Aravind Vs Kavita : నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ జాగ్రత్తగా.. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకపోతే చెప్పుతో కొడతానని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె .. ధర్మపురి అర్వింద్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నోటికొచ్చినట్లుగా మాట్లాడితే వెంటపడి కొడతామన్నారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే అర్వింద్‌ను వెంటపడి కొడతామన్నారు.పరిధి దాటితే మెత్తగా తంతామన్నారు. తమాషాలు చేస్తే ఊరుకోబోమన్నారు. ఇంకో సారి లైన్ దాటి మాట్లాడితే.. కొట్టి కొట్టి చంపుతామని హెచ్చరించారు. పసుపు బోర్డు తెస్తానని బాండ్ రాసిచ్చి రైతులను మోసం చేసిన ధర్మపురి అర్వింద్ పై రైతులు పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఆయనపై పోటీ చేసిన అభ్యర్థిగా తానే ఫిర్యాదు చేస్తానని ప్రకటించారు. నిజామాబాద్‌లోనే కాదు.. ధర్మపురి అరవింద్ ఎక్కడ పోటీ చేసినా తాను అక్కడి నుంచి పోటీ చేసి ఓడిస్తానన్నారు. రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ.. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే... నిజామాబాద్ దౌరస్తాలోనే చెప్పుతో కొడతానన్నారు. మాట తప్పినందుకు రైతుల కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పాలన్నారు.
హైదరాబాద్‌లోని ఎంపీ అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి !
ఎమ్మెల్సీ కవిత ప్రెస్ మీట్ పెట్టడానికి ముందు.. టీఆర్ఎస్ కార్యకర్తలు హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడి చేశారు. పెద్ద ఎత్తున ముట్టడికి వెళ్లారు. ఇంట్లోకి చొరబడి అద్దాలు , ఫర్నీచర్ ధ్వంసం చేశారు. దాడి జరుగుతున్న సమయంలో ఎంపీ అర్వింద్ నిజామాబాద్‌లో ఉన్నారు. తర్వాత అక్కడకు వచ్చిన పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తల్ని అక్కడి నుంచి పంపించేందుకు ప్రయత్నించారు. దీంతో గంటకు పైగా ధర్మపురి అర్వింద్ ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి.
కాంగ్రెస్‌లో చేరేందుకు కవిత ప్రయత్నించారని అర్వింద్ ప్రకటనతో వివాదం
గురువారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ధర్మపురి అర్వింద్ కాంగ్రెస్‌లో చేరాతనని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఫోన్ చేశారని ఆరోపించారు. తన తండ్రి మీద అలిగిన కవిత కాంగ్రెస్ లో చేరతానని.. మల్లిఖార్జున ఖర్గేకు ఫోన్ చేశారని అన్నారు. ఈ విషయం తెలిసిన కేసీఆర్.. సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ చనిపోయినప్పుడు కవితను తన వెంటే లక్నోకు తీసుకెళ్లారన్నారు. తన కూతురు తన వెంటే ఉన్నారని చెప్పేందుకు మీడియా ముందు డ్రామా ఆడారన్నారు. కవిత, కేటీఆర్ లను తమ పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రాన్ని, కేసీఆర్ ను కేటీఆర్, కవిత భ్రష్టుపట్టించారన్నారు. ఈ వ్యాఖ్యలపైనా టీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు.
కవితను బీజేపీలో చేరాలని ఒత్తిడి చేశారన్న కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన అర్వింద్ !
ధర్మపురి అర్వింద్.. కవిత కాంగ్రెస్‌లో చేరుతారని చేసిన ప్రకటనకు.. కారణం .. అంతకు ముందు టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో కేసీఆర్.. కవితను కూడా బీజేపీలో చేరాలని అడిగారని.. ఇంత కంటే ఘోరం ఉంటుందా అని పార్టీ నేతలతో అన్నట్లుగా ప్రచారం జరిగింది. దీనపై బీజేపీ నేతలు రకరకాలుగా స్పందించారు. కవిత కాదు..కేసీఆర్ వచ్చినా తమ పార్టీలో చేర్చుకునేది లేదన్నారు. అయితే అర్వింద్ మాత్రం మరో అడుగు ముందుకేసి ఆమె కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారని చెప్పడం కలకలం రేగింది.