డబ్బులు చాలా మందికి ఉండవచ్చు కానీ.. మంచి చేయాలన కొందరికే ఉంటుందని, ఆ ఆలోచన రావడం గొప్ప విషయమని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఒకప్పుడు మహబూబ్‌నగర్ అంటే మైగ్రేషన్ అని.. ఇప్పుడు ఇరిగేషన్ అనేలా జిల్లా మారిందని అన్నారు. మహబూబ్‌నగర్ పిల్లలమర్రి రోడ్డులో ఉన్న బాలికల ఐటీఐ కాలేజీలో సెయింట్ ఫౌండేషన్, శాంతా నారాయణ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ నిర్మాణానికి భూమి పూజ, శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్ల ప్రదాన కార్యక్రమం జరిగింది. ఆ సర్టిఫికెట్లను మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి కేటీఆర్ అందజేశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడారు.
మోహన్‌రెడ్డి ఇక్కడ స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయడం గొప్ప విషయమని ప్రశంసించారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం వెయ్యి గురుకులాలు ఏర్పాటు చేసిందని, 6 లక్షల మంది విద్యార్థులకు అత్యుత్తమ విద్య అందించి, పెద్ద వ్యవస్థల్లో సీట్లు సంపాదించారని గుర్తు చేశారు. అది తమకు ఎంతో ఆనందకరమైన విషయమని అన్నారు.
హైదరాబాద్ గురించి మాట్లాడుతూ.. హైదరాబాద్ మారింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. 24 గంటల కరెంటు ఉండడం నిజం కాదా? ఈ తొమ్మిదేళ్లలో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం? అని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ రావడం.. గతంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30 శాతంగా ఉన్న ప్రసూతి చేరికలు ఇప్పుడు 60 శాతానికి చేరిందని అన్నారు.
పరిశ్రమల కల్పనకు ఆ రోజుల్లో రెడ్ టేప్ ఉంటే.. నేడు రెడ్ కార్పొరేట్ పరుస్తున్నామని తెలిపారు. నైపుణ్యాలను అందిపుచ్చుకుంటే భవిష్యత్ మనదేనని అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయని, ఉపాధి అవకాశాలు అంతేలా ఉంటాయని అన్నారు. అందరూ స్కిల్ సంపాదించుకుంటే ఉద్యోగాలు వాటికవే వస్తాయని అన్నారు. అంతకుముందు భూత్పూర్‌లో మున్సిపల్ పార్కు, ఓపెన్ జిమ్‌లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి నాయకత్వంలో దేవరకద్ర నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతుందని తెలిపారు. రాష్ట్రంలోనే అత్యధిక చెక్‌డ్యాంలు నిర్మించిన నియోజకవర్గం దేవరకద్ర అని చెప్పారు. ఇక్కడ రెండు ప్రభుత్వ ఇళ్ల నిర్మాణం చేపడతామని అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో దేవరకద్ర నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మంత్రి కేటీఆర్ కృషితోనే తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ కొనసాగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.