MP Raghurama Actor Ram charan wishing BRS MP Vaddiraju Ravichandra: హైదరాబాద్: రాజ్యసభకు తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికవుతున్న ఎంపీ వద్దిరాజు రవిచంద్ర (Vaddiraju Ravichandra)కు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ఈ మేరకు పార్టీ పెద్దలు, ముఖ్యులతో చర్చించి.. రాజ్యసభ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్ర పేరును కొన్ని రోజుల కిందట ప్రకటించడం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రముఖ సినీ హీరో రాంచరణ్, లోకసభ సభ్యులు కనుమూరి రఘురామ కృష్ణంరాజు, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను తదితరులు ఎంపీ రవిచంద్రకు శుభాకాంక్షలు చెప్పారు. ప్రముఖ వ్యాపారవేత్త కుందవరపు శ్రీనివాస్ నాయుడి కూతురి పెళ్లికి హాజరైన సందర్భంగా వారితో పాటు మరికొందరు నాయకులు, ప్రముఖులు ఎంపీ రవిచంద్రకు తమ శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా మియాపూర్ లో మరొక పెళ్లిలో ఖమ్మంకు చెందిన పలువురు ఎంపీ వద్దిరాజుతో ఫోటోలు దిగి శుభాభినందనలు చెప్పారు. 


అంతకుముందు ఆదివారం ఉదయం బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఎంపీ రవిచంద్ర నివాసానికి వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు ప్రముఖులు విచ్చేసి శుభాకాంక్షలు తెలిపారు. సామాజికవేత్త ఖాశెట్టి కుమార్, ప్రముఖ విద్యావేత్త లక్కినేని ప్రసాద్,సినీ ప్రముఖులు మల్లం రమేష్, మున్నూరుకాపు ప్రముఖులు వేల్పుల శ్రీనివాస్,బొల్లం లక్ష్మణ్,రంగస్థల నటుడు చల్లగాలి వెంకటరాజు, వ్యాపారవేత్తలు సుమీర్ జైన్,పీ.హనుమంతరావు,టీ.రాజకుమార్, కౌశిక్ కేటరర్స్ అధినేత ఆలపాటి లక్ష్మీనారాయణ తదితరులు ఎంపీ వద్దిరాజును కలిసి శుభాకాంక్షలు చెప్పారు.


బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా వద్దిరాజు
రాజ్యసభ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్ర పేరును బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. పార్టీ అధినేత కేసీఆర్ (KCR) ఈ మేరకు పార్టీ పెద్దలు, ముఖ్యులతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ శాసనసభలో ఆ పార్టీకి ఉన్న బలం ప్రకారం ఒక రాజ్యసభ సీటు దక్కనుంది. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 15 (గురువారం) వరకూ గడువు ఉండడంతో.. వద్దిరాజు గురువారం నామినేషన్ వేశారు. వద్దిరాజుకు వరుసగా రెండోసారి రాజ్యసభ అవకాశం కల్పించారు. మొదటి ధపాలో రెండేళ్ల పాటు ఆయన రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. 


కాగా, తెలంగాణలో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవలే నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 3 స్థానాలకు ఇరు పార్టీల తరఫున ముగ్గురే నామినేషన్లు వేయనుండడంతో ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఈ నెల 27న ఎన్నికలు నిర్వహించి అదే రోజు సాయంత్రం ఫలితాలు వెల్లడించనున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా రేణుకాచౌదరి (Renuka Chowdary), అనిల్ కుమార్ యాదవ్ పేర్లను ఖరారు చేస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిర్ణయం తీసుకున్నారని పార్టీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటన జారీ చేశారు.