MLC Shravan criticized Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న అప్రజాస్వామిక ధోరణి, ఆయన వాడుతున్న హింసాత్మక భాషపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ శ్రవణ్ దాసోజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ విడుదల చేసిన అనంతరం, అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్‌కు సీఎంపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన.. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉండి పాతిపెట్టండి , బొంద పెట్టండి వంటి పదజాలం వాడటం చూస్తుంటే, ఆయన ఒక రాష్ట్రానికి బాధ్యతాయుతమైన నేతలా కాకుండా ఫ్యాక్షన్ ముఠా నాయకుడిలా కనిపిస్తున్నారని ధ్వజమెత్తారు. సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టేలా సాగుతున్న ఈ ప్రసంగాలు నేరపూరిత కుట్రలో భాగమేనని ఆయన మండిపడ్డారు.
రేవంత్ రెడ్డి రాజకీయ పయనంపై శ్రవణ్ సంచలన ఆరోపణలు చేశారు. కప్పుకున్నది కాంగ్రెస్ జెండా అయినా, రేవంత్ ఆత్మ మాత్రం టీడీపీదే అని ఎద్దేవా చేశారు. తన పాత యజమాని చంద్రబాబు నాయుడి అజెండాను అమలు చేస్తూ తెలంగాణలో టీడీపీని మళ్ళీ బలోపేతం చేసేందుకు రేవంత్ ప్లాన్-బి ని అమలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేస్తూ, సొంత పార్టీలోని సీనియర్ నేతలైన భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వంటి వారిని క్రమపద్ధతిలో అణిచివేస్తున్నారని విమర్శించారు. ఒకవైపు ఢిల్లీ అధిష్టానాన్ని నమ్మిస్తూనే, మరోవైపు టీడీపీ, బీజేపీలతో రేవంత్ కోవర్ట్ సంబంధాలు నెరుపుతున్నారని ఆయన ఆరోపించారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై స్పందిస్తూ, రిటైర్డ్ ఉద్యోగులకు కనీసం రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేని స్థితిలో ఉన్న ప్రభుత్వం, ఫ్యూచర్ సిటీ వంటి డొల్ల వాగ్దానాలతో ప్రజలను వంచిస్తోందని శ్రవణ్ విమర్శించారు. సంపద సృష్టించే తెలివి లేక రంగుల కలలు చూపిస్తున్నారని, తెలంగాణ ఆర్థిక వ్యవస్థను అధోగతి పాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ విముక్తి కోసం పోరాడిన కేసీఆర్ ప్రజల గుండెల్లో జాతిపిత గా నిలిచిపోతారని, అటువంటి మహనీయుడిని తూలనాడటం సూర్యుడిపై ఉమ్మి వేయడమేనని రేవంత్ రెడ్డికి హితవు పలికారు.
అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, ముఖ్యమంత్రి తన అహంకారాన్ని వీడకపోతే అది ఆయన వినాశనానికి దారితీస్తుందని శ్రవణ్ హెచ్చరించారు. ప్రజాస్వామ్యబద్ధంగా పాలన చేయాల్సింది పోయి, రౌడీ భాషతో విపక్షాలను భయపెట్టాలని చూడటం సరికాదని స్పష్టం చేశారు. సీఎం వ్యాఖ్యలపై పోలీసు ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.