Bandi Sanjay: మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్... నల్గొండ జిల్లా నాంపల్లి మండలం ఎస్.లింగోటం గ్రామంలో ప్రచారం చేశారు. మునుగోడు ఉపఎన్నికల్లో పోటీ చేస్తున్న టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల్లో ఎవరు మంచి వారో, ఎవరికి సాయం చేసే గుణం ఉందో మీరే ఆలోచించండని.. బాగా ఆలోచించుకున్నాకే ఓటు వేయాలని సూచించారు. ఆపదలో ఉంటే ఆదుకునే నాయకుడు కావాలా లేక.. మిమ్ముల్ని నట్టేట ముంచే నాయకుడు కావాలా అంటూ ప్రజలను ఉద్దేశించి ప్రశ్నించారు. ప్రతి ఒక్క ఓటరు ఓటును వినియోగించుకోవాలని సూచించారు. 100 శాతం పోలింగ్ నమోదు అవ్వాలని బండి సంజయ్ తెలిపారు. పువ్వు గుర్తుపై ఓటేసి టీఆర్ఎస్ బాక్సును బద్దలు చేయండంటూ కామెంట్లు చేశారు. 






దేశ్ కీ నేత కెసిఆర్ ను మునుగోడు నియోజకవర్గంలోకి లెంకలపల్లికి గుంజుకొచ్చిన ఘనత బీజేపీదేనన్నారు. ఇన్ని రోజులు ముఖ్యమంత్రిగా ఉండి ఏమీ చేయని సీఎం కేసీఆర్ ఇప్పుడు ఎన్నికలు వచ్చాయని మునుగోడుకు వస్తున్నారని ఆరోపించారు. కుల, వర్గం, వర్ణాల పేరుతో చీల్చేందుకు టీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని బండి సంజయ్ చెప్పుకొచ్చారు. టిఆర్ఎస్ చేసే తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని.. ఊరంతా కలిసి ఒకే తాటిపై నిలబడి ఓటేయాలని కోరుతున్నానన్నారు. 


టీఆర్ఎస్ నేతలపై ఫైర్..


టీఆర్ఎస్ నేతల కళ్లు మునుగోడు నియోజకవర్గ భూములపై పడ్డాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. ఎన్నికల ప్రచారం పేరుతో టీఆర్ఎస్ దండుపాళ్యం ముఠా మునుగోడులో ఊరూరా తిరుగుతూ భూముల గురించి ఆరా తీస్తున్నాయని అన్నారు. టీఆర్ఎస్ గెలిచిన వెంటనే ఈ నియోజకవర్గంలోని భూములన్నీ కబ్జా చేయబోతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అందులో భాగంగా టీఆర్ఎస్ నేతలు ఓటుకు రూ.40 వేలు ఇవ్వబోతున్నారని చెప్పారు. టీఆర్ఎస్ నేతలిచ్చే డబ్బులన్నీ పేదల రక్తం పీల్చి సంపాదించిన సొమ్మేనని విమర్శించారు. ఆ పైసలన్నీ కచ్చితంగా తీసుకోవాలని, ఓటు మాత్రం పువ్వు గుర్తుకు వేసి టీఆర్ఎస్ కు బుద్ది చెప్పాలన్నారు. మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా బండి సంజయ్ తిరుగుండ్లపల్లి, తమ్మడపల్లిలో రోడ్ షో ప్రారంభించారు. రోడ్ షో లో ప్రజలు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.  


యుద్ధం మొదలైంది.. 


తెలంగాణలో యుద్ధం స్టార్ట్ అయ్యిందని బండి సంజయ్ తెలిపారు. రాక్షసులకు, రామదండు మధ్య యుద్ధం మొదలైందన్నారు.  సిద్దిపేటలో ఆడోళ్ల పుస్తెల తాడును తెంపుకొచ్చిన టీఆర్ఎస్ దండుపాళ్యం ముఠా మునుగోడు మీద పడిందన్నారు. మునుగోడులో ఆత్మగౌరవానికి, అహంకారానికి మధ్య జరుగుతున్న పోరాటం అన్నారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఏమొచ్చిందని అన్నోళ్లంతా ఇవాళ మునుగోడులోనే ఉన్నారన్నారు. ఏకంగా 15 మంది మంత్రులు, 86 ఎమ్మెల్యేలంతా మునుగోడు ప్రజల కాళ్ల దగ్గరకు వచ్చారన్నారు. అడిగిందల్లా ఇస్తామని ఆశ చూపుతున్నారన్నారు. మునుగోడులో ఇంటింటికీ తిరిగి ఓటుకు రూ.40 వేలు పంచేందుకు టీఆర్ఎస్ నేతలు సిద్ధమయ్యారన్నారు. అవన్నీ పేదోళ్ల రక్తం తాగి సంపాదించిన పైసలే అని మండిపడ్డారు. పేదోళ్లు పైసలు పడేస్తే ఓట్లేస్తారని కేసీఆర్ అనుకుంటున్నారని,  ఆ పైసలన్నీ పక్కా తీసుకోండి ఓటు ఎవరికి వేయాలో అక్కడ వేసి టీఆర్ఎస్ కు బుద్ది చెప్పాలన్నారు.