పసి బిడ్డల్ని ఆడించడం ఎవరికి మాత్రం నచ్చదు. ఎవరు ఎంత పెద్ద హోదాల్లో ఉన్నా, పిల్లల్ని ఆడించాలంటే, వారి వయసుకు వెళ్లిపోవాల్సిందే. వారు నవ్వే బోసి నవ్వులకు ఎవరైనా సరే ఫిదా అవుతారు. వారి చేష్టలు ముద్దు ముద్దు మాటలకు మనం కాదనకున్నా చేతులు ఆ చిన్నారిని ఎత్తుకునేందుకు వెళ్లిపోతాయి. ఎంత బిజీలో ఉన్నా ఆ చిన్నారులతో గడిపే సమయం అద్భుతంగానే ఉంటుంది. తాజాగా మంత్రి కేటీఆర్ కూడా పిల్లల్ని ఆడించిన వీడియో బయటికి వచ్చింది. 

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇటీవల లండన్ పర్యటనకు వెళ్లారు. ఆ పర్యటనలో భాగంగా యూకేలో ఎన్నారై బీఆర్ఎస్ విభాగం ప్రధాన కార్యదర్శి, తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యూకే అధ్యక్షుడు రత్నాకర్ ఇంటికి మంత్రి కేటీఆర్ వెళ్లారు. మంత్రి కేటీఆర్ తన ఇంటికి రావడంపై రత్నాకర్ సంతోషం వ్యక్తం చేస్తూ ఆయన తన ట్విటర్‌లో వీడియో పోస్ట్ చేశారు. 

‘‘దయగల దేవుడు అయి ఉండి, మన ప్రార్థనలు విన్నప్పుడు మన జీవితంలో కొన్ని మిరాకిల్స్ జరుగుతాయి. మేము ఎంతగానో అభిమానించే మా డైనమిక్ లీడర్ కేటీఆర్ అన్న.. లండన్ లోని మా ఇంటికి వచ్చారు. మా కుమారుడు రణవ్ ని ఆశీర్వదించారు. ఈ అద్భుతమైన సందర్భానికి కృతజ్ఞతని వ్యక్త పర్చడానికి నాకు మాటలు రావడం లేదు. థ్యాంక్యూ రామన్నా’’ అని మంత్రి కేటీఆర్‌ను ట్యాగ్ చేస్తూ రత్నాకర్ ట్వీట్ చేశారు. అందులో మంత్రి కేటీఆర్ తన ఇంటికి వచ్చిన వీడియోని కూడా జత చేశారు. 

ఈ సందర్భంగా నెలల బాబు అయిన రత్నాకర్ కుమారుడు రణవ్‌ని మంత్రి కేటీఆర్ బాగా ఆడించారు. కేటీఆర్ ఆ బాలుడిని భుజంపై వేసుకుని నిద్రపుచ్చడానికి ప్రయత్నించారు. తన ఇంటికి కేటీఆర్ వచ్చి తన కుటుంబానికి ఎనలేని సంతోషాన్ని కలిగించిన మంత్రి కేటీఆర్‌కు రత్నాకర్ కృతజ్ఞతలు తెలిపారు. బాస్, లీడర్, బ్రదర్ లవ్ అనే హ్యాష్‌ట్యాగ్‌లు యాడ్ చేసి తన అభిమానాన్ని చాటుకున్నారు. 

Also Read: Mogilaiah Komuramma: బలగం మొగిలయ్య, కొమురమ్మ దంపతులకు ఊహించని గిఫ్ట్! అందజేసిన మంత్రి ఎర్రబెల్లి

ఆ వీడియోను మంత్రి కేటీఆర్ కూడా రీట్వీట్ చేశారు. ఎన్నారైలు చూపుతున్న ప్రేమకు సంతోషం వ్యక్తం చేస్తూ మంత్రి కేటీఆర్ నవ్వుతున్న ఎమోజీని పోస్ట్ చేశారు. ఇది నిజంగా సంతోషించాల్సిన విషయం అంటూ రీట్వీట్ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.