Minister Jagadish Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. రాయల తెలంగాణ అంశం వదిలి ఆంధ్ర ప్రజలు సువర్ణ ఆంధ్రప్రదేశ్ కోసం ఆ దిశగా ఆలోచన చేయాలన్నారు. అలాగే అక్కడి ప్రభుత్వాల వైఫల్యాలతోనే రాయల తెలంగాణ అంశం తెరమీదకు వచ్చిందన్నారు. సూర్యాపేటలో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా గులాబీ జెండాను మంత్రి జగదీష్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాయల తెలంగాణ అంశంపై స్పందిస్తూ ప్రత్యేక రాయలసీమ, రాయల తెలంగాణ ఇప్పుడు సాధ్యం కాదన్నారు. తెలంగాణ అభివృద్ధి దిశగా దూసుకుపోవడమే రాయల తెలంగాణ డిమాండ్ కు కారణం అని చెప్పారు. అలాగే రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, అమలు అవుతున్న పథకాలను చూసి మిగతా రాష్ట్రాల ప్రజలు తమను కూడా తెలంగాణలో కలుపుకోవాలని కోరుతున్నట్లు వివరించారు. ఇది సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధికి సాక్ష్యం అన్నారు. 


"ఇవాళ తెలంగాణ వైపు చూస్తున్నరు అంటే తెలంగాణ పరిపాలన గొప్పతనం ఉంది. కేసీఆర్ పరిపాలన దక్షతకు అది నిదర్శనం. కానీ రాయలసీమను రాష్ట్రంతో కలుపుకోవడం అనేది మాత్రం సాధ్యం కాదు. కానీ ఉంది వాళ్ల చేతుల్లో. పరిపాలనను మార్చుకుంటే సువర్ణ ఆంధ్రప్రదేశ్ చేసుకునే అవకాశం ఉంది. కేసీఆర్ నాయకత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా బలంగా కోరుకుంటున్నరు. అందులో సందేహం లేదు. తప్పుకుండా మిగతా రాష్ట్రాలు కోరుకోవడంలో కూడా తప్పులేదు. ఇవాళ ఉన్న కక్ష పూరిత రాజకీయాలు కాకుండా పరిపాలనను ప్రజల కోసం పని చేసే వాళ్లను వాళ్ల చేతిలోకి గనుక ఇస్తే తప్పకుండా ఆంధ్ర ప్రదేశ్ సువర్ణ ఆంధ్రప్రదేశ్ అవుతుంది." - మంత్రి జగదీష్ రెడ్డి






తెలంగాణలో కలపండి లేకపోతే తమ దగ్గరకి రండి అని కేసీఆర్ ను ఆహ్వానిస్తున్నట్లు మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చినట్లే ఆంధ్రప్రదేశ్ ను సువర్ణాంధ్ర నిర్మాణం చేయడం సాధ్యమని కేసీఆర్ గతంలోనే చెప్పినట్లు వెల్లడించారు. కేసీఆర్ నాయకత్వాన్ని ఆంధ్ర ప్రజలు బలంగా కోరుకుంటున్నారని, వెనకబాటుకు కారణం అయిన పరిపాలకుల మీద ఆంధ్ర ప్రజలు తిరుగుబాటు చేయాలన్నారు. అభివృద్ధి సాధించే నాయకత్వాన్ని ఎన్నుకునే దిశగా ఆంధ్ర ప్రజలు, నాయకులు ఆలోచించాలని కోరారు. 
 






"భారతదేశం మొత్తంలోనే తెలంగాణ ఒక అద్భుతమైన పరిపాలను అందిస్తున్నది కేసీఆర్ నాయకత్వంలో అనేది అద్భుతమైన ఉదాహరణ. ఇవాళ మమ్మల్ని కూడా తెలంగాణల కలపండి అని అడిగిర్రు. అయితే ఇప్పుడొస్తున్న డిమాండ్.. గతంలో ఏదైతే డిమాండ్ వచ్చిందో దానికి ఇవాళ వచ్చినదానికి తేడా ఉంది. ఇది కేవలం ఏపీ నుంచే కాదు. ఓ పక్కన కర్ణాటక నుంచి వస్తా ఉంది. మరోపక్క మహారాష్ట్ర నుంచి, ఛత్తీస్ గఢ్ డిమాండ్ వస్తోంది.  తెలంగాణను ఆనుకొని ఉన్న రాష్ట్రాలతో పాటు సరిహద్దు పంచుకోని రాష్ట్రాలు సైతం ఇవాళ ఇదే కోరుకుంటున్నాయి." - మంత్రి జగదీష్ రెడ్డి