Miriyalaguda MLA: కుమారుడి పెళ్లి విందు ఖర్చుతో రైతులకు ఉచితంగా యూరియా- మిర్యాలగూడ ఎమ్మెల్యే ఆదర్శం
Miriyalaguda MLA: రైతుల సమస్యలపై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తుంటారు. కానీ మిర్యాలగూడ ఎమ్మెల్యే స్పందించిన విధానం అందరీ చర్చించుకుంటున్నారు.

Miriyalaguda MLA: మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కుమారుడి వివాహం ఈ మధ్య జరిగింది. వివాహాన్ని సింపుల్‌గా చేసుకున్న ఎమ్మెల్యే పెళ్లి విందును మాత్రం గ్రాండ్‌గా ఇవ్వాలని నిర్ణయించారు. కానీ తన నియోజకవర్గంలో రైతులు పడుతున్న ఇబ్బందులు చూసి కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆయన వైరల్‌గా మారారు.
ఎమ్మెల్యే కుమారుడి విందుకు అయ్యే ఖర్చును రైతులకు అందజేస్తే ఎలా ఉంటుందని ఆలోచించారు. ప్రస్తుతం ప్రతి ప్రాంతంలో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగని ఆయనే యూరియా కొని రైతులకు ఇస్తే రాజకీయంగా విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందుకే ఆయన ఆ డబ్బులు ప్రభుత్వానికి ఇవ్వాలని భావించారు.
అనుకున్నట్టుగానే బత్తుల లక్ష్మారెడ్డి ముఖ్యమంత్రిని కలిశారు. తన మనసులో మాట చెప్పారు. తన కుమారుడు ప్రసన్నను, కోడలు వెన్నలతో వెళ్లి ముఖ్యమంత్రికి చెక్ అందజేశారు. విందు కోసం రెడీ చేసుకున్న రెండు కోట్ల రూపాయలను రేవంత్ రెడ్డికి ఇచ్చారు. తన నియోజకవర్గంలోని రైతుల కోసం 2 కోట్లను ఖర్చు చేయాలని విజ్ఞప్తి చేశారు. లక్ష మంది రైతులకు ఒక్కో యూరియా బస్తా ఉచితంగా అందజేయాలని కోరిన ఎంఎల్ఏ కోరారు.
మిర్యాలగూడలో భారీ ఎత్తున రిసెప్షన్ ఏర్పాటు చేయాలని భావించిన ఎంఎల్ఏ లక్ష్మారెడ్డి దాన్ని రద్ధు చేసుకున్న విషయం తెలిసి రేవంత్ రెడ్డి ఆశ్చర్యపోయారు. రిసెప్షన్ డబ్బును రైతుల కోసం ఖర్చు చేయాలనే ఆలోచనను అభినందించారు. రైతుల ఆశీస్సులు నూతన దంపతులపై ఉంటాయని ఆకాంక్షించారు. ఆయన కూడా వారిని ఆశీర్వదించారు.





















