Telangana CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మునుగోడు ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. రాజకీయాల్లో నీతి, నైతికతపై కేసీఆర్ మాట్లాడడం హాస్యాస్పదం అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో సీఎం కేసీఆర్ చూపించిన నలుగురు ఎమ్మెల్యేలలో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అని గుర్తుచేశారు ఉత్తమ్. చండూరులో జరిగిన బహిరంగ సభలో.. టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఓటు వేస్తే తీవ్రంగా పరిణామాలుంటాయని మునుగోడు ఓటర్లను సీఎం కేసీఆర్ బహిరంగంగానే బెదిరించారని అన్నారు. ఆదివారం నాడు ఆయన ఒక ప్రకటన చేస్తూ నవంబర్ 3 తర్వాత మునుగోడులో ప్రతిపక్ష పార్టీలు కనిపించవని, నవంబర్ 4న తనకు మళ్లీ అధికారం వస్తుందని అంటూ కేసీఆర్ పరోక్షంగా ప్రజలను బెదిరించారని అన్నారు. కాంగ్రెస్ మరియు ఇతర పార్టీల మద్దతుదారులకు ఇది సహించలేనిదని, భారత ఎన్నికల సంఘం కేసీఆర్ ప్రసంగాన్ని గమనించాలని అన్నారు.
విపక్షాలపై నిందలు వేయడం విడ్డూరం
మునుగోడు నియోజకవర్గంలో అభివృద్ధి జరగకపోవడానికి ముఖ్యమంత్రి విపక్షాలపై నిందలు వేయడం విడ్డూరంగా ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 2014-18లో మునుగోడు నియోజకవర్గం ఎమ్మెల్యేగా ప్రస్తుత టీఆర్‌ఎస్ అభ్యర్థి కె.ప్రభాకర్‌రెడ్డి ప్రాతినిధ్యం వహించారని.. పనితీరు లేకపోవడంతో 2018లో ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టారని.. 2014 నుంచి టీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నందున అభివృద్ధి జరగజాపోవడానికి కేసీఆర్ సిగ్గుపడాలన్నారు. గత ఎనిమిదేళ్లలో మునుగోడు ప్రజలకు ఇచ్చిన హామీలను కేసీఆర్ నిలబెట్టుకోలేదని అన్నారు..
'ఆపరేషన్ లోటస్', 'ఆపరేషన్ ఫాంహౌస్' పేరుతో ప్రజలను వాస్తవ సమస్యల నుంచి మరల్చేందుకు టీఆర్‌ఎస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయని ఉత్తమ్ అన్నారు. టీఆర్‌ఎస్, బీజేపీ రెండూ పార్టీల రాజకీయాలను నమ్మవని అందరికీ తెలుసునని 2014 - 2018 మధ్య కాలంలో కేసీఆర్ తన మొదటి ప్రభుత్వంలో 47 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల ఫిరాయింపులకు శ్రీకారం చుట్టారని చెప్పారు. రెండోసారి గెలిచిన తర్వాత మళ్లీ 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులకు శ్రీకారం చుట్టారని.. అదే విధంగా కర్ణాటక, మధ్యప్రదేశ్, గోవా, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో ఎన్నికైన ప్రభుత్వాలను బీజేపీ కూల్చివేసిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘాటుగా విమర్శించారు.
నీతి, నైతికత గురించి కేసీఆర్ మాట్లాడటం హాస్యాస్పదం
కేసీఆర్ నీతి, నైతికత గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. ఈ రోజు జరిగిన మునుగోడు సమావేశంలో టీఆర్‌ఎస్‌పై ఫిరాయింపునకు బీజేపీ ఒక్కొక్కరికి రూ.100 కోట్లు ఇవ్వడాన్ని ‘తిరస్కరించిన’ నలుగురు ఎమ్మెల్యేలను కేసీఆర్ ప్రవేశపెట్టారని అందులో నలుగురిలో ముగ్గురు ఎమ్మెల్యేలు (పైలట్ రోహిత్‌రెడ్డి) , హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావు), 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్‌పై ఎన్నికయ్యారు. మరో 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి వారిని టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించేలా చేసింది కేసీఆర్' కాదా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి శ్రవంతి భారీ మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్న టీఆర్‌ఎస్, బీజేపీ రెండింటినీ మునుగోడు ప్రజలు తిరస్కరిస్తారని అన్నారు.