Waterfalls in Telangana | ఆసిఫాబాద్: ప్రకృతి అందాలకు నిలయంగా ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అనేక అందమైన జలపాతాలు ఉన్నాయి. దట్టమైన అడవిలో ఎత్తైన పర్వతాల మధ్య పారే జలసవ్వడిలతో ప్రకృతి ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటోంది కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని మిట్ట జలపాతం. ఈ ప్రకృతి అందాల నడుమ పారే మిట్ట జలపాతం అందాలు తిలకించడానికి స్థానికులతో పాటు ఇతర జిల్లాల నుంచి పర్యాటకులు వస్తూ ఎంతో సందడి చేస్తున్నారు. ఇంతకీ ఈ మిట్ట జలపాతం ఎక్కడుంది..? అక్కడ పర్యాటకులు ఎలా సందడి చేస్తున్నారో ఇక్కడ తెలుసుకుందామా.


కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలంలోని అటవీ ప్రాంతంలో ఈ మిట్ట జలపాతం ఉంది. ఈ మిట్ట జలపాతాన్ని సప్త గుండాల జలపాతం అని కూడా పిలుస్తుంటారు. ఎందుకంటే ఇక్కడ 7 జలపాతాలు ఒకదాని కిందట మరొకటి ఉన్నాయి. మిట్ట జలపాతానికి వెళ్లాలంటే ఉట్నూర్ నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఉట్నూర్ నుంచి జైనూర్, సిర్పూర్ (యు) మీదుగా లింగాపూర్ కు చేరుకుంటే... అక్కడి నుంచి మాన్కుగూడ మీదుగా సుమారు 1.5 కిలోమీటర్లు కాలినడకన చేరుకోవాల్సి ఉంటుంది. 


ఏజెన్సీ ప్రాంతాల్లో లింగాపూర్ మండలంలోని మిట్టే జలపాతం సప్తగుండాల జలపాతాలు కుంటాల, పొచ్చెర జలపాతాల కంటే మెరుగ్గా ఉన్నాయి. నిజానికి, ఇది ఏడు జలపాతాలతో ఏర్పడింది. అందుకే దీనిని సప్తగుండాల వాటర్ ఫాల్స్ అని కూడా పిలుస్తారు. మిట్ట జలపాతాలు అని కూడా పిలువబడే సప్తగుండల జలపాతాలు నాగరికతకు దూరంగా ఉన్నాయి. ఇవి ఆసిఫాబాద్ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఉట్నూర్ నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒక వైపు ఎత్తైన కొండలు మరియు మరోవైపు దట్టమైన అడవుల మధ్య ఉన్నాయి. 
ఈ మిట్ట జలపాతం ప్రాంతానికి వెళ్లేందుకు సరైన రోడ్డు సౌకర్యం లేదు. మాన్కుగూడ నుంచి 1.5 కిలోమీటర్లు బురదమైన రోడ్డులో నడుచుకుంటూ వెళ్ళాలి. అక్కడికి చేరుకోవడానికి, కఠినమైన, అసమాన భూభాగంలో మూడు కిలోమీటర్లు నడవాలి.  ఈ మిట్ట జలపాతం అందాలు తిలకించడానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు రోడ్డు బాలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక మరికొందరు ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో ఒక్కసారి చూస్తే.. ట్రెక్కింగ్ ద్వారా అక్కడికి వెళ్లేందుకు ఎంత కష్టపడ్డామనే విషయాన్ని త్వరగా మర్చిపోతారని పలువురు ఎబిపి దేశంతో మాట్లాడారు. పెద్ద జలపాతం ఏడు జలపాతాలలో ముఖ్యమైనది. ఆకాశం తెరుచుకున్నట్లు కనిపిస్తోంది, పాలవలే భారీ ప్రవాహం అందంగా క్రిందికి వస్తోంది.


ప్రజలు జలపాతాన్ని చూసినప్పుడు, నీటి అలలపై తేలిపోతున్నట్లు భావిస్తామని వారు చెబుతుంటారు. ఈ వాటర్ ఫాల్స్ అందాలు తమను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని, జలపాతంలో తడుస్తూ కేరింతల నడుమ.. జలపాతాల లయబద్ధమైన ధ్వనిని వింటూ ఎంజాయ్ చేస్తుంటామని పర్యాటకులు తెలిపారు. ప్రకృతి అందాల నడుమ కుటుంబ సభ్యులతోనూ వస్తూ వన భోజనాలు సైతం చేస్తూ, ప్రకృతి ఒడిలో స్వచ్ఛమైన గాలినీ సైతం ఆస్వాదిస్తామని చెబుతున్నారు. అలాగే ఈ పిస్ ఫుల్ లోకేషన్ మధ్య తమ సమస్యలను కూడా మరిచిపోతామని, ప్రకృతి అందాలను సెల్ ఫోన్లలో సెల్ఫీలు, ఫొటోలు, వీడియోల రూపంలో చిత్రీకరిస్తుంటారు. 


మిట్ట జలపాతం వద్ద మొదటి స్పాట్ చాలా అందంగా బొగత జలపాతం చూసినట్లు అనిపిస్తుంది. రెండో స్పాట్ వద్ద నీరు చాలా ఎత్తు నుంచి క్రింది రాతి పలకలపైకి సునాయాసంగా వస్తుంది. ఉపరితలం నుంచి కనీసం 100 మీటర్ల దిగువన ఉన్న లోయలోకి నీరు వెళుతుంది. సహజసిద్ధమైన రాతి పలకలు గతంలో పాలకులు ఉపయోగించిన మెట్ల బావులను గుర్తు చేస్తాయి. ఎక్కడ నుంచి నీరు చాలా ఎత్తు నుంచి పడుతుందో, తరువాత చాలా వేగంగా నీరు ప్రవహిస్తుంది. మిగతా ఐదు స్పాట్లు ఉన్న చోట ప్రస్తుతం సరైన రోడ్లు లేవు. దట్టమైన అడవి ఉంది. రాళ్ళ మధ్య ఇప్పుడు వెళ్ళడం కొంచెం కష్టమే. కనుక వచ్చిన పర్యాటకులంతా ఈ రెండూ స్పాట్ లలో ఉన్న జలపాతాలను చూసి ఎంజాయ్ చేస్తారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ మాత్రమే అనుమతి ఉంది. ఆ తరువాత ఎవరూ రాకూడదని, ప్రస్తుతం భారీ వర్షాలకు ప్రమాదాలు జరగవచ్చని అధికారుల ఆదేశాల ప్రకారం పర్యాటకులను అక్కడికి అనుమతిస్తున్నారు. 


అయితే ఈ మిట్ట జలపాతం వద్దకు వెళ్లాలంటే సరైన రోడ్డు లేదని, దీనివల్ల కొంతమేర ఇబ్బందులు కలుగుతున్నాయని పర్యాటకులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని పర్యటక కేంద్రంగా ఏర్పాటు చేసి.. రోడ్డు సౌకర్యం కల్పిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందడంతో పాటు స్థానికులకు ఉపాధి సైతం లభిస్తుందని పర్యాటకులు కోరుతున్నారు. 


Also Read: Waterfalls: హైదరాబాద్‌కు చుట్టుపక్కలే అందమైన జలపాతాలు, పొద్దున్నే వెళితే సాయంత్రానికి తిరిగిరావొచ్చు