Medak Men Marriage: మెదక్‌ జిల్లాలో ఇద్దరు మగాళ్లు పెళ్లి చేసుకున్నారు.. ఒక యువకుడి మెడలో మరొక వ్యక్తి తాళి కట్టాడు. ఈ మధ్య స్వలింగ సంపర్కులు పెళ్లి చేసుకుంటుండడం చూస్తూనే ఉన్నాం కదా అంటారా? కానీ, వీళ్లేమీ స్వలింగ సంపర్కులు కాదు. కనీసం వారిద్దరికి ఒకరిపై మరొకరికీ ప్రేమ అంతకన్నా లేదు. మరి ఇలా ఏ కారణంతో వీరు పెళ్లి చేసుకున్నారా? అని ఆశ్చర్యపోతున్నారా? ఈ ఇద్దరూ తాగిన మైకంలో ఒళ్లు తెలియకుండా పెళ్లి చేసుకున్నారు. ఒకరు తాళి కడుతుంటే ఇంకొకరు (Men Marriage) కట్టించుకున్నారు. అంతటితో ఆగలేదు. తాను కాపురానికి వచ్చానంటూ తాళి కట్టించుకున్న యువకుడు.. కట్టిన యువకుడి ఇంటికి వచ్చేశాడు. నానా గోల చేశాడు. అతని తల్లిదండ్రులు తిట్టి పంపినా కూడా వినలేదు. ఏకంగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లిపోయి ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది.


మెదక్‌ జిల్లా (Medak) చిలప్‌చెడ్‌లో (Chilipched) మంగళవారం ఈ మగాళ్ల పెళ్లి (Men Marriage) వ్యవహారం వెలుగు చూసింది. ఈ ఇద్దరు యువకుల్లో ఒకరు సంగారెడ్డి (Sangareddy) జిల్లా జోగిపేటకు (Jogipet) చెందిన 21 ఏళ్ల యువకుడు. ఇక రెండో వ్యక్తి మెదక్ జిల్లా చిలప్‌చెడ్‌ (Chilipched) మండలం చండూర్‌కి చెందిన 22 ఏళ్ల యువకుడు. ఇతను ఆటో డ్రైవరుగా పని చేస్తున్నాడు. వీరిద్దరికీ కొద్ది కాలం క్రితం కొల్చారం మండలం దుంపల కుంటలోని ఓ కల్లు దుకాణంలో కలుసుకున్నారు. అలా ఏర్పడిన పరిచయం కారణంగా ఇద్దరూ తాగేందుకు అప్పుడప్పుడూ కలిసేవారు. ఆ క్రమంలోనే ఈ నెల 1న తాగిన మైకంలో ఉన్న వీరిద్దరూ ఒళ్లు తెలియని స్థితిలో పెళ్లి చేసుకున్నారు. 


చండూర్‌ యువకుడితో జోగిపేట (Jogipet) యువకుడు తాళి కట్టించుకున్నాడు. ఆ తర్వాత తాను అతనితో కాపురానికి వచ్చానంటూ తాళి కట్టించుకున్న యువకుడు.. కట్టిన యువకుడి ఇంటికి వచ్చి బీభత్సం చేశాడు. అతని తల్లిదండ్రులు తిట్టి పంపేస్తే నేరుగా అక్కడి నుంచి పోలీస్ స్టేషన్‌కి వెళ్లిపోయి ఫిర్యాదు చేశాడు. రూ.లక్ష ఇస్తే కానీ తాను ఇచ్చిన ఫిర్యాదును వాపసు తీసుకోనని మొండికేశాడు. 


ఇక చివరికి పోలీసులు, గ్రామ పెద్దలు ఇద్దరు యువకుల కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. చివరికి చండూర్‌ యువకుడి కుటుంబీకులతో జోగిపేట వ్యక్తికి రూ.10 వేలు ఇప్పించడంతో కథ సుఖాంతం అయింది. జోగిపేట యువకుడు ఫిర్యాదు వాపసు తీసుకున్నట్లు చిలప్‌చెడ్‌ పోలీసులు తెలిపారు.