తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు కాసేపు కూరగాయలు అమ్మారు. రైతు బజారులో కూరగాయలు అమ్ముతున్న రైతులతో కలసి మెలిసి మార్కెట్ మొత్తం తిరుగుతూ వారితో ముచ్చటించారు. వారి సమస్యలనే కాకుండా, ఇంకా ఏం కావాలనుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు. ఆ సమయంలోనే మంత్రి కూరగాయలు తక్కెడ పట్టుకొని కూరగాయలు అమ్మారు. అది చూసి వినియోగదారులు కూడా ఆశ్చర్యానికి లోనైయ్యారు. 


స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం (ఆగస్టు 15) సిద్దిపేటలో పలు కార్యక్రమాల్లో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. అలా సిద్దిపేట పట్టణంలోని రైతు బజార్ ను మంత్రి హరీష్ రావు ఆకస్మికంగా సందర్శించారు. అక్కడ కూరగాయలు అమ్ముతున్న రైతులతో మంత్రి ముచ్చటించారు. పొలాలకు విద్యుత్ సరఫరా అవుతున్న తీరు, వేసవిలో చెరువుల్లో నీటి లభ్యత ఎలా ఉంది వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అదే సమయంలో ఓ వినియోగదారునికి మంత్రి స్వయంగా కూరగాయలు తక్కెడలో తూకం వేసి సంచిలో కూడా వేశారు. దీంతో వినియోగ దారులు సంతోషం అవధులు లేకుండా పోయాయి.




రైతు బీమాకు ఐదేళ్లు


ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టి ఐదు సంవత్సరాలు అయిందని అన్నారు. ‘‘ఏ కారణంతో రైతు చనిపోయినా ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2018 ఆగస్టు 15న ప్రారంభించిన రైతు బీమా పథకం నేటితో ఐదేండ్లు పూర్తి చేసుకున్నది. అర్హులైన రైతులందరి తరపున ప్రభుత్వమే ఎల్ఐసికి (LIC)ప్రీమియం చెల్లిస్తూ, ఇంటి పెద్దను కోల్పోయిన ఆ కుటుంబానికి రూ. 5లక్షల ఆర్థిక సాయం అందిస్తూ బాసటగా నిలుస్తున్నది. 


పథకం ప్రారంభించిన తొలి ఏడాది 2018-19లో 31.25 లక్షల మంది రైతులు తమ పేరు నమోదు చేసుకోగా, 2023-24 నాటికి ఆ సంఖ్య 41.04 లక్షలకు పెరిగింది. 2018 లో రూ.602 కోట్లు ప్రీమియంగా చెల్లిస్తే, నేడు రూ.1477 కోట్లు ప్రీమియంగా చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు రైతుల తరపున ప్రభుత్వం రూ. 6861 కోట్లు ప్రీమియం రూపంలో చెల్లించగా, వివిధ కారణాలతో ప్రాణం కోల్పోయిన రైతు కుటుంబాలకు రూ. 5,402 కోట్ల ఆర్థిక సాయం అందించింది. గుంట భూమి ఉన్నా చాలు, రైతుగా గుర్తించి, ఆ రైతన్న మరణిస్తే ఆ కుటుంబానికి రూ.5 లక్షలు అందించే అద్భుతమైన రైతు బీమా పథకం ప్రపంచంలో మరెక్కడా లేదు.’’ అని హరీశ్ రావు తెలిపారు.