Adilabad Farmer News: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని రైతులు పంటలపై పురుగు మందు పిచికారి చేస్తూ అస్వస్థతకు గురై ముగ్గురు రైతులు మృతిచెందారు. రైతులు తమ వ్యవసాయ క్షేత్రాలలో దున్నిన తరువాత, విత్తనం నాటి మొలక వచ్చిన క్రమం నుండి మొదలుకుంటే పంట చేతికొచ్చే వరకు అనేక విధాలుగా కష్టపడి వ్యవసాయం చేస్తున్నారు. ఇలా సాగు విషయంలో అన్ని నియమాలను ఖచ్చితంగా పాటిస్తున్న క్రమంలో అంతా బాగానే ఉన్నా.. పంటలపై మందు పిచికారి చేసే క్రమంలో మాత్రం రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అనేక మంది రైతులు పంటలకు మందు పిచికారి చేసే క్రమంలో ముఖానికి ఎలాంటి రక్షక కవచాన్ని ధరించడం లేదు. మందు పిచికారి సమయంలో ఖచ్చితంగా ముఖానికి మాస్కు, ఫేస్ గార్డు, కళ్లజోడు, చేతులకు గ్లౌజులు ధరించాలి. కానీ ముఖానికి ఎలాంటి రక్షక కవచం లేకుండానే నేరుగా అలాగే వ్యవసాయ క్షేత్రాల్లో పంటలపై మందు పిచికారి చేస్తున్నారు. దీంతో రైతులు అస్వస్థతకు గురై తీవ్రంగా ఇబ్బందులకు గురవడంతో పాటు కొంతమంది తీవ్ర అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో పాలవుతున్నారు. అంతే కాకుండా మృత్యువాత పడుతున్నారు. 


కొందరు మృతి, మరికొందరికి తీవ్ర అస్వస్థత


వ్యవసాయ క్షేత్రాలలో పంటలకు మందు పిచికారి చేస్తూ కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో ముగ్గురు రైతులు మృతి చెందారు. జైనూర్ మండలంలోని శివనూర్ గ్రామానికి చెందిన ఆడే సచిన్ అనే యువ రైతు జూలై నెలలో మృతి చెందగా.. వాంకిడి మండలంలోని పునాగూడకు చెందిన రైతు మడావి చందు, చౌపన్ గూడ పంచాయతీ పరిదిలోని నగర్ గుట్టా గ్రామానికి చెందిన సిడాం లచ్చు అనే యువ రైతు గత అక్టోబర్ నెలలో పత్తి చేనులో పురుగుల మందు పిచికారి చేస్తు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. భీంపూర్ మండలం నిపాని గ్రామానికి చెందిన మానేరు వెంకటి అనే రైతుతో పాటు ఇంద్రవెల్లి మండలంలోని వడగాం గ్రామానికి చెందిన రైతు కొడప మధు, మామిడిగూడ గ్రామానికి చెందిన దాండేగవ్కర్ దేవురావ్ అనే రైతు పత్తి చేనులో పురుగుల మందు పిచికారి చేస్తు గత అక్టోబర్ నెలలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొంది తిరిగి ఇళ్లకు చేరుకొని ప్రస్తుతం ఆరోగ్యంగా నిలకడగానే ఉన్నారు. పురుగుల మందు పిచికారీ చేసే క్రమంలో రైతులు ముందుగా ఫర్టిలైజర్స్ దుకాణాల నుండి తెచ్చిన మందులను ఏ మందు ఎ రకానికి ఎంత వాడాలో, ఎంత మందు కలపాలో కూడా సరిగ్గా తెలియదు. మందు కలిపే సమయంలో చేతులకు గ్లౌజులు, ముఖానికి మాస్కు ధరించడం లేదు. వీటిపై ఏమాత్రం అవగాహన లేదు. రైతులు ముఖానికి చేతులకు రక్షక కవచాలు ధరించకపోవడం ఇలా నిర్లక్ష్యం వహించడంతోనే అనేక మంది రైతులు అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యంతో ఆసుపత్రుల పాలవుతున్నారు. మరికొంత మంది తీవ్ర అనారోగ్యానికి గురై ఆసుపత్రిలోనే మృత్యువాత పడుతున్నారు. 


కొందరు మాత్రమే జాగ్రత్తలు తీసుకుంటున్నారు..


రైతులు మందు పిచికారి చేస్తున్న క్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు అవగాహన కల్పించాల్సి ఉంది. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడ చూసిన రైతులకు అవగాహన కల్పించడం లేదని రైతులు చెబుతున్నారు. గత కొన్నేళ్ల నుండి తాము ఇలాగే వ్యవసాయం చేస్తూ పంటల్లో మందులను పిచికారి చేస్తున్న క్రమంలో ముఖానికి ఎలాంటి రక్షణ కవచం కూడా ధరించకుండా అలాగే మందు పిచికారీ చేస్తున్నట్లు కొంతమంది రైతులు చెబుతున్నారు. మందు పిచికారి చేసిన అనంతరం తమకు కొంత ఇబ్బంది అవుతోందని, మొహం, కళ్లు, మండడం.. జ్వరం రావడం, జలుబు కావడం తల తిరగడంతో పాటు ఒళ్లంతా దద్దుర్లు రావడం వంటి సమస్యలు ఎదుర్కుంటున్నామన్నారు. ఇవన్నీ తమకు కామన్ గానే అనిపిస్తోందని, ఏదైనా అతిగా అనిపిస్తే డాక్టర్ ను సంప్రదించి మందులు వేసుకోవడం జరుగుతోందని, మరికొందరు రైతులు తమకు ఎలాంటి అస్వస్థత కలిగిన బయట ఎవరికీ చూపించకపోవడం, చెప్పకపోవడం చేస్తున్నారని వివరిస్తున్నారు. ఇలా రైతులు తమ ఆరోగ్యం విషయంలో ఎమాత్రం శ్రద్ద వహించకుండా మందు పిచికారి చేసిన సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించకపోవడం చేస్తున్నారని, పలువురు రైతులు చెబుతున్నారు. 


తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏబీపీపై సదస్సు..


ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని రైతుల క్షేమం పట్ల వారి కష్ట నష్టాలను తెలుసుకుని ఏబీపీ దేశం ఒక చిన్న ప్రయత్నాన్ని ముందుకు తీసుకు వచ్చింది. రైతుల మరణాలను అరికట్టేందుకు ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించి రైతుల పట్ల శ్రద్ద వహించి రైతులను కాపాడాలని కృషి చేస్తోంది. మందు పిచికారి చేసే క్రమంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అస్వస్థతకు గురైన వారు ఆరోగ్యం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సుమలత ఏబీపీ ఆధ్వర్యంలో అన్నదాతలకు వివరించారు. రైతుల పట్ల కొన్ని విషయాలని చర్చించి రైతులకు తగిన సూచనలు అందించారు. మందు పిచికారి క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆరోగ్య విషయాలను వెల్లడించారు. మందు పిచికారి చేసేటప్పుడు ముఖానికి మాస్కు, చేతులకు గ్లౌజులు ధరించాలని, మధ్య మధ్యలో ఆగుతూ కొంతమంది రైతులు గుట్కా, తంబాకు, బీడీ, సిగరెట్ లాంటివి వాడుతూ ఉండటం ఆకలి వేసిన సమయంలో చేతులను సరిగ్గా కడుక్కోకుండా మీద మీదనే చేతులను కడుక్కొని భోజనం చేయడం లాంటివి చేయడంతో అస్వస్థతకు గురవుతున్నారు. 


రసాయన మందుల వాసనతో పాటు తంబాకు, బీడి, సిగరెట్ ల వాడకం వల్ల ఎక్కువ మంది రైతులు అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. ఏమైన ఆరోగ్య సమస్యలు వస్తే... ఆలస్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలని వివరిస్తున్నారు. మందు పిచికారీ విషయంలో వ్యవసాయశాఖ అధికారులు సైతం క్రమం తప్పకుండా రైతుల వద్దకు వెళ్లి అన్ని విషయాల పట్ల అవగాహన కల్పించాల్సిందిగా పలువురు రైతులు కోరుతున్నారు.