Heavy Rains in Maharashtra | మంచిర్యాల: మహారాష్ట్ర వరదల్లో మంచిర్యాల వాసులు చిక్కుకున్నారు. నిన్నటి నుంచి నానా రకాల ఇబ్బందులు పడుతున్నారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా గగన్ బవడా ప్రాంతంలో ఇక్కట్ల పాలవుతున్నారు. స్థానిక పోలీసులకు ఫోన్ చేసినా స్పందించడం లేదని, తమ పరిస్థితిని అర్థం చేసుకోవాలని తమను ఆదుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తాము గగన్ బవడా అనే ప్రాంతంలో చిక్కుకున్నామని, రెండు రోజుల నుంచి ఎలాంటి సాయం అందడం లేదని వీడియోలో తమ ఆవేదన వ్యక్తం చేశారు.
తీర్థయాత్రలకు వెళ్లి నానా తిప్పలు పడుతున్న మంచిర్యాల వాసులు..
మంచిర్యాల జిల్లా రాంనగర్ ప్రాంతానికి చెందిన 25 మంది పెద్దలు, ఎనిమిది మంది పిల్లలు కలిసి కర్ణాటక, గోవా, మహారాష్ట్ర తీర్థయాత్రలకు బయల్దేరి వెళ్లారు. నిన్నటి నుంచి అక్కడే ఉన్నారు. భారీ వర్షాలు, వరదలతో ముందుకు రాలేక, వెనక్కి పోలేక ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ల వాహనం కూడా పాడవడటంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక పోలీసులకు ఫోన్ చేసి సాయం అడిగినా సరిగ్గా స్పందించడం లేదని వారు వెల్లడించారు. అక్కడ నీళ్లు, తిండి, విద్యుత్ లేదని పిల్లలకు జ్వరాలు వచ్చాయని ఏం చేయాలో పాలుపోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఇంకా మూడు రోజుల వరకు ఇక్కడే ఉండాలని పోలీసులు చెబుతున్నారని తమను ఆదుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతూ సెల్ఫీ వీడియో విడుదల చేశారు.