SLBC Tunnel Collapse Rescue operation: టన్నెల్‌లో చిక్కుకున్న 8 మందిని గుర్తించేందుకు ప్రయత్నాలు ముమ్మరం, ‘ఆక్వా ఐ’ పరికరాన్ని పంపించిన నేవీ

SLBC Tunnel Rescue operation: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ లోపల చిక్కుకున్న 8 మందిని గుర్తించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. టన్నెల్ లోపలికి ఆక్వా ఐ అనే పరికరాన్ని నేవీ పంపింది.

Continues below advertisement

SLBC Tunnel Collapse |  నాగర్‌కర్నూలు: శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం (SLBC Tunnel) లోపల చిక్కుకున్న 8 మందిని గుర్తించే ప్రక్రియ వేగవంతం చేశారు. లోపల చిక్కుకున్న వారిని గుర్తించేందుకు నేవీ టీమ్ "ఆక్వా ఐ" పరికరాన్ని టన్నెల్ లోపలికి పంపించింది. గత మూడు రోజులుగా టన్నెల్ లోపల చిక్కుకున్న వారిని బయటకు తెచ్చేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ లోపల నాలుగైదు అడుగుల మేర బురద, నీరు ఉన్న కారణంగా వారి వద్దకు చేరుకోవడం కష్టంగా మారింది. 

Continues below advertisement

నాగర్ కర్నూలు జిల్లాలోని దోమలపెంట సమీపంలో SLBC టన్నెల్ లోపల 14వ కిలోమీటర్ వద్ద టన్నెల్ బోరింగ్ మెషిన్ తో వర్క్ చేస్తుంటే ఒక్కసారిగా మూడు మీటర్ల మేర పైకప్పు కూలిపోవడంతో విషాదం నెలకొంది. ఆ సమయంలో దాదాపు 50 మంది ఉండగా.. బోరింగ్ మెషీన్ అవతల వైపున ఉన్న అధికారులు, కార్మికులు మొత్తం 42 మంది రెండు, మూడు కిలోమీటర్లు వరకు పరిగెత్తి.. అక్కడి నుంచి లోకో ట్రైన్ ద్వారా ప్రయాణించి సొరంగం ఎంట్రీ పాయింట్ కు చేరుకుని ప్రాణాలు కాపాడుకున్నారు. టన్నెల్ బోరింగ్ మెషిన్ లోపలి వైపున ఉన్న ప్రాజెక్టు ఇంజినీర్లు, కార్మికులు కలిసి మొత్తం 8 మంది టన్నెల్ లోపల చిక్కుకుపోయారు. వారిని బయటకు తెచ్చేందుకు మొత్తం 9 టీమ్స్ రంగంలోకి దిగాయి. అటు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ తో పాటు నేవీ, ఆర్మీ ఇతర సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. 


తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
టన్నెల్ లోపల బురద, నీరు పేరుకుపోయిన పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ర్యాట్ హోల్స్ మైనర్స్‌ను రంగంలోకి దింపనుంది. వాస్తవానికి ర్యాట్ హోల్ మైనింగ్ అనేది ప్రమాదకరమైన విధానం కాగా, ఏం చేయలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఆ విధానానికి మొగ్గు చూపింది. బొగ్గు గనుల నుండి బొగ్గును వెలికి తీయడంలో ర్యాట్ హోల్ మైనింగ్ టెక్నిక్ వినియోగిస్తారని తెలిసిందే. ర్యాట్ హోల్ టెక్నిక్ ద్వారా బొగ్గుు గనుల్లో సన్నని, సమాంతర మార్గం ఏర్పాటు చేసి.. బొగ్గు వరకు చేరుకుని దాన్ని బయటకు తీసేందుకు గుంతలను తవ్వుతారు. ఈ విధానంలో సమస్య ఏంటంటే.. ఆ గుంతలు 4 అడుగుల వెడల్పు ఉండటంతో, ఒకసారి ఒక వ్యక్తి మాత్రమే అందులో నుంచి వెళ్లడానికి సాధ్యపడుతుంది. కార్మికులు గనులలోకి ప్రత్యేక పనిముట్లతో, నిచ్చెనల సాయంతో, మరింత సురక్షితంగా లోపలికి ప్రవేశించి జాగ్రత్తగా పనులు చేపడుతుంటారు.

Continues below advertisement