నిజామాబాద్ నగరంలో భూ మాఫియా రెచ్చిపోతోంది. కోట్ల రూపాయల విలువ చేసే భూమిపై కన్నేసి నకిలీ పట్టాలు సృష్టించిన ఘనుల బాగోతాలు బైటపడుతున్నాయి. ఇప్పటికే ఈ వ్యవహారంలో పోలీసులు 12 మందిపై కేసు నమోదు చేశారు. నిజామాబాద్ కొత్త కలెక్టరేట్ సమీపంలోని బైపాస్ రోడ్డు 7 ఎకరాల భూమి వారసులులేని ఈ జాగాపై కన్నేసింది భూ మాఫియా. ఇందులో రిజిస్ట్రేషన్, మున్సిపల్, రెవెన్యూ శాఖల అధికారులతో పాటు ప్రముఖ రాజకీయ నాయకులు ఉన్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్లుగా తెలిసింది. టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు నిజామాబాద్ టౌన్ పోలీసులు పకడ్బందీ విచారణ చేపడుతున్నారు. ఈ వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. నకిలీ పట్టాల వ్యవహారంపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు.
ఈ కోట్లాది రూపాయల భూమాఫియా వెనుక ఓ రాజకీయనేతతో పాటు కీలకమైన వ్యక్తులు మరి కొందరున్నారు. తెరవెనుక కథ నడిపింది రిజిస్ట్రేషన్, రెవెన్యూ, మున్సిపల్ శాఖకు చెందిన అధికారులున్నారని విచారణలో తేలింది. ఇదివరకే పలు ఆరోపణలు ఎదుర్కొని సస్పెండ్ అయిన రిజిస్ట్రేషన్ అధికారితో పాటు మరొకరు కాగా, దొంగ ఇంటి నంబర్లు ఇచ్చిన మున్సిపల్ అధికారి మరొకరు కీలకపాత్ర పోషించినట్లు పోలీసుల విచారణలో తెేలింది. వీళ్ళతో పాటుగా నకిలీ పట్టాల సృష్టిలో రెవిన్యూ అధికారి ఒకరు అన్నీతానై నడిపినట్లు సమాచారం. నాలుగు మీ సేవా కేంద్రాల్లో పెద్ద ఎత్తున నకిలీ పట్టాలు తయారు చేసినట్లుగా పోలీసులు నిర్ధారించినట్లు తెలిసింది. కంటేశ్వర్, రైల్వే స్టేషన్ సమీపంలో, బోర్గాం, మున్సిపల్ సమీపంలోని మీ సేవ కేంద్రాల్లో నకిలీ పట్టాలకు అడ్డాలుగా గుర్తించారు. మీ సేవ నిర్వహకులపై కూడా కేసులు నమోదు చేయనున్నట్లు తెలిసింది.
నకిలీ పట్టాలు తయారు చేసే ముఠాను ఓ వ్యక్తి ఫిర్యాదుతో నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలుపుతున్నారు. ఈ ఫేక్ డాక్యుమెంట్ కేసులో ఎ-1 అమర్ సింగ్, ఎ-2 సుదర్శన్ లను పోలీసులు అరెస్టు చేశారు. ఎ-3, ఎ-4లు దేవేంధర్, భూమారెడ్డిలు పరారీలో ఉన్నట్లు తెలిపారు. వీరితో పాటు ఇంకా 8 మందిని పోలీసులు నిందితులుగా గుర్తించినట్లు తెలిపారు. ప్రైవేట్ భూమి అయినా ప్రభుత్వ భూమి అయినా యథేచ్ఛగా నకిలీ పట్టాలు సృష్టిస్తూ... కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారు భూ మాఫియా. నిజామాబాద్ జిల్లాలో ఈ ఫేక్ డాక్యుమెంట్స్ భాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఇందులో రెవెన్యూ అధికారులు కూడా సహకరిస్తుండటంతో ... భూ మాఫియాకు పని మరింత సులువవుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయ్. ఓల్డ్ స్టాంపులు ఎక్కడి నుంచి వస్తున్నాయి. సంతకాలు ఫోర్జరీ ఎలా జరిగింది. గతంలో పనిచేసిన ఎమ్మార్వోలను ఆశ్రయిస్తూ... వారితో సంతకాలు చేయించుకుని మరీ ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టిస్తూ... అమాయకుల భూములను కబ్జాకు పాల్పడుతున్న వైనం వెలుగు చూస్తున్నాయి.
మరోవైపు పోలీసులు ఈ నకిలీ పట్టాల వ్యవహారంపై లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది. ఓ ప్రజా ప్రతినిధి హస్తం కూడా ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. కొందరు పోలీసులు కూడా తక్కువ ధరకే భూములు వస్తున్నాయన్న ఆశతో నకిలీ పట్టాల భూములను కొన్నట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. నిజామాబాద్ నగరంలోని నాగారంలో కూడా ప్రభుత్వం పేదలకు బీపీఎల్ కింద ఇచ్చిన భూములను సైతం నకిలీ పట్టాలు సృష్టించి కబ్జాలకు పాల్పడుతున్న వైనం నేటికీ జరుగుతోంది. చాలా మంది బాధితులు ఇప్పటికీ ప్రజావాణిలో ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఫలితం లేకుండా పోతోంది. ఒక్కో పట్టా మీద 3 నుంచి 4 నకిలీ పత్రాలు సృష్టిస్తూ అమ్ముతున్నారు. తీరా విషయం తెలిశాక బాధితులు లబోదిబోమంటున్నారు.
గతంలో ఎమ్మార్వో ఆఫీస్ లో ప్రభుత్వ భూములకు సంబంధించిన ఫైల్స్ అగ్నిప్రమాదానికి గురై తగలబడిపోయాయ్. దీంతో కొందరు భూ మాఫియా నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ భూముల వివరాలు తెలుసుకుని నకిలీ పత్రాలు సృష్టిస్తూ... భూములను అక్రమంగా అమ్మేసిన ఘటనలు కోకొల్లలు అనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి సారించి ఈ నకిలీ పట్టాల ముఠాల ఆట కట్టించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిజామాబాద్ నగర వాసులు కోరుతున్నారు.