Dogs Attack in Nizamabad: నిజామాబాద్ జిల్లాలో మరోసారి వీధి కుక్కలు రెచ్చిపోయాయి. మెండోరా మండల కేంద్రంలో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తూ గంట వ్యవధిలో 12 మందిని కరిచి తీవ్రంగా గాయపరిచాయి. ఇద్దరికి కాళ్లకు, మరో నలుగురికి చేతికి, ఇద్దరికి ఛాతీపై, మరో ఇద్దరికి ఏకంగా ముఖం పై దాడి చేసి గాయపరిచాయి. మెండోరా మండల కేంద్రంలో హెల్త్ సెంటర్ ఉండటంతో వారిని అక్కడికి తరలించారు. డాక్టర్ కుక్కల కాటు గురైన వారిని పరిశీలించారు. 8 మందికి తీవ్రంగా గాయలయ్యాయని, మరో నలుగురికి స్వల్పంగా గాయలయ్యాని తెలిపారు. ఇద్దరికి సర్జరీ అవసరం ఉండొచ్చని డాక్టర్ తెలిపారు. మండల కేంద్రంలో కుక్కల దాడులను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
పెరిగిపోతున్న వీధి కుక్కల దాడులు..
నిజామాబాద్ జిల్లాలో గత మూడు నెలల్లో దాదాపు 300 మందికిపైగా వీధి కుక్కల కాటుకు గురయ్యారు. హైదరాబాద్ లో ఓ బాబు కుక్కల దాడిలో చనిపోయినా అధికారులు జిల్లాలో వాటి నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొన్నటికి మొన్న కామారెడ్డిలో ఓ వృద్ధురాలిని కుక్కలు తీవ్రంగా గాయపరిచాయి. వృద్ధురాలు ప్రాణాపాయం నుంచి బైటపడింది. ఇటీవల కాలంలో జిల్లాలో కుక్కల సంఖ్య భారీగా పెరిగింది. ప్రతి ఏటా శునకాలకు కుటుంబ నియంత్రణ చికిత్సలు చేయాలి. కానీ ఎక్కడా అది జరగటం లేదన్న విమర్శలు వస్తున్నాయి. బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీల పరిధిలో నిజామాబాద్ నగర పాలక పరిధిలో కూడా కుక్కల నియంత్రణ కోసం ప్రత్యేక నిధులు కూడా విడుదల చేస్తున్నారు. ఆ నిధులు ఎటుపోతున్నాయో తెలియదు కాని శునకాల నియంత్రణలో అధికారులు మాత్రం ఏడాదికేడాది నిర్లక్ష్యం వహిస్తూనే ఉన్నారన్న విమర్శలు వస్తున్నాయ్.
నిజామాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ లో ప్రతి ఏడాది కుక్కల నియంత్రణ కోసం రూ. 25 లక్షలు ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తున్నారు. కానీ నియంత్రణలో కార్పోరేషన్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఆ నిధులను మాత్రం లెక్కల్లో చూపుతున్నప్పటికీ శునకాలకు కుటుంబ నియంత్రణ చికిత్సలు జరపటం లేదు. వాటిని నియంత్రించటం లేదని ఆరోపణలున్నాయి. పట్టణాలు, నగర వీధుల్లో మండల కేంద్రాల్లో కుక్కల సంఖ్య భారీగా పెరిగిపోయింది. దాంతో రాత్రుల్లో బైక్ ల పై వెళ్లేటపుడు కుక్కలు వెంబడిస్తున్నాయని వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. సింగిల్ గా వెళ్లినా కుక్కలు దాడి చేస్తున్నాయంటున్నారు. కుక్కల నియంత్రణలో అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవరసరం ఎంతైనా ఉందంటున్నారు.
మరోవైపు కొన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కుక్క కాటుకు ఇచ్చే టీకాలు కూడా అందుబాటులో ఉండటం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో కుక్కల సంఖ్య ఏడాదికేడాది పెరిగుదతుందని అంటున్నారు. నిత్యం ఏదో ఒక చోట కుక్కల దాడిలో గాయపడుతున్న వారు ఉంటున్నారు. వార్తల్లోకి వస్తే తప్ప శునకాల నియంత్రణకు అధికారులు చర్యలు చేపట్టడం లేదని, సమస్య మరింత పెద్దది అవ్వకముందే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈరోజు మెండోరా లో జరిగిన ఘటన రిపీట్ కాకుండా అధికారులు కుక్కలను నియంత్రించే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని జిల్లా వాసులు డిమాండ్ చేస్తున్నారు.