YS Sharmila : హైదరాబాద్ లోటస్ పాండ్ వద్ద జరిగిన ఘర్షణ అనంతరం వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు. గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం ఆమెను నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. ఎలాంటి పోలీస్ వారెంట్ లేకుండా తన ఇంటి మీదకి పెద్ద సంఖ్యలో పోలీసులు వచ్చారని షర్మిల వాదనలు వినిపించారు. పోలీసులు ఎలాంటి అరెస్టు నోటీసు ఇవ్వలేదన్నారు. పైగా పోలీసులు తనపై దురుసుగా ప్రవర్తించారన్నారు. తనను తాకే ప్రయత్నం చేశారన్నారు. ఆత్మరక్షణలో భాగంగానే పోలీసులను నెట్టివేశానని కోర్టుకు తెలిపారు. అయితే షర్మిల రిమాండ్ పై వాదనలు ముగిశాయి. ముందు తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు.. తాజాగా షర్మిలకు రిమాండ్ విధించింది. 14 రోజుల పాటు మే 8 వరకు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. దీంతో ఆమెను జైలుకు తరలించారు.
పోలీసులే దురుసుగా ప్రవర్తించారు
షర్మిల తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... TSPSC పేపర్ లీకేజ్ కేసుపై సిట్ చీఫ్ ను కలవడానికి వెళ్తున్న షర్మిలను పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. షర్మిలను ప్రతిసారి పోలీసులు టార్గెట్ చేస్తున్నారని కోర్టుకు వెల్లడించారు. పోలీసులే షర్మిలపై దురుసుగా ప్రవర్తించారన్నారు. 41 crpc నోటీసులు ఇవ్వకుండా షర్మిలను అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. షర్మిలపై నమోదు చేసిన సెక్షన్స్ అన్ని ఏడు సంవత్సరాలలోపు శిక్ష మాత్రమేనన్నారు. షర్మిల రిమాండ్ రీజెక్ట్ చెయ్యాలని ఆమె తరఫు లాయర్ కోర్టును కోరారు. బెయిల్ పిటిషన్ కూడా వేస్తున్నామన్నారు. ఆడపిల్ల అని కూడా చూడకుండా ఎక్కడపడితే అక్కడ పోలీసులు టచ్ చేశారని కోర్టుకు వెల్లడించారు. షర్మిల దర్యాప్తునకు సహకరిస్తామని స్పష్టం చేశారు.
పోలీసులపై దాడిని ఖండించిన పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్
ఎస్సై, కానిస్టేబుల్ వైఎస్ షర్మిల చేయి చేసుకోవడంపై హైదరాబాద్ సిటీ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. విధినిర్వహణలో ఉన్న పోలీసులపై వైఎస్ షర్మిల, విజయమ్మ దాడిని ఖండిస్తున్నామని తెలిపింది. శాంతి భద్రతల విధుల్లో ఉన్న పోలీసుల పట్ల వైఎస్ విజయమ్మ, షర్మిల ప్రవర్తించిన తీరు, దురుసుతనాన్ని ఖండిస్తున్నామని హైదరాబాద్ సిటీ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు నల్లా శంకర్ రెడ్డి తెలిపారు. ఇలాంటి చర్యలతో పోలీసుల ఆత్మాభిమానాన్ని దెబ్బతింటుందన్నారు. రాజకీయనాయకులు పోలీసుల సహనాన్ని పరీక్షించకూడదని హెచ్చరించారు. శాంతి భద్రతల పర్యవేక్షణ, నేరాలను అదుపుచేయడంలో తెలంగాణ పోలీసులు దేశంలో అత్యున్నత గుర్తింపు ఉందన్నారు. కానీ కొంతమంది రాజకీయ నేతలు ఇటీవల కాలంలో వ్యక్తిగత గుర్తింపు కోసం చౌకబారు చర్యలతో పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారని ఆరోపించారు.
షర్మిలపై కేసు నమోదు
లోటస్ పాండ్ వద్ద పోలీసుల మీద దాడి చేసిన వైఎస్ షర్మిలతో పాటు కారును ఆపకుండా పోనిచ్చిన ఇద్దరు డ్రైవర్లపై పోలీసులు కేసు నమోదుచేశారు. కానిస్టేబుల్ గిరిబాబు కాలు మీద కారు ఎక్కించిన షర్మిల కాన్వాయ్ లో ఇద్దరు డ్రైవర్ ల మీద బంజారాహిల్స్ ఎస్ ఐ రవీందర్ ఫిర్యాదు చేశారు. ఎస్ఐ ఫిర్యాదుతో ఐపీసీ 332, 353 , 509, 427 సెక్షన్స్ కింద షర్మిలపై కేసు నమోదు చేశారు. వైఎస్ షర్మిల పోలీసుల వద్ద మాన్ పాక్స్ లాక్కొని పగలగొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. షర్మిలపై 337, రెడ్ విత్ 34 కింద మరో రెండు సెక్షన్లు నమోదు చేశారు. అయితే కారు ఎక్కించడంతో గాయపడ్డ కానిస్టేబుల్ గిరిబాబును స్టార్ ఆస్పత్రికి తరలించారు. స్కానింగ్ చేయగా, కాలి లిగ్మెంట్‌కు గాయం అయినట్లు డాక్టర్స్ గుర్తించారు. ఈ క్రమంలో బాధిత పోలీసుల ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు షర్మిలపై కేసు నమోదు చేశారు.