Nirmal Police Drone Search Operation: నిర్మల్ జిల్లా కడెం అటవీ ప్రాంతంలో ఓ వృద్ధుడు మిస్సయ్యాడు. నిన్నటి నుంచి వర్షంలో అడవికి వెళ్లిన ఓ వృద్ధ పశువుల కాపరి తిరిగి ఇంటికి రాకపోవడంతో కడెం పోలీసులు అప్రమత్తమయ్యారు. నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల ఆదేశాల మేరకు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతూ డ్రోన్ కెమెరాల సహాయంతో పోలీసులు శనివారం ఉదయం నుంచి ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.
బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కడెం మండలం నవాబ్ పేట్ గ్రామానికి చెందిన సిందం గంగన్న అనే రైతు శుక్రవారం తన మూడు పశువులను మేత కోసం సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతానికి తోలుకెళ్లాడు. అయితే, సాయంత్రానికి పశువులు మాత్రమే తిరిగి ఇంటికి చేరుకున్నాయి కానీ, గంగన్న రాకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేకపోవడంతో వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.
శుక్రవారం ఆ ప్రాంతంలో తీవ్రస్థాయిలో భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా ఏవైనా వాగులు దాటలేక అడవిలోనే చిక్కుకుపోయాడా? లేక దారి తప్పి దట్టమైన అటవీ అంతర్భాగంలోకి వెళ్లాడా అనే కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వృద్ధుడి వయస్సు 70 సంవత్సరాలు కావడంతో పాటు భారీ వర్షం పడటం కుటుంబ సభ్యుల ఆందోళనను మరింత పెంచింది.
సమాచారం అందుకున్న వెంటనే కడెం ఎస్సై సాయికిరణ్, స్పెషల్ పార్టీ ఆర్ఎస్ఐ రాకేష్ ఆధ్వర్యంలో సుమారు 20 మందితో కూడిన పోలీసు, స్పెషల్ పార్టీ బృందాలు రంగంలోకి దిగాయి. దట్టమైన అడవి కావడం, కాళ్లతో వెళ్లడం కష్టతరంగా మారడంతో గాలింపు కోసం అధునాతన డ్రోన్ కెమెరాలను ఉపయోగిస్తున్నారు. నవాబ్ పేట్ అటవీ సరిహద్దుల నుండి చుట్టుపక్కల కిలోమీటర్ల మేర ఉదయం నుండి రాత్రి వరకు డ్రోన్లతో శోధిస్తున్నారు.
ఏజెన్సీ గ్రామాల ప్రజలు, అటవీ ప్రాంత సమీప నివాసితులు ఎవరైనా గంగన్న ఆచూకీ కనిపిస్తే వెంటనే పోలీసులకు గానీ, ఆయన కుటుంబ సభ్యులకు గానీ సమాచారం అందించాలని కడెం ఎస్సై సాయి కిరణ్ విజ్ఞప్తి చేశారు. అటవీ శాఖ అధికారుల సహకారంతో కూడా వెదుకుతున్నారు.
