Adilabad Crime News: హైవేలపై ప్రయాణించే లారీ డ్రైవర్లు, క్లీనర్లకు కునుకులేకుండా చేస్తున్న ఒక భారీ అంతర్రాష్ట్ర ముఠా ఆగడాలను ఆదిలాబాద్ జిల్లా పోలీసులు అడ్డుకున్నారు. పక్కా ప్లానింగ్‌తో అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో భారీ వాణిజ్య వాహనాలను మాయం చేస్తున్న ఈ ముఠా నెట్‌వర్క్ హర్యానా నుంచి మహారాష్ట్ర వరకు విస్తరించి ఉంది. ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ నేతృత్వంలో పోలీసులు చేపట్టిన ఆపరేషన్‌లో ముగ్గురు కీలక నిందితులు చిక్కారు.
అర్థరాత్రి పోలీసుల ఛేజింగ్
మావల బైపాస్ రోడ్డు వద్ద పోలీసులు సాధారణంగా వాహన తనిఖీలు చేస్తున్నారు. ఆ సమయంలో తెల్లటి టయోటా ఎటియోస్ కారు అనుమానాస్పదంగా కనిపించింది. పోలీసులను చూడగానే ఆ కారులో ఉన్న వారు పరారయ్యేందుకు ప్రయత్నించారు. అయితే అప్రమత్తమైన పోలీస్ బృందం వారిని వెంబడించి ముగ్గురును అదుపులోకితీసుకున్నారు. వారిని విచారిస్తే దేశవ్యాప్తంగా సాగుతున్న భారీ వాహనాల చోరీల వెనుక ఉన్న అసలు రహస్యాలు వెలుగులోకి వచ్చాయి.
అరెస్టు అయిన నిందితులు అంతరాష్ట్ర నేరాల్లో ఆరితేరిన వారు. హర్యానాకు చెందిన సలీం వృత్తిరీత్యా ట్రక్ డ్రైవర్. హైవేలపై వాహనాల కదలికలపై ఇతనికి పూర్తి అవగాహన ఉంది. రెండో వ్యక్తి నఫీస్ ఖాన్. హర్యానాలోని మేవాత్ జిల్లాకు చెందిన ఇతను కూడా ట్రక్ డ్రైవరే. భారీ వాహనాలను సులువుగా నడపడంలో దిట్ట. ఇంతియాజ్ మూడోవాడు. రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాకు చెందిన మెకానికక్. వాహనాల లాక్ సిస్టమ్‌ను వైరింగ్‌ను నిమిాల్లో ఛేదించడం ఇతని స్పెషాలిటీ. వీరితోపాటు మరో ఏడుగురు ఉన్నట్టు గుర్తించిన పోలీసులు వారిపై కేసులు పెట్టారు.
మోడస్ ఆపరేండీ ఎలా ఉందంటే?
తమ వద్ద ఉన్న టయోటా కారులో వివిధ రాష్ట్రాల హైవేలపై తిరుగుతూ పెట్రోల్ బంకులు, లేదా నిర్మానుష్య ప్రాంతాల్లో పార్క్ చేసిన ఐషర్, టిప్పర్ వంటి భారీ వాహనాలను లక్ష్యంగా చేసుకుంటారు. మెకానిక్ సహాయంతో వాహనం తలుపు గ్లాస్ పగులగొట్టి స్టీరింగ్ లాంగ్ విరగ్గొడతారు. ఇగ్నిషన్ వైరింగ్‌ను కట్ చేసి డైరెక్ట్ కనెక్షన్ ద్వారా వాహనాన్ని స్టార్ట్ చేస్తారు. దొంగలించిన వాహనాన్ని వెంటనే మహారాష్ట్ర లేదా గుజరాత్ రాష్ట్రాలకు తరలిస్తారు.
దొంగలించిన వాహనాన్ని కేవలం గంటల వ్యవధిలోనే విడిభాగాలుగా విడగొట్టేస్తారు. ఆ భాగాలను విడివిడిగా అమ్మేస్తారు. ఆనవాళ్లు దొరక్కుండా చేస్తారు. నిందితుల నుంచి ప్రస్తుతం టయోటా కారుతోపాటు మూడు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. వారిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.
