Thummala Nageswararao: రైతుబంధుపై మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. సంక్రాంతి (Sankranti 2024) పండుగ తర్వాత రైతుబంధు లబ్ధిదారులందరికీ అకౌంట్లలో నగదు జమ చేస్తామని ప్రటించారు. అర్హులందరికీ రైతుబంధు (Rythu Bandhu) అందుతుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. రైతుబంధుపై అపోహలు సృష్టించవద్దని సూచించారు. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొంతమంది రైతుల అకౌంట్లలో రైతుబంధు నిధులు జమ చేశారు. కానీ మరికొంతమంది అకౌంట్లలో ఇప్పటివరకు డబ్బులు పడలేదు. దీంతో నగదు జమవ్వని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో పండుగ తర్వాత లబ్ధిదారులందరికీ అకౌంట్లలో నగదు జమ అవుతుందని, దానికి సంబంధించిన ప్రక్రియ జరుగుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. 


రైతుబంధు నిధుల విడుదలపై మంత్రి క్లారిటీ 
బుధవారం ఖమ్మం జిల్లాలోని కూసుమంచిలో తుమ్మల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రైతుబంధు నిధుల విడుదలపై క్లారిటీ ఇచ్చారు. చాలామంది రైతుబంధు నిధుల విడుదల కోసం ఎదురుచూస్తున్నారని, వారందరికీ త్వరలోనే పడతాయని స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాలన్నీ ప్రజల్లోకి వెళుతున్నాయని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నో పథకాలు మాటల వరకే పరిమితం అయ్యేవని, కానీ రేవంత్ ప్రభుత్వంలో అందరికీ అందుతున్నాయని అన్నారు. ప్రజల కోసం రేవంత్ రెడ్డి బాగా కష్టపడుతున్నారని, ఆయన శ్రమ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. అర్హులకు మాత్రమే ప్రభుత్వ పథకాలు అందిస్తామన్నారు. తెలంగాణలో కబ్జాల ప్రభుత్వం పోవాలని ప్రజలు భావించారని, అందుకే కాంగ్రెస్ పార్టీని ఆదరించారని తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.


తనకు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి పాలేరు, ఖమ్మం ఒకటేనని, ఖమ్మం జిల్లా ప్రజలందరికీ రుణపడి ఉంటామని తుమ్మల తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులం ఉన్నామని, జిల్లా అభివృద్ది కోసం కృషి చేస్తామని అన్నారు. పాలేరుకు సీతారామ ప్రాజెక్టు జలాలు వచ్చేలా చూస్తామన్నారు. 


27 లక్షల మందికి రైతు బంధు జమ.. 
కాగా 40 శాతం మంది లబ్ధిదారులకు ఇప్పటివరకు రైతుబంధు నిధులు విడుదల చేశారు. దాదాపు 27 లక్షల మంది రైతుల అకౌంట్లలో ఇటీవల జమ చేశారు. మిగిలినవారికి నిధులు విడుదలపై ఇటీవల ఆర్థిక, వ్యవసాయ శాఖ అధికారులతో తుమ్మల సమీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా రైతుల పంటల సాగు జోరందుకుందని, వీలైనంత త్వరగా డబ్బులు విడుదల చేయాలని ఆదేశించారు. ప్రతిరోజు నిధులు విడుదల అయ్యేలా చూడాలని సూచించారు. రైతులకు సకాలంలో రైతుబంధు నిధులు విడుదల చేయాలన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగాలేకపోయినా సకాలంలో రైతుబంధు నిధులు విడుదల చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.


అయితే ఆరు గ్యారెంటీల్లో భాగంగా తాము అధికారంలోకి వస్తే రైతుబంధు రూ.15 వేలు ఇస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. కానీ ఈ సీజన్‌కు పాత విధానాన్నే అమలు చేయాలని సీఎం రేవంత్ నిర్ణయించారు. వచ్చే సీజన్ నుంచి రూ.15 వేలు జమ చేయనున్నారు. రైతుబంధు పథకాన్ని రైతు భరోసా పథకంగా మార్చారు. వచ్చే సీజన్ నుంచి విధి విధానాల్లో పలు మార్పులు తీసుకురానున్నారు. త్వరలోనే విధి విధానాలపై క్లారిటీ రానుంది.