MLC Kavitha: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయి మూడు నెలలు పూర్తవుతుంది. ఆమె 80 రోజులుగా తీహార్ జైలులోని ఆరవ నంబర్(మహిళ ఖైదీలు)కాంప్లెక్స్ లో ఉంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి సీబీఐ కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ జూన్ 21తో  ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆమెను శుక్రవారం (జూన్ 21) రౌస్ అవెన్యూ కోర్టు ముందు తీహార్ జైలు అధికారులు హాజరుపరచనున్నారు. అయితే.. ఆమెకు మరోసారి జ్యుడీషియల్ కస్టడీ పొడిగించే అవకాశం ఉన్నట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో.. శుక్రవారం ఈ కేసులో ఎలాంటి ట్విస్ట్ వెలుగు చూస్తుందన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది. 


 కవిత అరెస్ట్
ఢిల్లీ లిక్కర్ స్కాంలో  మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఈడీ అధికారుల బృందం ఎమ్మెల్సీ కవితను మార్చి 15వ తేదీన అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన అధికారుల బృందం  బంజారాహిల్స్ లోని కవిత ఇంట్లో సోదాలు నిర్వహించారు. సుమారు నాలుగైదు గంటల పాటు సోదాలు నిర్వహించారు.  మొదట ఆమెతో పాటు తన ఇంట్లోని పని చేస్తున్న వాళ్ల సెల్ ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కవిత గత పదేళ్ల నుంచి జరిపిన ఆర్థిక లావాదేవీలపై వివరాలు సేకరించారు. అదే రోజు సాయంత్రం 5:20 గంటలకు కవితను అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి కొన్ని రోజుల పాటు ఆమె ఈడీ కస్టడీలోనే ఉన్నారు.


ఆపై తనను తీహార్ జైలులో జ్యుడిషియల్ కస్టడీలో ఉంచారు. రెండు దఫాలుగా పది రోజుల ఈడీ  కస్టడీ అనంతరం మార్చి 26న  ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఆమెకు జ్యూడీషియల్  కస్టడీ విధించింది. 14 రోజులకు ఒకసారి కవిత జ్యుడీషియల్ కస్టడీ ని కోర్టు పొడిగిస్తూ వచ్చింది. తీహార్ జైల్లో జ్యూడీషియల్ కస్టడీలో ఉండగానే.. ఏప్రిల్ 11న కవితను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. మూడు రోజుల సీబీఐ కస్టడీ  తర్వాత సీబీఐ కేసులోనూ కోర్టు కవితకు జ్యూడీషియల్ కస్టడీ విధించింది. సీబీఐ కేసులో కవిత జ్యూడీషియల్ కస్టడీని మే20 వరకు రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది.  ఈడీ, సీబీఐల అరెస్ట్ లను సవాల్ చేస్తూ, బెయిల్ ఇవ్వాలంటూ కవిత దాఖలు చేసిన మధ్యంతర, రెగ్యులర్ బెయిల్ పిటిషన్లను రౌస్ ఎవెన్యూ కోర్టు తిరస్కరించింది.


ఆమె స్కాంలో కీలకం
కవితను అరెస్ట్ చేసిన తర్వాత సీబీఐ  కస్టడీ పిటిషన్‌లో సంచలన విషయాలను ప్రస్తావించింది. లిక్కర్ కేసులో కవితే ప్రధాన కుట్రదారు అని సీబీఐ ఆ పిటిషన్లో పేర్కొంది.  సౌత్ గ్రూప్‌కి గ్రూపునకు చెందిన ఓ వ్యాపారి  2021లో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను కలిశారని.. తమకు అనుకూలంగా మద్యం పాలసీని రూపొందించాలంటూ ఆయన కోరారని తెలిపింది. అలా చేసినందుకు గానూ ఆమ్ ఆద్మీ పార్టీకి  నిధులు ఇవ్వాలని కోరినట్లు సీబీఐ వివరించింది. ఇదంతా కవిత కనుసన్నల్లోనే నడిచినట్లు వెల్లడించింది.  ప్రస్తుతం కవిత కస్టడీ ముగియనుండడంతో  ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది ఆసక్తిగా మారింది.