ఒక్క ఫోన్ కాల్‌తో ఇంటికి వచ్చి కరోనా రోగానికి చికిత్స అందిస్తామన్నారు తెలంగాణ ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్. మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించిన ఆయన.. "ఇంటింటా ఆరోగ్యం" కార్యక్రమంలో పాల్గొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఏనుగొండలో ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి జ్వరాలు , దగ్గు ఇతర ఏమైనా అనారోగ్య సమస్యలున్నాయా అని అడిగి తెలుసుకున్నారు.
ఇంటింట ఆరోగ్యం ” పేరుతో సర్వే నిర్వహించి జ్వరం, దగ్గు, ఇతర కరోనా లక్షణాలతో బాధపడుతున్న వారికి వైద్యం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు శ్రీనివాస్ గౌడ్.
ఇందులో భాగంగానే అన్ని జిల్లా కేంద్రాల్లో ఆక్సిజన్‌తో కూడిన పడకలతో సహా అవసరమైన మందులు, ఇతర ఏర్పాట్లు చేశామని, ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు.
మహబూబ్ నగర్ జిల్లాలో “ఇంటింటా ఆరోగ్యం ” కార్యక్రమంలో భాగంగా 1,89,319 ఇళ్లకు వైద్య ఆరోగ్య సిబ్బంది, ఆశా , అంగన్ వాడి కార్యకర్తలు వెళ్లి ప్రజల ఆరోగ్యంపై సర్వే చేస్తారని పేర్కొన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. జిల్లాలో 40 వేల కరోనా కిట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. అవసరమైతే మరో 1లక్ష కిట్లు పంపిణీ చేస్తామన్నారు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఎవరికైనా అనుమానం వస్తే ఇంటి దగ్గరే కిట్లు పంపిణీ చేస్తామని చికిత్స తీసుకోవాలని అన్నారు.
కరోనా వచ్చిన వెంటనే మందులు వేసుకొని భయపడకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు శ్రీనివాస్ గౌడ్. ఎవరికైనా చికిత్స అవసరమైతే 08542-241165 నెంబర్‌కు ఫోన్ చేస్తే వైద్య సిబ్బంది ఇంటికి వచ్చి చికిత్స అందించే ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు.
ఇంటింటా సర్వే నిమిత్తం చాలా బృందాలను ఏర్పాటు చేశామన్నారు జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు. 5 రోజుల్లో జిల్లా మొత్తాన్ని కవర్ చేసేలా లక్ష్యంగా తీసుకున్నట్లు తెలిపారు. 40 వేల కిట్లు రేడీ చేశామని ప్రతి ఇంటికి వెళ్లి అక్కడ పరిస్థితి గమనించి అవసరమైన చోట చికిత్స అందిస్తామన్నారు. ప్రతి మండలానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించామని, శుక్రవారం నుంచి ఉదయం ఏడు గంటలకే గ్రామాలకు వెళ్లి సర్వే ప్రారంభించామని, కరోనా నివారణలో గతం కన్నా మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.