Khammam BRS Atmiya Sammelanam: తెలంగాణలో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పొలిటికల్ హీట్ పెరిగింది. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీనే విజయం వరిస్తుందని బీజేపీ, కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మరోవైపు కేసీఆర్ నాయకత్వంలో ఎన్నికలకు వెళ్లి బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని గులాబీ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్​ పార్టీకి ఖమ్మం జిల్లాలో  పదికి 10 స్థానాలు వస్తాయని, క్లీన్ స్వీప్ చేస్తుందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్​పై విమర్శలు చేసిన వారు శంకరగిరి మాన్యాలలో కలిసి పోయారని అన్నారు. ఖమ్మంలోని ఖానాపురం హవేలి డివిజన్​లో జరిగిన బీఆర్ఎస్​ఆత్మీయ సమ్మేళానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పువ్వాడ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ప్రవేశపెట్టిన పథకాలే బీఆర్ఎస్ కు ఘన విజయాన్ని అందిస్తాయన్నారు.


డబ్బు, స్వార్థ రాజకీయాలు ఖమ్మం జిల్లాలో నడవవని చెప్పారు. ఇక్కడ రాజకీయ చైతన్యం ఎక్కువ అని, ప్రజలకు అన్ని విషయాలు తెలుసునన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్​తో పెట్టుకున్న వాళ్లు శంకరగిరి మాన్యాలు పట్టారని, పార్టీ నుంచి బయటకు వెళ్లి విమర్శలు చేస్తున్న వారికి ఓటర్లు వచ్చే ఎన్నికల్లో బుద్ది చెబుతారని వ్యాఖ్యానించారు. కొందరు నేతలు తమ స్వలాభం, కాంట్రాక్టుల కోసం పార్టీలు మారిన వారు సీఎం కేసీఆర్ పై విమర్శలు చేయడమా అంటూ ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ గెలుస్తూనే ఉంటుందని, కొందరు మంగమ్మ శపథాలు చేస్తున్నారని.. వారికి త్వరలోనే కనువిప్పు కలుగుతుందని ఎద్దేవా చేశారు. నగరంలో జరిగిన ముస్లిం సోదరుల రంజాన్​తోఫా కార్యక్రమంలో కూడా మంత్రి పువ్వాడ అజయ్ పాల్గొన్నారు. 






ముస్లిం సోదరులకు రంజాన్​ తోఫా అందించిన మంత్రి
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు  ఖమ్మం జిల్లాలో రంజాన్​తోఫాను మంత్రి పువ్వాడ అజయ్ అందించారు. బీఆర్​ఎస్​ ప్రభుత్వం కుల, మతాలకు అతీతంగా పనిచేస్తుందన్నారు. అన్ని కులాలు, మతాల వారికి సంక్షేమ పథకాలు అందజేస్తున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అన్నారు. ఖమ్మం లోని 37,38,39,40 డివిజన్​లోని పేద ముస్లింలకు రంజాన్ తోఫాను ప్రభుత్వం ఉచితంగా అందించింది. ముస్లింలు అందరికీ మంత్రి పువ్వాడ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. 






ఖమ్మం జిల్లా చీమలపాడు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న పోలీస్  దావా నవీన్ ను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరామర్శించారు. అధైర్య పడొద్దని, పూర్తిగా కోలుకునే వరకు అన్ని రకాల వైద్యచికిత్సలు అందించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు.