Identical Twins Wedding: మిర్రర్ ఇమేజ్ మ్యారేజ్ అంటే ఇదే.. ట్విన్స్ సిస్టర్స్ మెడలో ఒకేసారి తాళి కట్టిన కవల సోదరులు
Identical Twins Marriage | వరల్డ్ ట్విన్స్ డే సందర్భంగా కామారెడ్డి జిల్లాలో ఇద్దరు కవల అన్నదమ్ములు, ఇద్దరు కవల అక్కాచెల్లెళ్లను ఒకే ముహూర్తానికి వివాహం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు.

తెలంగాణలోని ఒక గ్రామంలో అరుదైన వివాహ వేడుక జరిగింది. ఇద్దరు కవల అన్నదమ్ములు, ఇద్దరు కవల అక్కాచెల్లెళ్లను ఒకే రోజు, ఒకే ముహూర్తానికి వివాహం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇవన్నీ సినిమాల్లో చూడవచ్చు. కానీ నిజజీవితంలో జరుగుతాయా అని ఆశ్చర్యపోతున్నారు. సరిగ్గా వరల్డ్ ట్విన్స్ డే రోజు ఈ కవల ట్విన్ బ్రదర్స్, మరో ట్విన్ సిస్టర్స్ మేడలో ఒకే ముహూర్తానికి తాళి కట్టడం హాట్ టాపిక్ అవుతోంది. అద్దం ముందు పెళ్లి జరుగుతోందా అన్నట్లుగా సాగిన ఈ వేడుకపై భిన్నాభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి.
నిజామాబాద్ (కామారెడ్డి) జిల్లాలోని దేమీ కలాన్ గ్రామంలో ఆదివారం ఈ అరుదైన వివాహ వేడుక జరిగింది. తాడ్వాయి మండలం దేమీ కలాన్ కు చెందిన రాజమణి, సాయన్న దంపతులకు కవల కుమార్తెలు కీర్తన, కీర్తి ఉన్నారు. వీరికి మాచారెడ్డి మండలం ఘన్‌పూర్‌కు చెందిన విజయ్, వినయ్ అనే కవల సోదరులతో పెద్దలు వివాహం నిశ్చయించారు. సాధారణంగా ఇది వేరే ముహూర్తంలో జరిగితే అందులో వింత లేదు. కానీ సరిగ్గా వరల్డ్ ట్విన్స్ డే రోజు వినయ్ కీర్తి మెడలో మూడు ముళ్లు వేయగా, అదే సమయంలో మరో జంట విజయ్, కీర్తన మెడలో తాళి కట్టాడు. ఐడెంటికల్ ట్విన్స్ జంటల వివాహ వేడుకకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరై వారిని ఆశీర్వదించారు. తాము చూస్తున్నది కలయా, నిజమా అని ఫీల్ అయ్యారు. ఓ ప్రత్యేకమైన రోజు వీరు పెళ్లి చేసుకుని ఈ వేడుకను తమ జీవితంలో మరుపురాని రోజుగా చేసుకున్నారు.
ఒకే రకమైన దుస్తులు, ఒకే రకమైన రూపంతో పక్కపక్కనే కూర్చుని రెండు జంటలు వివాహ బంధంతో ఏకమయ్యాయి. పెళ్లిక వచ్చిన అతిథులు సైతం అందులో ఎవరు వినయ్, ఎవరు విజయ్ అని గుర్తుపట్టలేకపోయారు. మరోవైపు కీర్త, కీర్తన విషయంలోనూ అదే జరిగింది. విజయ్-కీర్తన, వినయ్- కీర్తిల వివాహానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అరుదైన పెళ్లి వేడుకను కళ్లారా చూశామని పెళ్లికి హాజరైన వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు పెళ్లిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకేరూపంతో ఉన్న కవలల్లో ఒకరిని పెళ్లి చేసుకుంటే తన భర్త, భార్య ఎవరో తెలియక కొన్ని సందర్భాలలో ఇబ్బంది పడతారు. కానీ ఇక్కడ ట్విన్స్ బ్రదర్స్, మరో ట్విన్స్ అక్కాచెల్లెళ్లను పెళ్లిచేసుకోవడంతో ఆశ్చర్యపోతున్నారు. వారిలో ఎవరు తన భర్త, ఎవరు తన భార్య ఒకేచోట ఉన్న సమయంలో పోల్చుకోవడానికి కష్టమవుతుందని.. ఇలా ఎందుకు చేసుకున్నారని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అందులో ఐడెండికల్ ట్విన్స్ అంటే రూపం అచ్చుగుద్దినట్లు ఒకేలా ఉంటారు.
























