Minister Harish Rao Counters Governor Tamilisai: సచివాలయం ప్రారంభోత్సవానికి గవర్నర్‌ను పిలవాలని రాజ్యాంగంలో ఉందా అని హరీష్ రావు ప్రశ్నించారు. మీడియా చిట్‌చాట్‌లో ఆయన గవర్నర్ తమిళిసైని ఉద్దేశించి అనేక వ్యాఖ్యానాలు చేశారు. గవర్నర్‌ ఒక డాక్టరై ఉండి, ప్రజలకు వైద్య సదుపాయాలు అందకుండా చేయడం న్యాయమా అని నిలదీశారు. మహిళా గవర్నర్ అయినందకు గౌరవం ఉందని.. కానీ ఆమె తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా పని చేస్తున్నారని విమర్శించారు.

హరీష్ రావు ఇంకా ఏమన్నారంటే..

‘‘సచివాలయం ప్రారంభానికి గవర్నర్‌ని పిలవాలని రాజ్యాంగంలో ఉందా? పార్లమెంటు భవనం శంఖుస్థాపనకు రాష్ట్రపతిని పిలిచారా? వందేభారత్ ట్రైన్ల ప్రారంభానికి రాష్ట్రపతిని పిలుస్తున్నారా? మహిళా గవర్నర్ గా ఆమెపై మాకు గౌరవం ఉంది! కానీ ఆమె తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా పని చేస్తున్నారు! ఎమ్మెల్యే పొదెం వీరయ్య వినతిపత్రం ఇచ్చారని భద్రాచలం విలీన గ్రామాల బిల్లును ఆపారు! వైద్యశాఖలోప్రొఫెసర్ల పదవీ విరమణ వయస్సు పెంపు బిల్లును గవర్నర్ ఆపారు. ఆ బిల్లులో అభ్యంతరకరమైన అంశాలు ఏమేం ఉన్నాయి? అనేక రాష్ట్రాల్లో 65 నుంచి 70 ఏండ్లకు పదవీ విరమణ పెంచారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ గైడ్ లైన్స్ ప్రకారం పదవి విరమణ వయసును పెంచవచ్చు. వేరే రాష్ట్రాల్లో లేని అభ్యంతరం ఇక్కడ గవర్నర్‌కు ఎందుకు?’’

ఉమ్మడి జాబితాలో కొన్ని అంశాలు రాష్ట్రం జాబితా లో మరి కొన్ని అంశాలు ఉంటాయి. వాటికనుగుణంగా బిల్లులు ఉన్నాయా లేవా అని చూడటం వరకే గవర్నర్ బాధ్యత! సుప్రీంకోర్టులో ఏమైనా కేసులు ఉంటే గవర్నర్ బిల్లులు ఆపొచ్చు. ఆ బిల్లుల్లో అలాంటివి ఏమైనా ఉన్నాయా? పదవీ విరమణ వయస్సు బిల్లును ఏడు నెలలు ఆపడం ఎంత వరకు కరెక్ట్? బెంగాల్లో 70 యేండ్లు ఉన్నపుడు ఇక్కడ 65కు కూడా గవర్నర్ ఒప్పుకోరా? ఒక డాక్టర్ అయి ఉండి ప్రజలకు వైద్య సదుపాయాలు అందకుండా చేయడం న్యాయమా? రాష్ట్ర ప్రయోజనాలకు గవర్నర్ భంగం కలిగించడం లేదా? సుప్రీంకోర్టులో కేసు వేసేదాకా గవర్నర్ స్పందించలేదు, చివరకు తిరస్కరించి రాష్ట్రపతికి పంపారు ముఖ్యమైన బిల్లులు ఆపడం ద్వారా గవర్నర్ ప్రజలకు విద్య వైద్యం దూరం చేస్తున్నారు! నా ప్రభుత్వం అంటూనే గవర్నర్ వెన్నుపోటు పొడుస్తున్నారు!

హరీశ్ రావు వ్యాఖ్యలు

  • నోటితో నవ్వుతూ నొసటితో గవర్నర్ వెక్కిరిస్తున్నారు!
  • గతంలో 5 ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లుకు ఆమోదం తెలిపిన గవర్నర్..
  • ఇపుడు అలాంటి బిల్లునే ఎందుకు అడ్డుకుంటున్నారు?
  • మహారాష్ట్ర కర్నాటకల్లో ప్రైవేట్ యూనివర్సిటీలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. అవి బీజేపీ పాలిత రాష్ట్రాలే కదా!
  • సిద్దిపేటలో వెటర్నరీ కాలేజీ మంజూరు అయ్యింది.. దానికి ప్రొఫెసర్ల కొరత ఉంది
  • గవర్నర్ ఆ బిల్లును అడ్డుకోవడం ద్వారా రాష్ట్ర ప్రగతిని అడ్డుకోవడం కాదా?
  • జీ 20 సమావేశాల్లో గవర్నర్ తెలంగాణ ఆత్మ గౌరవం దెబ్బతీసేలా మాట్లాడారు
  • కేసీఆర్ గురించి ఆమె మాట్లాడిన మాటలు తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయి!
  • కేసీఆర్ మామూలు వ్యక్తా? ఇన్నిసార్లు రాజీనామా చేసి గెలిచిన నేత ఎవరైనా ఉన్నారా?
  • గవర్నర్ ఎన్నిసార్లు పోటీ చేసినా, గెలిచారా?
  • మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరమో, మీ ఇంటికి మా ఇల్లు అంతే దూరం!
  • ఈ సామెతను గవర్నర్ తెలుసుకోవాలి
  • ఒక్క బటన్ నొక్కి కేసీఆర్ ఎనిమిది మెడికల్ కాలేజీలు ప్రారంభించారు!
  • ఒక్క ఎయిమ్స్ తెచ్చి ప్రధాని డబ్బా కొట్టుకున్నారు
  • ప్రధాని తన కార్యక్రమాలకు రాష్ట్రపతిని ఎందుకు పిలవడం లేదని అంటున్నమా?
  • మేం చాలా సంయమనంతో ఉంటున్నాం
  • జీ 20 సమావేశంలో హైదరాబాద్ ప్రతిష్టను మంటగలిపేలా మాట్లాడారు!
  • రజనీకాంత్ తమిళనాడు నుంచి వచ్చిన వ్యక్తి.. ఆయన ఉన్నదున్నట్టు మాట్లాడారు
  • గవర్నర్‌కు ఆయనకు తెలిసిన విషయాలు కూడా తెలియవా?
  • పంచాయతీ, స్థానికసంస్థల్లో అవిశ్వాసానికి 4ఏళ్ల కనిష్ట పరిమితినిపెంచితే, గవర్నర్‌కు వచ్చిన ఇబ్బంది ఏమిటి?  
  • గవర్నర్ బీజేపీ కనుసన్నల్లో పని చేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు!
  • గవర్నర్‌కు రాజకీయాలు ఇష్టముంటే వెళ్లి బీజేపీలో చేరి పోటీ చేయొచ్చు!