Minister KTR: తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. ఐదు దశాబ్దాల పాటు రైతులకు సాగునీరు, ఎరువులు ఇవ్వకుండా, ప్రాజెక్టులు నిర్మించకుండా రాష్ట్రాన్ని అధోగతి పట్టించిన పార్టీ కాంగ్రెస్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎల్ రమణ తండ్రి సంతాప సభకు హాజరైన కేటీఆర్ నివాళులు అర్పించారు. అనంతరం జగిత్యాల జిల్లాలో పర్యటించారు. ఈక్రమంలోనే ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ నివాసానికి వెళ్లారు. అక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేసి పలు విషయాలపై మాట్లాడారు. ముఖ్యంగా.. బీఆర్ఎస్ కార్యాచరణను వివరించారు. రేపటి (జులై 17) నుంచి పది రోజుల పాటు రైతు వేదికల వద్ద రైతులతో సమావేశాలు ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశాల్లో మూడు పంటలు కావాలో, మూడు గంటల కరెంటు కావాలో రైతులే తీర్మానం చేస్తారని చెప్పారు. అలాగే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తీవ్గ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాహుల్ గాంధీకి ఎడ్లు తెలీదు, వడ్లు తెలీదు
రైతు కుటుంబాలన్నింటినీ రాచి రంపాన పెట్టిన కాంగ్రెస్ పార్టీ.. మరోసారి బాహాటంగా నిస్సిగ్గుగా, నిర్లజ్జగా, తన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి మాటల్లో రైతుల పట్ల వారికున్న అవగాహన లేమిని కుండ బద్ధలు కొట్టినట్లు మరోసారి బయట పెట్టారని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఎడ్లు తెల్వదు, వడ్లు తెల్వదంటూ ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీకి క్లబ్బులు, పబ్బులు మాత్రమే తెలుసంటూ ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ కార్యకర్త అని ఆయన ఏనాడైనా మోదీని ప్రశ్నించడం చూశామా అంటూ విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో రైతులను ఆ పార్టీ రాబందుల్లా పీక్కు తిందని మండిపడ్డారు. తెలంగాణ వ్యవసాయ విధానాన్ని పక్క రాష్ట్రాలు కూడా మెచ్చుకుంటున్నాయని గుర్తు చేశారు.
రేవంత్ రెడ్డి గాంధీ భవన్ లో ఉన్న గాడ్సే..
80 వేల కోట్ల రూపాయలతో చేసిన కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల స్కామ్ ఎలా జరిగిందో కాంగ్రెస్ పార్టీ నేతలే చెప్పాలని అన్నారు. అలాగే అప్పుడు అధికారంలో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ కాదని.. చంద్రబాబు కాంగ్రెస్ అని చెప్పుకొచ్చారు. రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని జగన్ ఆంధ్రకు తీసుకెళ్లారని విమర్శించారు. చంద్రబాబు కనుసైగల్లో తెలంగాణ కాంగ్రెస్ ఉందన్నారు. రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన కార్యకర్త అని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి పూర్వాశ్రమం అంతా ఆర్ఎస్ఎస్ దేనంటూ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంలో రేవంత్ రెడ్డి సిద్ధహస్తుడని అన్నారు. రేవంత్ రెడ్డి గాంధీ భవన్ లో ఉన్న గాడ్సే అంటూ కామెంట్లు చేశారు. అలాగే ఆయన కుమారుడు హిమాన్షు చేసిన వ్యాఖ్యలపై కూడా మంత్రి కేటీఆర్ స్పందించారు. హిమాన్షు మాట్లాడిన మాటల్లో తప్పేం లేదని ప్రతి పాఠశాలను కేసీఆర్ సర్కారే బాగు చేస్తుందని వివరించారు.