Nizamabad News : నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం షాపూర్ లో 80 కుటుంబాలను సామాజిక బహిష్కరణ చేశారు గ్రామపెద్దలు. ఓ వ్యక్తికి జరిమానా విషయంలో తలెత్తిన వివాదం గ్రామ పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లో పెదరాయుళ్ల తీర్పులు కొనసాగుతూనే ఉన్నాయి. గ్రామాభివృద్ధి కమిటీల పేరుతో కొందరు ఇష్టారీతిలో వ్యవహరిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం షాపూర్ లో 80 కుటుంబాలకు భూమి కౌలుకు ఇవ్వొద్దని, ఆటోల్లో తీసుకెళ్లకూడదని, ప్రైవేటు వైద్యులు వైద్య సాయం చేయకుండా గ్రామాభివృద్ధి కమిటీ ఆంక్షలు విధించారు. ఓ వ్యక్తి జరిమానా విషయంలో తలెత్తిన వివాదంతో 80 కుటుంబాలపై ప్రభావం చూపింది. షాపూర్ గ్రామానికి చెందిన గంగాధర్ అనే వ్యక్తి కరెంట్ మీటర్ ను మరో మహిళకు అమ్మడంతో అతనికి గ్రామాభివృద్ధి కమిటీ రూ.1.20 లక్షల జరిమానా విధించిoది. అప్పుడు జరిగిన ఒప్పందంలో జరిమానా చెల్లిస్తే మీటర్ తిరిగి ఇస్తామని చెప్పారు గ్రామపెద్దలు. ఈ ఒప్పందం జరిగినప్పుడు గల్ఫ్ లో ఉన్నారు గంగాధర్.
పోలీసులకు ఫిర్యాదుతో
స్వగ్రామానికి తిరిగి వచ్చిన గంగాధర్ ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామాభివృద్ధి కమిటీపై ఫిర్యాదు చేస్తావా అంటూ ఎదురుదాడితో మున్నూరుకాపు సామాజిక వర్గం అయిన 80 కుటుంబాలను బహిష్కరిస్తూ తీర్పునిచ్చారు గ్రామపెద్దలు. వారి భూములు కౌలుకు తీసుకున్నా... వారికి కౌలుకు ఇచ్చినా లక్ష జరిమానా, వారితో మాట్లాడితే రూ.10 వేల జరిమానా విధిస్తామని తీర్మానించారు. ఇక బహిస్కరణకు గురైన కుటుంబాలకు మంచి చెడులకు వెళ్లొద్దని, మాదిగలు డప్పులు కొట్టరాదని, రజకులు బట్టలు ఉతకరాదని, నాయి బ్రాహ్మణులు క్షవరం చేయరాదని ఆంక్షలు విధించారు. పైగా ఆటోలో నందిపేట వరకు వెళ్ళొద్దని స్కూల్ పిల్లలను ఆటోలో ఎక్కించుకోరాదని గ్రామంలో డప్పు చాటింపు చేశారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
అధికారుల విచారణ
బాధితుల ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు. నందిపేట్ మండల్ షాపూర్ గ్రామ బహిష్కరణపై ఆర్డీఓ, పోలీసుల అధ్వర్యంలో విచారణ జరుపుతున్నారు. ఆర్డీఓ శ్రీనివాస్, సీఐ గోవర్ధన్ రెడ్డి సమక్షంలో షాపూర్ గ్రామపంచాయతీలో చర్చలు జరుపుతున్నారు. గ్రామంలో అభివృద్ధి కమిటీ ఎవరిని బహిష్కరించలేదని ఇరువురి మధ్య జరిగిన ఆరోపణలపై అన్ని వివరాలు తీసుకున్నామని గ్రామ అభివృద్ధి కమిటీని మందలించి కౌన్సిలింగ్ చేశామన్నారు. బాధితులకి న్యాయం చేస్తామని అధికారులు, పోలీసులు తెలిపారు. ఈ విషయంపై గ్రామాభివృద్ధి కమిటీకీ నాలుగు రోజులు గడువు ఇచ్చారు అధికారులు.
అసలేం జరిగింది?
షాపూర్ గ్రామానికి చెందిన ఎనుగంటి సుజాత అనే మహిళ గతంలో గ్రామంలో ఒక స్థలం కొనుగోలు చేసింది. ఆ స్థలంలోనే ఇల్లు కట్టుకుంది. అయితే సుజాత నిర్మించుకున్న ఇంటి స్థలం గ్రామ పంచాయతీదంటూ గ్రామ అభివృద్ధి కమిటీ ఆరోపిస్తుంది. ఇదే విషయమై ముందు సుజాత కుటుంబాన్ని సామాజిక బహిష్కరణ చేస్తూ గ్రామ కమిటీ తీర్మానం చేసింది. గ్రామంలో ఆ కుటుంబంతో ఎవరూ మాట్లాడకూడదని ఆంక్షలు విధించారు. అయితే అదే గ్రామానికి చెందిన ముప్పటి గంగాధర్ అనే వ్యక్తి ఉపయోగంలో లేని తన కరెంటు మీటరును సుజాతకు విక్రయించాడు. దీంతో అసలు వివాదం మొదలైంది. సుజాతకు గంగాధర్ మీటర్ ఇచ్చిన సంగతి తెలుసుకున్న వీడీసీ సభ్యులు తీర్మానాన్ని ఉల్లంఘించారని గంగాధర్ కు జరిమానా విధించారు. అంతే కాకుండా సుజాత నుంచి తాను ఇచ్చిన కరెంటు మీటరును కూడా తిరిగి ఇస్తామని ఒప్పంద పత్రం కూడా గంగాధర్ కు రాసి ఇచ్చారు.