Ramji Gond : ఆదివాసీ పోరాట యోధుడు మర్సుకొల రాంజీగోండ్ 163వ వర్ధంతిని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆదివాసీలు జరుపుకున్నారు. నిర్మల్ జిల్లాలోని వెయ్యి ఉర్రిల మర్రి వద్ద ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ ఆధ్వర్యంలో రాంజీగోండ్ 163వ వర్ధంతి కార్యక్రమం జరుపుకున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎల్లపల్లి రోడ్ లోని రాంజీగోండ్ స్థూపానికి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకగారి భూమయ్య ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులార్పించారు. ఈ సందర్భంగా తుడుందెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకగారి భూమయ్య మాట్లాడుతూ.. భారతదేశ చరిత్రలోనే గొప్ప పోరాటం రాంజీగోండ్ పోరాటమన్నారు. ఈ దేశంలో 1857 సిపాయిల తిరుగుబాటు మొదలు కాక ముందే నిర్మల్ కొండల్లో నడిచిన పోరాటం రాంజీగోండ్ పోరాటమని అన్నారు. బ్రిటీష్, నైజాంలతో జరిగిన హోరాహోరి పోరులో గోండు రాజ్య రక్షణ కోసం చేసిన పోరాటంలో 1860 ఏప్రిల్ 9న రాంజీగోండుతో సహా 1000 మందిని నిర్మల్ ప్రాంతంలోని ఎల్లపల్లి వెళ్లే చెరువు కట్ట వద్ద ఊడల మర్రికి ఉరితీశారని గుర్తుచేశారు. ఈ ఘటన స్వాతంత్ర్య పోరాటంలో ఎక్కడలేదని అన్నారు. ఆదివాసీ పోరాట యోధుల చరిత్రను ఈ దేశం అణచివేసిందన్నారు. స్వాతంత్య్ర పోరాట చరిత్రలో పనికిరాని వారి చరిత్ర రాశారు కానీ రక్తం ఏరులై పారిన ఆదివాసుల చరిత్రని రాయకపోవడం ఆదివాసీలపై అణచి వేత ధోరణికి నిదర్శనం అన్నారు. 




ట్యాంక్ బండ్ పై విగ్రహం 


1000 మంది గోండుల ఉరికొయ్యల అర్థనాదాలను ఈ ప్రభుత్వాలు నేటికీ గుర్తించకపోవడం దుర్మార్గ చర్య అని, అందుకే భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రాంజీగోండు చరిత్రని బాహ్య ప్రపంచానికి తెలిసేలా చేసి అధికారికంగా వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించాలని వెంకగారి భూమయ్య కోరారు. రాంజీగోండు విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలని, రాంజీగోండు చరిత్రని పాఠ్య పుస్తకంలో చేర్చాలని తెలంగాణ పోరాట గడ్డపై ఉన్న వీరున్ని ఈ దేశ చరిత్రలో నిర్మాణం చేసేలా ప్రభుత్వం కృషి చేయాలని అన్నారు.  


కుమ్రం భీం కాలనీలో రాంజీగోండ్ 163వ వర్ధంతి కార్యక్రమం 


ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కుమ్రం భీం కాలనీలో ఆదివాసీ అమరవీరుడు రాంజీగోండు 163వ వర్థంతి కార్యక్రమం నిర్వహించారు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో కుమ్రం భీం కాలనీ నుంచి బస్‌స్టాండ్ వరకు రెండు కిలోమీటర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. సంప్రదాయ రీతిలో డోలు వాయిద్యాలు వాయిస్తూ అమర్ హై రాంజీగోండ్, రాంజీగోండ్ ఆశయాలను నెరవేర్చాలంటూ ర్యాలీలో నినాదాలు చేశారు. అనంతరం బస్‌స్టాండుకు చేరుకొని రాంజీగోండు విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు గోడం గణేష్ మాట్లాడుతూ... బ్రిటిష్, నైజాంలతో నాడు గోండు రాజ్య రక్షణ కోసం చేసిన పోరాటంలో ఏప్రిల్ 9న మర్సుకోల రాంజీగోండు తో సహా 1000 మందిని నిర్మల్ ప్రాంతంలోని ఎల్లపల్లి వెళ్లే చెరువు కట్ట వద్ద ఊడల మర్రికి ఉరితీసిన చరిత్ర.. నేడు స్వాతంత్ర్య పోరాటంలో ఎక్కడలేదని అన్నారు. ఆదివాసి పోరాట యోధుల చరిత్రను ఈ దేశం అణచివేసిందన్నారు.