తెలంగాణ యూనివర్సిటీలో కరోనా కలకలం రేపుతోంది. క్యాంపస్ లో 10 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. సోమవారం రాత్రి ఓల్డ్ బాయ్స్ హాస్టల్ విద్యార్థు లకు కరోనా లక్షణాలు కన్పించాయి. ముగ్గురు విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో వారిని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఐసోలేషన్లో ఉంచారు. మంగళవారం మరికొందరు బాలురితో పాటు కొందరు బాలికల్లో కరోనా లక్షణాలు కన్పించడంతో వర్సిటీ అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే క్యాంపస్ లోని హెల్త్ సెంటర్లో 102 మంది విద్యార్థినీ, విద్యార్థులకు ర్యాపిడ్ టెస్ట్లు నిర్వహించారు. వారిలో ఏడుగురు బాలురు, ఏడుగురు బాలికలకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో బాయ్స్‌ను హాస్టల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదులలో ఐసోలేషన్ ఉంచారు.
గర్ల్స్ హాస్టల్ (Girls Hostel) నలుగురు విద్యార్థినులను నాలుగు గదులలో ఐసోలేషన్లో ఉంచగా, ముగ్గురు ఇళ్లకు వెళ్లిపోయారు. ప్రస్తుతం క్యాంపస్ లోని ఓల్డ్ బాయిస్ హాస్టల్స్ 250 మంది, న్యూ హాస్టల్ 350 మంది విద్యార్థులు, గర్ల్స్ హాస్టల్ లో 450 మందికి పైగా విద్యార్థినులు ఉన్నారు. ఒక్కరోజు వ్యవధిలో 17 మంది కరోనా బారిన పడటంతో క్యాంపస్ లోని విద్యార్థులు, లెక్చరర్స్, ఇతర సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు.
కొంత మంది హాస్టల్ విద్యార్థులు హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరు కావడంతోనే అక్కడ కరోనా సోకినట్లు వర్సిటీ వర్గాలు భావిస్తున్నాయి. మిగిలిన వారికి కరోనా పరీక్షలు నిర్వహిస్తే మరింత మందికి పాజిటివ్ వచ్చే అవకాశం ఉందని వర్సిటీ సిబ్బంది పేర్కొంటున్నారు. అవసరమైతే క్యాంపస్ కు కొన్ని రోజులు సెలవులు ఇచ్చేందుకు వర్సిటీ ఉన్నతాధికారులు ఆలోచిస్తున్నట్లు సమాచారం.
జిల్లాలో 26 రోజుల్లో 161 కరోనా పాజిటివ్ కేసులు
నిజామాబాద్ జిల్లాలో రోజురోజుకు కొవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గత 26 రోజుల్లో 3018 మందికి పరీక్షలు చేయగా 161 మందికి పాజిటివ్ గా తేలింది. జూన్ వరకు నిత్యం ఒకటి లేదా రెండు కేసుల వరకు రాగా జులై నుంచి పాజిటివ్ కేసులు అధికంగా ఉంటున్నాయి. కరోనా కేసులు నమోదవుతుండటంతో జిల్లాలోని పీహెచ్సీలు, సీహెచ్సీలతో పాటు 276 సబ్ సెంటర్లలో ఐసోలేషన్ కిట్లు, మెడిసిన్ అందుబాటులో ఉంచారు. స్వల్ప లక్షణాలు ఉన్నవారు పీహెచ్సీలకు వెళ్లి మందులు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు. శ్వాసకోశ వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అప్రమత్తంగా ఉండాలంటున్నారు.
మాస్కులు తప్పని సరిగా అందరూ ధరించాలి. జిల్లాలో కొవిడ్ కేసులు పెరుగుతున్నా.. అందరికి స్వల్ప లక్షణాలే ఉన్నాయి. ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు. గుంపులుగా ఉండకుండా జాగ్రత్త వహించాలని వైద్య అధికారులు సూచిస్తున్నారు.