Kumuram Bheem Asifabad Latest News: మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దులో ఉన్న 15 గ్రామాల్లో తీవ్రమైన, గందరగోళ పరిస్థితి నెలకొంది. భారత ఎన్నికల సంఘం చేప్టిన ప్రత్యేక ఓటరు సమీక్ష (SIR)ని మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలు ఏకకాలంలో ప్రారంభించాయి. దీంతో గ్రామస్తుల్లో గందరగోళం నెలకొంది.

Continues below advertisement

కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని పరందోలి గ్రామ పంచాయతీ ప్రాంతంలోని 15 గ్రామాలలో ఓటరు ఫారాలను ఇటీవలే మహారాష్ట్రకు చెందిన బీఎల్‌ఓలు ఆన్‌లైన్‌లో నింపి సమర్పించారు. అయితే, ఇప్పుడు తెలంగాణ అధికారులు, బీఎల్‌ఓలు కూడా ఈ గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ఎస్ఐఆర్ ఫారాలను తిరిగి నింపుతున్నారు. అక్కడి గ్రామస్తులు వెంటనే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటున్నారు. రెండు రాష్ట్రాలకు వేర్వేరు ఓటర్ల జాబితాలు ఉన్నందున, రెండు రాష్ట్రాల్లోనూ నమోదు చేసుకోవడం సాధ్యమని, దీనివల్ల వారు రెండు రాష్ట్రాల్లోని ప్రభుత్వ పథకాల లబ్ధి పొందగలరని చూస్తున్నారు. అయితే, ఇది సాంకేతికంగా, చట్టపరంగా సరికాదని స్థానికంగా ఉన్న కొంతమంది పౌరులు అంటున్నారు. 

ఈ 15 గ్రామాల్లోని సమస్యలు

అక్కడి స్థానికుడైన ముకద్దంగూడ గ్రామానికి చెందిన రణ్వీర్ రాందాస్ కథనం ప్రకారం, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గతంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్ హైకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. అందువల్ల, ఈ గ్రామాలపై తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి చట్టపరమైన అధికారం లేదు. ఒక ఓటరు ఒకే సమయంలో రెండు చోట్ల ఎలా ఉండగలడు? ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియ పేరుతో జరుగుతున్న ఈ గందరగోళాన్ని ఆపాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయని వాపోతున్నారు. 

Continues below advertisement

అసలు ఈ ప్రక్రియ సాధ్యమేనా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ప్రజాస్వామ్య ప్రక్రియలో, ఒకే ఓటరు పేరు రెండు చోట్ల ఉండటం చట్టపరమైన సమస్యలను సృష్టిస్తుంది. వివాదాస్పద సరిహద్దు ప్రాంతాల్లోని ఓటర్లు ఏ రాష్ట్రానికి ఓటు వేయాలనే దానిపై అనిశ్చితి నెలకొంది. ఈ తీవ్రమైన విషయాన్ని జిల్లా కలెక్టర్ తక్షణమే పరిష్కరించాలని, ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం తన అధికారిక వైఖరిని స్పష్టం చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. 

15 గ్రామాలకు సంబంధించిన పెండింగ్‌లో ఉన్న సరిహద్దు వివాదానికి శాశ్వత పరిష్కారం చూపించాలని, ఈ ప్రాంతాన్ని మహారాష్ట్రలో అంతర్భాగంగా భావించి ఇక్కడి పౌరులకు భద్రత, భరోసా కల్పించాలని డిమాండ్లు ఊపందుకుంటున్నాయి.

తాము అనుకుంటున్న చంద్రపూర్ జిల్లా జీవితి తాలూకాలోని 15 వివాదాస్పద గ్రామాల విషయమై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, రెవెన్యూ మంత్రి చంద్రశేఖర్ బావన్‌కులే అధ్యక్షతన విధాన భవన్‌లో రెండు సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో, ఆ 15 వివాదాస్పద గ్రామాలు మహారాష్ట్రకు చెందినవని వారు పేర్కొన్నారు. గత వారం రోజుల క్రితం సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ను కలిసి వినతి పత్రం సమర్పించామన్నారు. అయితే, ప్రస్తుతం ఈ వివాదాస్పద గ్రామాల్లో రెండు రాష్ట్రాలూ ఎస్ఐఆర్ ఫారాలను దాఖలు చేస్తుండటంతో, పౌరులలో గందరగోళం నెలకొంది.

రెండు చోట్లా ఓటు హక్కు ఉంటే శిక్ష: తెలంగాణ సీఈఓ 

రెండు వేర్వేరు నియోజకవర్గాల్లో లేదా రాష్ట్రాల్లో ఓటు వేయడం చట్టవిరుద్ధమని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. తెలిసి రెండు చోట్లా ఓటు నమోదు చేసుకుంటే ఏడాది జైలు శిక్ష, జరిమానా విధించవచ్చని ఆయన హెచ్చరించారు. ఇలాంటి కేసుల్లో ఇప్పటికే కొందరికి నోటీసులు జారీ చేశామని ఆయన చెప్పారు. డెమోగ్రాఫిక్ ఈక్విటీ ఎంట్రీస్ (DSE) సాఫ్ట్‌వేర్ సహాయంతో డూప్లికేట్ ఓట్లను సులభంగా గుర్తించవచ్చని ఆయన వివరించారు. మరి ఈ తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులోని 15 గ్రామాల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.