BRS MLA Durgam Chinnaiah:
నిత్యం వివాదాలతో సహవాసం చేస్తున్నారు బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. ఇప్పటికే లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్న ఆయన ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో మరోమారు వివాదంలో చిక్కుకున్నారు. మరోసారి నోరు జారి చిక్కుల్లో పడ్డారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుని చావాలి అంటూ దారుణమైన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని, రైతులకు క్షమాపణ చెప్పాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
మంచిర్యాల జిల్లా బేల్లంపల్లి మండలం బట్వాన్ పల్లి గ్రామ పంచాయతీలో అభివృద్ధి పనులు శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సభలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య రైతుల గురించి మాట్లాడుతూ.. ఈ దేశంలో అన్నం పెట్టే రైతన్న ఆకలితో చావద్దు, ఆత్మహత్యలు చేసుకొని చావాలి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో అవాక్కవడం అక్కడి నేతలు, ప్రజల వంతయ్యింది. రైతులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెల్లడించారు. అయితే, రైతుల గురించి నోరు జారిన ఎమ్మెల్యే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
రైతు ఆకలితో చావకూడదని, ఆత్మహత్యలు చేసుకోకుండా చూడాలని కేసీఆర్ ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుంటున్నారని చెప్పబోయారు. కానీ దుర్గం చిన్నయ్య నోరుజారి రైతులు ఆత్మహత్య చేసుకుని చనిపోవాలని వ్యాఖ్యానించారు. దుర్గం చిన్నయ్య రైతులపై చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆచితూచీ మాట్లాడటం ఎమ్మెల్యే నేర్చుకోవాలని, లేకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.