Indrakaran Reddy: చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ రద్దు చేయాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పోస్ట్ కార్డు రాశారు. రా ష్ట్ర మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు చేనేతపై విధిస్తున్న జీఎస్టీకి నిరసన వ్యక్తం చేస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి బుధవారం ఉత్తరం రాసి నిరసన తెలియజేశారు. చేనేత వస్త్రాలు, ఉత్పత్తులపై ఉన్న 5 శాతం జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ భారాన్ని కేంద్ర ప్రభుత్వం మోపడం సరికాదని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, బీజీపీ కేంద్ర ప్రభుత్వానికి నేతన్నల ఉసురు తగులుతుందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. 



గతంలో ఎన్నడూ లేనివిధంగా విధంగా చేనేతపై 5% జీఎస్టీ విధింపుతో ఎన్నో దశబ్దాలుగా చేనేతనే నమ్ముకుని స్వయం ఉపాధిపై ఆధారపడ్డ నేతన్నల పరిస్థితి మూలిగే నక్కపై తాటి కాయ పడ్డట్లు తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం విధించిన ఐదు శాతం జీఎస్టీని రద్దు చేయాలని కోరుతూ ప్రధాని మోదీకి లక్షలాదిగా పోస్ట్ కార్డులు రాసి తమ నిరసన వ్యక్తం చేస్తూ... నేతన్నలకు అండగా నిలబడాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. 


చేనేతపై పన్ను విధించిన తొలి ప్రధాని మోదీయే..


చేనేత వస్త్రాలపై పన్ను విధించిన తొలి ప్రధాని మోదీ అని మంత్రి కేటీఆర్ విమర్శించారు. మునుగోడు నియోజకవర్గంలోని నేతన్నలతో మంత్రి టెలీకాన్ఫెరెన్స్ ద్వారా మాట్లాడారు. చేనేత, టెక్స్‌టైల్ రంగానికి తీరని ద్రోహం చేస్తున్న బీజేపీకి మునుగోడు నేతన్నలు గట్టిగా బుద్ధి చెప్పాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. నేతన్నల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను వివరించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో నేతన్నలకు గుర్తింపు, గౌరవం లభించిందన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏడాదికి రూ.1200 కోట్ల భారీ నిధులను బడ్జెట్లో కేటాయిస్తూ వస్తున్నామని కేటీఆర్ తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా భారీగా యార్న్ సబ్సిడీ చేనేత మిత్ర పథకం ద్వారా అందిస్తున్నామని స్పష్టం చేశారు. నేతన్నకు చేయుత పొదుపు కార్యక్రమం ద్వారా చేనేత కార్మికుల పొదుపు మొత్తానికి రెట్టింపుగా ప్రభుత్వం అందిస్తున్నదని తెలిపారు. రైతు బీమా మాదిరే నేతన్నల కోసం ఐదు లక్షల బీమా సదుపాయాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. నారాయణపేటలో ఇంటిగ్రేటెడ్ చేనేత అభివృద్ధి కేంద్రంతోపాటు గద్వాలలో చేనేత పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ నేతన్నలకు తెలిపారు. 


నేతన్నలపై కేంద్రం కక్ష 


టీఆర్ఎస్ ప్రభుత్వం నేతన్న కోసం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలుచేస్తుంటే కేంద్రం మాత్రం నేతన్నలపైన కక్ష కట్టిందని కేటీఆర్ ఆరోపించారు. దేశ చరిత్రలో ఏ ప్రధాని చేనేత వస్త్రాల పైన పన్ను వేయలేదని, కానీ బీజేపీ ప్రభుత్వం జీఎస్టీ విధించిందన్నారు. ప్రస్తుతమున్న ఐదు శాతం జీఎస్టీని 12 శాతానికి పెంచే కుట్రలు కూడా బీజేపీ చేస్తుందని కేటీఆర్ ఆరోపించారు. స్వదేశీ మంత్రంతో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ వ్యవసాయ రంగం తర్వాత అత్యంత ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న చేనేత రంగాన్ని పూర్తిగా సంక్షోభంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. చేనేత పరిశ్రమ పూర్తిగా దివాళా తీసేలా కేంద్ర ప్రభుత్వ చర్యలు ఉన్నాయన్నారు. ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డు, ఆల్ ఇండియా హ్యాండీక్రాఫ్ట్స్ బోర్డ్, చేనేతల పొదుపు పథకం, చేనేతలకు ఉన్న బీమా పథకం, చేనేతల హౌస్ కం వర్క్ షెడ్ వంటి కీలకమైన సంక్షేమ కార్యక్రమాలను రద్దుచేసి చేనేత పట్ల మోదీ ప్రభుత్వం కక్షతో వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. చేనేతలకు ఇచ్చే యార్న్ సబ్సిడీలను 40% నుంచి 15 శాతానికి తగ్గించి చేనేత వస్త్రాల ఉత్పత్తిపై కేంద్రం చావుదెబ్బ కొట్టిందన్నారు.