హైదరాబాద్ లో కుక్కల దాడిలో బాలుడి మృతి ఘటనతో ప్రభుత్వం అలర్ట్ అయింది. తాజాగా కామారెడ్డి జిల్లాలో ఓ వృద్ధురాలిపై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఆ వృద్ధురాలు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటోంది. ప్రస్తుతం వీధుల్లో కుక్కలను చూస్తేనే జనాలు వణికిపోతున్నారు. వీటి బెడద మరింత ఎక్కువైంది. హైదరాబాద్ బాలుడు చనిపోయిన ఘటన తర్వాత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై ఫోకస్ చేస్తోంది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీలు, కార్పోరేషన్ పరిధిలో వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లు చేయాలించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. ఈ క్రమంలో అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే నిజామాబాద్ కార్పోరేషన్ బడ్జెట్ లో ప్రతీ ఏటా ప్రత్యేకంగా రూ. 25 లక్షల నిధులను శునకాలను అదుపు చేసేందుకు నిధులు కేటాయిస్తారు. అయితే నిజామాబాద్ కార్పోరేషన్ పరిధిలో మాత్రం శునకాల నియంత్రణకు చర్యలు అంతంతమాత్రమే అన్న విమర్శలు వస్తున్నాయి.
నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో 30 రోజుల్లో 300 మంది వరకు కుక్క కాటుకు గురైనవారున్నారు. పలు కాలనీల్లో గుంపులుగా ఉన్న శునకాలు వెంటపడి మరీ జనాలను కరుస్తున్నాయి. రాత్రుల్లోనైతే పరిస్థితి మరీ దారుణంగా మారింది. నడచుకుంటూ వెళ్లే వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితి. బైక్ ల పై వెళ్తున్న వారిని సైతం వెంటాడుతున్నాయి కుక్కలు. పలుమార్లు నగర వాసులు కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదులు చేసినా సరైన స్పందన ఉండటం లేదని అంటున్నారు. మరోవైపు శునకాల నియంత్రణకు బడ్జెట్ లో ప్రత్యేకంగా కేటాయించిన నిధులను సైతం పక్కదారి పట్టిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 60 డివిజన్లు ఉంటాయ్. ప్రతి డివిజన్ లో కుక్కల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఈ గ్రామ సింహాలను నియంత్రిస్తున్నామంటూ ఓవైపు అధికారులు నిధుల లెక్కలు చూపిస్తున్నా ఫలితం మాత్రం కనిపించటం లేదని ప్రతిపక్ష కార్పొరేటర్లు విమర్శిస్తున్నారు. కుక్కలకు కుటుంబ నియంత్రణ 25 లక్షల రూపాయలకు పైగా ఖర్చు చేశామని చెబుతున్నా, అధికారులు చెబుతున్న లెక్కలకు పొంతనలేకుండా ఉంది. తాజాగా జరిగిన కార్పొరేషన్ బడ్జెట్ సమావేశంలో కుక్కల కు.ని ఆపరేషన్లకు రూ. 25 లక్షలు బడ్జెట్ లో కేటాయించారు. ఈ బాధ్యతను హైదరాబాద్ కు చెందిన ఓ ఏజెన్సీకి అప్పగించారు.
హైదరాబాద్ ఘటనతో తాజాగా ప్రభుత్వం కుక్కలకు కు.ని ఆపరేషన్లు చేయాలంటూ ఆదేశించటంతో కార్పొరేషన్ అధికారులు రంగంలోకి దిగారు. గతేడాది 1000 కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశామని అధికారులు చెబుతున్నారు. ఆరు నెలలుగా ఈ పక్రియ నిలిచిపోయింది. బడ్జెట్ కేటాయిస్తున్నా.. నియంత్రణ చేయడం లేదని నగర వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉభయ జిల్లాలో కుక్కల బెడద తీవ్రమై పెను సమస్యగా మారింది. శునకాల సంతతి నానాటికి పెరుగుతోంది. వీధి కుక్కల నియంత్రణకు శస్త్ర చికిత్సలు తప్ప మారో మార్గం లేదు. ఈ పక్రియ వ్యయ ప్రయాసాలతో కూడుకున్నది. బడ్జెట్ కేటాయింపులు చేస్తున్నా.. అవి మరో వైపు మళ్లిస్తుండటంతో ఈ పక్రియకు అంతారాయం కలుగుతోందంటున్నారు అధికారులు. కొన్నిచోట్ల నిధులు ఉన్నా అవి పక్కదారి పడుతున్నాయని నగర వాసులు ఆరోపిస్తున్నారు. ఇప్పట వరకు ఎన్ని కుక్కలకు ఆపరేషన్లు చేశారని ప్రశ్నిస్తే సమాధానం చెప్పేందుకు నిజామాబాద్ నగర పాలక సంస్ధ అధికారులు నిరాకరిస్తున్నారు.
కుక్కల నియంత్రణకు ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తున్నప్పటికీ వాటి సంఖ్య ఎందుకు తగ్గటం లేదనే దానిపై అనేక విమర్శలు వస్తున్నాయి. నామ మంత్రంగా పనికానిచ్చేస్తూ ఆ నిధులను దోచేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇటీవల ఘటనలతో వీధుల్లో నడవాలంటే మహిళలు, చిన్నపిల్లలు భయపడిపోతున్నారు. స్కూల్స్ కి వెళ్లే సమయం, తిరిగివచ్చే సమయంలో తమ పిల్లలు ఎలా వస్తున్నారోనని పేరెంట్స్ లో టెన్షన్ పెరిగిపోయింది. ఇకనైనా యుద్ధ ప్రాతిపాదికన కుక్కల నియంత్రణకు తక్షణ చర్యలు తీసుకుని ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు నగర వాసులు.