Ex MLA Alleti Maheshwar Reddy:
కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రైతులకు, పేద ప్రజలకు, సబ్బండ వర్గాల ప్రజలకు అండగా ఉంటుందన్నారు మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. కరోనా సమయంలో వ్యాక్సిన్, ఉచిత రేషన్ బియ్యం అందివ్వడంతో ప్రధాని మోదీ పేదలకు అండగా నిలిచారన్నారు. ఇంటింటికీ బీజేపీ - బీజేపీ గడప గడపకు మహేశన్న కార్యక్రమంలో బాగంగా నేడు నిర్మల్ నియోజకవర్గం లక్ష్మణ్ చందా మండలం నర్సాపూర్ W, బాబాపూర్, కంజర్ గ్రామాల్లో గడప గడపకు పర్యటించి ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు వివరించారు.
బీజేపీ నేత  ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ద్వారా దేశంలో 3 కోట్లకు పైగా ఇళ్లను నిర్మించి, అందులో తెలంగాణ రాష్ట్రానికి 2.5 లక్షల ఇళ్లను మంజూరు చేశారని గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వానికి అక్రమాలు, అవినీతి, కబ్జాలపై ఉన్న శ్రద్ధ  ప్రజల పట్ల లేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కుటుంబ అవినీతి పాలన అంతమొందించి, స్థానిక మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అవినీతిని అరికట్టాలంటే నిర్మల్ లో బీజేపీ జెండా ఎగారేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 


భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం లోనే ఆన్ని వర్గాల ప్రజల అభివృద్ధి సాధ్యం అవుతుందని, బీజేపీ ప్రభుత్వం రాగానే స్థానిక మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేసిన కబ్జా భూములను స్వాధీనం చేసుకొని అరులైన పేద ప్రజలకు వాటిని పంచుతామని అన్నారు. ప్రజల కోసం పాటు పడే బీజేపీ ప్రభుత్వం రావాలంటే, అందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మండల అధ్యక్షులు గోవర్ధన్,  స్థానిక నేతలు, పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


నయా నిజాం అంటూ ఇటీవల కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు
సీఎం కేసీఆర్ పాలన నయా నిజాంను తలపిస్తుందని బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ విలీన దినోత్సవ సందర్భంగా మాట్లాడుతూ... నయా నిజాం పాలన కొనసాగిస్తున్న కేసీఆర్ ను తరిమి కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆనాటి హైదరాబాద్ సంస్థానంలోని తెలంగాణ, మరాఠ్వాడా, కర్ణాటక ప్రాంతాల్లో ఇంకా ప్యూడల్ పాలన కొనసాగుతోందని ఆరోపించారు. ఒకవైపు దొరల వెట్టి చాకిరిలో గ్రామీణ ప్రజానీకం మగ్గిపోతుంటే, మరోవైపు నిజాం అండతో రజాకార్లు చెలరేగిపోయారు.. ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. గ్రామాలపై పడి ప్రజలను దోచుకొని, హత్యాకాండను కొనసాగించారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.


1947 ఆగస్టు 15న బ్రిటిష్ వారి పాలన అంతమై భారతదేశమంతటా స్వాతంత్య్ర సంబరాలు జరుపుకున్నారు. కానీ దేశం నడి బొడ్డున ఉన్న హైదరాబాద్ సంస్థాన ప్రజలకు ఆ అదృష్టం రాలేదన్నారు. భారత దేశ నడిబొడ్డున క్యాన్సర్ కణితిలా మారిన హైదరాబాద్ సంస్థానంపై చర్య తీసుకోక తప్పదని నాటి హోం మంత్రి సర్దార్ వల్లభాయి పటేల్ నిర్ణయం తో సెప్టెంబరు 17న నిజాం నవాబు లొంగుబాటు ప్రకటనతో  హైదరాబాద్ వాసులకు స్వాతంత్య్రం  వచ్చి, హైదరాబాదు రాష్ట్రం ఏర్పడిందని వెల్లడించారు. తెలంగాణ రాష్టం వస్తే బతుకులు బాగుపడతాయి అనుకున్న ప్రజలకు, స్వ రాష్ట్రంలో కూడాబతుకులు మారలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.