అర్థరాత్రి గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు చేస్తే.. ఎవరైనా ఏమనుకుంటారు. ఎవరినో చంపేసి.. పూడ్చిపెడుతున్నారన్న అనుమానాలు వస్తాయి కదా. నల్లగొండలోనూ  ఇలాంటి సంఘటనే జరిగింది. నల్లగొండ సమీపంలోని పానగల్‌ రిజర్వాయర్‌ దగ్గర చందనపల్లి శివారులో చెత్త డంపింగ్‌ యార్డ్‌ ఉంది.  అర్థరాత్రి పదకొండున్నర గంటలకు  అక్కడికి కొందరు వ్యక్తులు కారు, బైకుల్లో వచ్చారు. వెంట తెచ్చుకున్న పలుగు, పారలతో ఐదు అడుగుల మేర గొయ్యి తీవ్వారు. అందులో డెడ్‌బాడీని పూడ్చిపెట్టారు. ఇది  చూసి స్థానికులంతా భయపడిపోయారు. ఎవరినో చంపేసి... లేదా నరబలి ఇచ్చి, ఇక్కడికి తెచ్చి పూడ్చిపెడుతున్నారని ఆందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు  సమాచారం ఇచ్చేశారు చందనపల్లి గ్రామస్తులు. పోలీసులు వెంటనే సంఘటనాస్థలికి వచ్చారు. గొయ్యి తవ్వించి చూడగా అందలో కుక్క కళేబరం ఉండటం చూసి  షాక్‌ అయ్యారు. దాన్ని అక్కడ పూడ్చింది ఎవరు...? ఎందుకు అలా చేశారు అని ఆరా తీశారు. అసలు విషయం తెలిసి.. అక్కడి నుంచి వెళ్లిపోయారు.


అసలు ఏం జరిగిందంటే..!
నల్లగొండలోని ఓ కుటుంబం పెంచుకుంటున్న పెంపుడు కుక్క చచ్చిపోయింది. పెంపుడు కుక్క కదా... అది చనిపోయిందని తెలిసి కుటుంబంలోని వారంతో శోకసంద్రంలో  మునిగిపోయారు. ఇంట్లోని పిల్లలు అయితే ఏడుపు మొదలుపెట్టారు. దీంతో... పెద్దవాళ్లు వారిని సముదాయించారు. చనిపోయిన కుక్కను తీసుకెళ్లి పూడ్చడం పిల్లలు చేస్తే  తట్టుకోలేరని అర్థరాత్రి వరకు ఆగారు. పిల్లలు నిద్రపోయాక.. కారును కుక్క కళేబరాన్ని తీసుకొచ్చి... అంత్యక్రియలు నిర్వహించారు. నల్లగొండ సమీపంలోని పానగల్‌  రిజర్వాయర్‌ దగ్గర చందనపల్లి శివారులో చెత్త డంపింగ్‌ యార్డ్‌ దగ్గర గొయ్యి తవ్వి... కుక్క కళేబరాన్ని పూడ్చిపెట్టారు. పెంపుడు కుక్క కావడంతో.. పూడ్చిపెట్టే సమయంలో  యజమానులు ఏడ్చారు. ఆ ఏడుపులు విన్న గ్రామస్తులు.. అక్కడ జరుగుతున్నది చూసి... ఏదో ఘోరం జరిగిపోయిందనుకుని కంగారెడ్డి పట్టారు. పోలీసులను టెన్షన్‌  పెట్టారు. ఇది... జరిగింది.


చందనపల్లి గ్రామస్తుల కంగారు.. పోలీసులకు రాత్రంతా నిద్ర లేకుండా చేసింది. అయితే.. అక్కడ పూడ్చింది పెంపుడు కుక్కని అని గుర్తించిన పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.  ఇదే విషయాన్ని చందనపల్లి గ్రామస్తులకు కూడా చెప్పారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పడంతో... గ్రామస్తులు కూడా స్థిమితపడ్డారు.