సోషల్‌ మీడియాలో తప్ప తెలంగాణలో బీజేపీ లేదని మంత్రి కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. కొద్ది రోజులుగా రాష్ట్రంలో అధికార పార్టీ, బీజేపీ నేతల మధ్య మాటల యద్దం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం, హోంమంత్రి అమిత్‌ షా లక్ష్యంగా మంత్రి కేటీఆర్‌ విమర్శలు చేశారు. ఇదే సమయంలో తెలంగాణలో వచ్చే ఎన్నికల ఫలితాల్లో కచ్చితంగా తామే గెలుస్తామని, వచ్చే ఎన్నికల్లో 90 నుంచి 100 సీట్లు గెలుస్తామని చెప్పారు. ఇక తెలంగాణలో తమతో పోటీ పడే పరిస్థితి కాంగ్రెస్‌ పార్టీకి లేదని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కొద్ది నెలల్లో అధికారంలోకి వస్తామంటూ కాంగ్రెస్ పార్టీ భ్రమల్లో బతుకుతోందని అన్నారు.


విపక్షాలకు సీఎం అభ్య‌ర్థి ఎవ‌రో చెప్పే ద‌మ్ము ఉందా..?
ప్రతిపక్షాలకు పనిలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని, చేతిలో ఉన్న రూపాయిని పడేసి, చిల్లర ఏరుకోవద్దని కేటీఆర్‌ అన్నారు. చిల్లర రాజకీయాలు చేసే నేతలను ప్రజలు పట్టించుకోరని విమర్శించారు. దేశం అన్ని రంగాల్లో వెనుకబడటానికి బీజేపీనే కారణమని అన్నారు. ఓ వైపు మణిపూర్‌లో గందరగోళం జరుగుతుంటే అమిత్‌ షా కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని గుర్తు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు త‌మ సీఎం అభ్య‌ర్థి ఎవ‌రో చెప్పే ద‌మ్ము ఉందా? అని కేటీఆర్ ప్ర‌శ్నించారు. రాహుల్ గాంధీ ఒక పార్టీ కాకుండా ఎన్జీవో, దుకాణాన్ని న‌డుపుకోవాలని ఎద్దేవా చేశారు. గుజ‌రాత్‌లో ఎన్నిక‌లు జ‌రుగుతుంటే రాహుల్ గాంధీ పారిపోయాడనని అన్నారు. పీవీ న‌ర‌సింహారావును అవ‌మానించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.


మోదీ ప్ర‌భుత్వం అన్ని రంగాల్లో విఫ‌ల‌మైందని కేటీఆర్ అన్నారు. మోదీ ప్ర‌భుత్వం గ‌ద్దె దిగాల్సిన అవ‌స‌రం ఉందని అన్నారు. బీజేపీకి ద‌మ్ముంటే దేశానికి చేసిన మంచి ప‌నులు ఏంటో చెప్పాలని, నోట్ల ర‌ద్దుతో ఏం సాధించారో మోదీ ప్ర‌జ‌ల‌కు స‌మాధానం చెప్పాలని అన్నారు. ఇప్పుడు రూ. 2 వేల నోట్ల ర‌ద్దుతో సాధించింది ఏంటో కూడా చెప్పాలి అని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షాలు ఇక్కడ లేని నిరుద్యోగం గురించి నిర‌స‌న‌లు చేస్తున్నారని తప్పుబట్టారు. తాము విదేశీ ప‌ర్య‌ట‌న‌లు చేసి వేలాది మందికి ఉద్యోగాలు క‌ల్పిస్తున్నామని గుర్తు చేశారు. తాజా లండన్, అమెరికా ప‌ర్యట‌న‌తో 42 వేల మందికి ఉద్యోగ అవ‌కాశాలు తీసుకొచ్చామని కేటీఆర్ తెలిపారు.


ఇక్కడ విమర్శలు, వేరే రాష్ట్రాల్లో పొగడ్తలా?
ఓవైసీ గురించి స్పందిస్తూ, ఓ వైపు ఓవైసీ తమపై విమర్శలు చేస్తున్నారని, మరో రాష్ట్రానికి వెళ్లి, ఇతర రాష్ట్రాల్లో తెలంగాణ విధానాలు బాగున్నాయని అంటున్నారని అన్నారు. డీలిమిటేషన్‌పై అన్ని పార్టీలు ఏకం కావాలని అన్నారు. డీలిమిటేషన్‌ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని అన్నారు. మైనార్టీల‌కు తెలంగాణ ప్రభుత్వం చేసిన కార్య‌క్ర‌మాల‌ను ప‌క్క రాష్ట్రాల్లో పొగిడిన ఓవైసీ ఇక్క‌డ ఎందుకు విమ‌ర్శ‌లు చేస్తున్నారని కేటీఆర్ ప్ర‌శ్నించారు. ఎన్ని సీట్ల‌లో పోటీ చేస్తార‌న్న‌ది పూర్తిగా ఎంఐఎం పార్టీ వ్యక్తిగత విషయమని అన్నారు. ప్ర‌జలు మ‌త ప్ర‌ాతిపాదిక‌న ఓట్లు వేస్తార‌ని తాను నమ్మబోవడం లేదని అన్నారు. మంచి ప్ర‌భుత్వాన్ని మ‌తాల‌కు అతీతంగా ఎన్నుకుంటార‌ని న‌మ్ముతున్నానని కేటీఆర్ పేర్కొన్నారు.