్ మరియు ఇతర నిర్ధరణ పరీక్షలు చేయించుకోగా, శిశువు పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు నివేదికలు ఇచ్చారు.
ఎక్కడ చూపించినా కనిపించని ఫలితం..
అయితే, 2024 జూన్ 30న భాగ్యశ్రీకి శస్త్రచికిత్స ద్వారా కాన్పు జరగగా, పుట్టిన శిశువుకు రెండు కళ్లు లేకపోవడంతో కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. శిశువు కంటి చూపు కోసం హైదరాబాద్, మహారాష్ట్రలోని పలు ఆసుపత్రులలో ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. స్కానింగ్ రిపోర్టులలో లోపాన్ని గుర్తించకపోవడం డాక్టర్ల నిర్లక్ష్యమేనని భావించిన బాధితురాలు వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు.
వడ్డీతో 1 కోటి పరిహారం చెల్లించాలని తీర్పు
ఈ కేసును విచారించిన కమిషన్ అధ్యక్షుడు జాబేజ్ శామ్యూల్, డాక్టర్ల నిర్లక్ష్యం స్పష్టంగా ఉందని నిర్ధారించారు. బాధితురాలు ఫిర్యాదు చేసిన నాటి నుండి 12 శాతం వడ్డీతో కలిపి రూ. 1 కోటి నష్టపరిహారంతో పాటు, కోర్టు ఖర్చుల నిమిత్తం రూ. 34 వేలు చెల్లించాలని ఆదేశించారు. బాధితులకు న్యాయం చేయడంలో ఈ తీర్పు ఒక మైలురాయిగా నిలిచింది.
TIFFA Scan ఏం చెబుతోంది..: గర్భం దాల్చిన 18 నుంచి 22 వారాల మధ్య Targeted Imaging for Fetal Anomalies (TIFFA) స్కాన్ చేస్తారు. శిశువు అవయవాల నిర్మాణం, గుండె పనితీరుతో పాటు శారీరక లోపాలను గుర్తించడానికి ఇది అత్యంత కీలకమైన పరీక్ష.
వినియోగదారుల హక్కులు: వైద్య సేవల్లో లోపాలు ఉన్నా లేదా తప్పుడు రిపోర్టుల వల్ల తమకు నష్టం వాటిల్లినా, బాధితులు వినియోగదారుల రక్షణ చట్టం కింద జిల్లా, రాష్ట్ర లేదా జాతీయ స్థాయి కమిషన్లను ఆశ్రయించవచ్చు.
డాక్టర్లు/ హాస్పిటల్స్ బాధ్యత: స్కానింగ్ నిర్వహించే రేడియాలజిస్టులు, గైనకాలజిస్టులు శిశువు ప్రతి అవయవాన్ని నిశితంగా పరిశీలించి నివేదిక ఇవ్వాలి. ఏవైనా అసాధారణతలు కనిపిస్తే తల్లిదండ్రులకు ముందుగానే తెలియజేయడం వారి నైతిక, వృత్తిపరమైన బాధ్యతగా భావించాలి.
Before You Go
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















