New York Telangana Telugu Association | అమెరికాలో మన తెలుగువారు ఏం చేసినా అది వేరే లెవల్. తెలుగు పండుగుల ముచ్చటకొస్తే ఇంక మాటల్లో చెప్పనక్కర్లేదు. సంక్రాంతి మొదలు బతుకమ్మ వరకూ పండుగంటే ఎట్లుంటదో అమెరికా వాళ్లకు చూపించాలంటే మన తెలుగువారి తరువాతే మరెవరైనా. తాజాగా అమెరికాలో జరిగిన మహిళాదినోత్సవ వేడుకలు , అదే రోజు మహాశివరాత్రి పండుగ ఒకే వేదికపై జరుపుకుని తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను వెలుగెత్తి చాటారు.
గణేష్ టెంపుల్ ఆడిటోరియంలో వేడుకలు
అమెరికావాణిజ్య రాజధాని న్యూయార్క్ లో కళ్లు చెదిరేలా అత్యంత వైభవంగా ఈ వేడుకలు నిర్వహించారు. తెలంగాణ తెలుగు సంఘం (నైటా) ఆధ్వర్యంలో ఫ్లషింగ్ గణేష్ టెంపుల్ ఆడిటోరియంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. వందలాది మంది తెలంగాణ, తెలుగు వాసులు తమ కుటుంబాలతో సహా కలసి ఉత్సవాల్లో పాల్గొని ఆడి పాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ మాట్లాడుతూ అమెరికాతో పాటు న్యూ యార్క్ మహానగరం అభివృద్ది, సంస్కృతిలో తెలుగువారు అంతర్భాగం అయ్యారని కొనియాడారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్కమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీతక్క, తదితర ప్రముఖులు ప్రత్యేక సందేశాల ద్వారా నైటా కార్యక్రమాలను, ఆర్గనైజింగ్ కమిటీ కృషిని ప్రశంసిస్తూ ప్రత్యేక సందేశాలను పంపారు. నైటా వార్షికోత్సవ సావనీర్ ను ఈ సందర్భంగా విడుదల చేశారు. ఈ ఫెస్టివల్ ఈవెంట్ లో తెలంగాణ సూపర్ రైటర్, సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ కాసర్ల శ్యామ్ తో పాటు, యూకే నుంచి సింగర్ స్వాతి రెడ్డి, డాన్సింగ్ అప్సరాస్ గా పేరొందిన టీ అండ్ టీ సిస్టర్స్, ఇండియన్ ఫేమస్ ఫ్యూజన్ మ్యూజిక్ గ్రూప్ పరంపరా లైవ్ ఫెర్మామెన్స్ తో అదరగొట్టారు. కొన్ని గంటల పాటు జరిగిన కార్యక్రమం ఆద్యంతం అందరినీ కట్టిపడేసింది.
తెలుగు యువత గుండెల్లో చిరకాలం నిలిచిపోయే పాటలను రచించటంతో పాటు, పాడిన యువ గాయకుడు కాసర్ల శ్యామ్ తెలుగు హిట్ సాంగ్స్ తో అందరినీ ఉర్రూతలూగించారు. అమెరికాలో తెలుగువారి బలగాన్ని, బలాన్ని తన పాటల ద్వారా శ్యామ్ చాటి చెప్పారు. కాస్త ఆలస్యంగానైనా న్యూయార్క్ తెలుగువారు శివరాత్రి వేడుకలు జరుపుకున్నా ఆధ్యాత్మిక గీతాలు, చిన్నారులు భక్తి పాటలతో ఆడిటోరియటం మారు మోగింది. న్యూయార్క్ మహానగరంలో నిత్యం వారి వారి వృత్తుల్లో బిజీగా ఉండే మన తెలుగు వారు అన్నింటినీ పక్కన పెట్టి అటు శివ భక్తి, ఇటు మహిళా దినోత్సవాన్ని ఒకే సారి వేడుకగా జరుపుకున్నారు.ఆకట్టుకునే డ్రస్ కోడ్ తో చిన్నారులు చేసిన కూచిపూడి నృత్యాలు ఆద్యాంతం వీక్షలను అలరించాయి. మహాశివునిపై ప్రత్యేకంగా రూపొందించిన యువతుల నాట్యం వారెవ్వా అనిపించింది. ముఖ్యంగా అమెరికాలో ఉన్న తెలంగాణ వాసులు మాత్రమేకాదు, న్యూయార్క్ నగరంలోని ప్రముఖులు, ప్రజాప్రతినిధులు సైతం నైటా వేడుకులకు ఫిదా అయ్యారు. పండుగల విశిష్టతను మాత్రమేకాదు మహిళలలో ఆత్మస్ధైర్యం నింపేలా మహిళా దినోత్సవ ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటిచప్పడంతోాపాటు, దేశ సరిహద్దులు దాటినా తెలంగాణ మహిళల ప్రత్యేకత, ఆచార సంప్రదాలను గౌరవించుకోవడం నైటా కు ప్రతీ ఏాటా ఆనవాయితీగా వస్తోంది.