MLC Jeevan Reddy clarified that He is not in the Congress : తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కష్టాలు తప్పడం లేదు. ఓ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తాను అసలు కాంగ్రెస్ పార్టీనే కాదన్నట్లుగా విమర్శలు చేస్తూంటే .. మరో ఎమ్మెల్సీ జీవన్  రెడ్డి మీ పార్టీకో దండం అనేశారు. ఆయన ఆవేశానికి కారణం.. తన ముఖ్య అనుచరుడు హత్యకు గురి  కావడం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో తన అనుచరుడిగా ఉన్న గంగారెడ్డికి మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఇప్పిద్దామని ఆయన ప్రయత్నిస్తున్నారు. సడెన్ గా గంగారెడ్డిని మంగళవారం ఉదయం దండగులు దారుణంగా హత్య చేశారు. తనను బలహీనం చేయడానికే ఇలా తన అనచరుల్ని టార్గెట్ చేస్తున్నారని జీవన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


ఫిరాయింపుల వల్లే హత్య జరిగిందని జీవన్ రెడ్డి ఆగ్రహం                  


అనుచరుడి హత్యపై జీవన్ రెడ్డి మండిపడుతున్నారు. జగిత్యాల-ధర్మపురి రహదారిపై నిరసన చేపట్టారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరుతో సహనం కోల్పోయిన జీవన్‌ రెడ్డి తీవ్ర ఆగ్రహం  వ్యక్తం చేశారు.  పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ చేసినా మధ్యలోనే పెట్టేశారు.  నేను పార్టీలో ఉండలేను. నాలుగు దశాబ్దాల కష్టానికి మంచి బహుమతి ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిరాయించి  పార్టీలోకి వచ్చిన వారే ఈ పని చేశారని జీవన్ రెడ్డి అనుమానిస్తున్నారు.   ఫిరాయింపులు ప్రోత్సహించొద్దని నాటి రాజీవ్ గాంధీ నుంచి నేటి రాహూల్ గాంధీ వరకు కోరుకున్నారు కానీ కేసీఆర్  చేశాడో..  కాంగ్రెస్‌ నాయకులు చేస్తున్నారన్నారు. 


ఎమ్మెల్యేను కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై ఆగ్రహం           


జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ ఎమ్మెల్యే. ఆయన పలుమార్లు ఎమ్మెల్యేగా చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత నిజామాబాద్ ఎంపీ టిక్కెట్ కూడా ఇచ్చారు. ఆ స్థానంలోనూ ఓడిపోయారు. అయితే హఠాత్తుగా బీఆర్ఎస్ తరపున గెలిచిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. దాదాపుగా పదేళ్లుగా ఆయనపై పోరాడుతున్న తమకు ఒక్క మాట చెప్పకుండా  కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం ఏమిటని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అప్పుడే పార్టీని వీడి పోతారన్న ప్రచారం జరిగింది. కానీ పార్టీ పెద్దలు బుజ్జగించడంతో ఆయన సైలెంట్ అయ్యారు. 


పార్టీకి గుడ్ బై చెప్పినట్లే ! 


కానీ రాను  రాను పార్టీలో ఆయనకు ప్రాధాన్యం లభించకపోవడం.. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాటే నియోజకవర్గంలో చెల్లుబాటు అవుతూండంతో అసహనానికి గురవుతున్నారు. ఇప్పుడు అనుచరుడి హత్య జరగడంతో ఆయన మరింతగా రగిలిపోయారు. ఇక పార్టీలో ఉండనని.. స్వచ్చంద సంస్థ  పెట్టుకుని ప్రజలకు సేవ చేస్తానని ఆయన అంటున్నారు. అయితే గంగారెడ్డి  హత్య పూర్తిగా వ్యక్తిగత కక్షలతో జరిగిందేనని పోలీసుల నిర్లక్ష్యం కానీ రాజకీయం కానీ లేదని ఆయన ఆవేశం తగ్గిన తర్వాత ఆలోచిస్తారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.