MLA Komatireddy imposed new rules for liquor shops: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నూతన వైన్ షాపులకు టెండర్ల ప్రక్రియ జరుగుతోంది. ఈ సందర్భంగా  మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న వైన్ షాపులకు టెండర్లు వేసే  వారికి గౌ  మునుగోడు శాసనసభ్యులు  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి షరతులు పెట్టారు.  నియోజకవర్గంలో ఇప్పటికే విచ్చలవిడిగా మద్యం  అందుబాటులో ఉందని.. అందుకే   బెల్ట్ షాపుల నిర్మూలన ఉద్యమం  చేపట్టి గ్రామాలలో బెల్ట్ షాపులు లేకుండా చేశామని ఎమ్మెల్యే తెలిపారు.  

సాయంత్రం నాలుగు గంటల నుంచి మాత్రమే మద్యం అమ్మాలి ! 

ఈ సారి మరో అడుగు ముందుకేసి నూతన వైన్ షాపులను దక్కించుకుంటున్నవారికి కొన్ని  షరతులు పెట్టారు. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా వైన్ షాపులను దక్కించుకునే  వారు  ఊరి బయట మాత్రమే వైన్ షాపులను పెట్టుకోవాలని స్పష్టం చేశారు.  సిట్టింగు లేకుండా చూసుకోవాలన్నారు.   బెల్ట్ షాపులకు మద్యం విక్రయించొద్దని, వైన్ షాపుల యజమానులు సిండికేట్ గా  మారవద్దని హెచ్చరించారు. మద్యాన్ని  సాయంత్రం 4:00 గంటల నుండి రాత్రి 9:00 గంటలకు మాత్రమే విక్రయించుకోవాలన్నారు.               

మద్యం అలవాటు తగ్గించడానికే కొత్త రూల్స్         

ఈ షరతులు ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదని నియోజకవర్గ ప్రజలు యువత మద్యం మత్తు వదిలి ఆర్థికంగా ఎదిగేదుందుకేనన్నారు. ఈ ప్రయత్నం వల్ల ప్రజల ఆరోగ్యం బాగుపడితే  వారి జీవన ప్రమాణాలు మెరుగు పడతాయని, ఇంట్లో యజమాని తాగకుండా ఉంటే మహిళలు ఆర్థికంగా సాధికారత సాధిస్తారని అందుకే ఇటువంటి సూచనలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు.  అయితే  తాను  మద్యానికి వ్యతిరేకం కాదని, ఉదయం నుండి సాయంత్రం వరకు అదే పని మీద తాగుతూ తాగుడుకు బానిసలుగా మారుతున్న  విధానానికి  మాత్రం వ్యతిరేకం అన్నారు.  ఉదయం నుండి సాయంత్రం వరకు పనిచేసుకోవాలని దాని తర్వాత తాగుడు గురించి ఆలోచించాలని మునుగోడు నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు.      

ఇవే రూల్స్ తో వినతి పత్రాన్ని ఎక్సైజ్ అధికారులకు ఇచ్చిన అనుచరులు                

గ్రామాలలో పర్యటిస్తున్న సందర్భంలో  యువత తాగుడుకు బానిసై విచక్షణారహితంగా ప్రవర్తించడం  చూశానని, ఎంతోమంది యువకులు 30 ఏళ్ల లోపు వారే  తాగుడుకు బానిసై చనిపోతే మహిళలు చిన్నతనంలోనే భర్తను కోల్పోయి  ఆ కుటుంబాలు రోడ్డు పాలవుతున్నాయని తమ పిల్లలను పోషించడానికి వారు పడరాని పాట్లు పడుతున్న ఆవేదనలో నుండి వచ్చిన నిర్ణయమే బెల్ట్ షాపుల నిర్మూలన, మద్యం షాపుల సమయాల మార్పు అని కోమటిరెడ్డి చెబుతున్నారు.  రాజగోపాల్ రెడ్డి  పిలుపుమేరకు   మునుగోడు నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ సూపర్ ఇండెంట్ కార్యాలయంలో వైన్ షాప్ టెండర్లు వేసే వారికి గమనిక అంటూ  కొన్ని అంశాలతో కూడిన వినతి పత్రాన్ని ఎక్సైజ్ సూపరిండెంట్ కు   అందించారు