Krishna River Cable Bridge: రెండు తెలుగు రాష్ట్రాలు అయిన ఏపీ, తెలంగాణల మధ్య కృష్ణా నదిపై రూ.1, 082.56 కోట్లతో ఐకానిక్ తీగల వంతెన నిర్మించడానికి ఆమోదం తెలిపినట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. సిద్దేశ్వరం, సోమశిల మధ్య ఈ నిర్మాణం 30 నెలల్లో పూర్తి అవుతుందని గురువారం ట్విట్టర్ లో ప్రకటించారు. చుట్టూ విశాలమైన శ్రీశైలం జలాశయం, నల్లమస అడవి, ఎత్తైన పర్వతాల మధ్య నిర్మించే ఈ వంతెన పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుందని తెలిపారు. తెలంగాణ వైపున లలితాసోమేశ్వర ఆలయం, ఆంధ్రప్రదేశ్ వైపున సంగమేశ్వర ఆలయాన్ని చూడటానికి ఇదో కేంద్రంగా మారుతుందని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో శ్రీ సత్య సాయి జిల్లా పరిధిలోకి వచ్చే ఎన్హెచ్-342ను పుట్టపర్తి-కోడూరు సెక్షన్ నుంచి రెండు నుంచి నాలుగు వరుసలుగా విస్తరించినున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. 47.62 కిలో మీటర్ల మేర మార్గాన్ని ఈపీసీ పద్ధతిలో రూ.1318.57 కోట్లతో రెండేళ్లలో అభివృద్ధి చేస్తామని వివరించారు.